వినదగునెవ్వరు చెప్పిన...
close

అంతర్యామి

వినదగునెవ్వరు చెప్పిన...

నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం మొదటిది. శ్రవణం వల్ల ముక్తి లభించినవారిలో పరీక్షిత్తు అగ్రగణ్యుడు. వినడం, ఆలకించడం, శ్రవణం చేయడం పర్యాయ పదాలే! విషయం మీద అనాసక్తి, మనసు పెట్టకపోవడం, నిర్లక్ష్యం...  వీటివల్ల ఏదైనా విషయం చెవి నుంచి హృదయానికి చేరదు. ఆచరణ శూన్యం. కంఠశోష తప్ప కార్యాచరణ లేదు అంటారు.
వినేవాడు పరీక్షిత్తు లాంటి జిజ్ఞాసువు, చెప్పేవారు శుకమహర్షి వంటి జ్ఞాన గురువు, విషయం భాగవతం అయినప్పుడు మోక్షం సప్తాహంలో సిద్ధిస్తుంది.
జనక మహారాజు రాజర్షి. వైరాగ్యంలో మేటి. ఆయన జ్ఞానమార్గం తెలుసుకోదలచి అష్టావక్రుణ్ని ఆశ్రయించాడు. ‘మహర్షీ, ఎన్ని సంవత్సరాలలో నేను జ్ఞాన సంపదను పొందగలను’ అని ప్రశ్నించాడు. దానికి అష్టావక్రుడు ‘రాజా! నీలో జ్ఞానం పట్ల శ్రద్ధ ఉంటే, తెలుసుకోవాలనే తపన తపస్సులా మారితే నీవు వేటకు వెళ్ళే సమయంలో గుర్రాన్ని అధిరోహించడానికి ఒక రికాబు మీద కాలు వేసి పైకెక్కి అటుపక్క ఉన్నదానిపై కాలు వేసే సమయంలో నేను నీకు జ్ఞానవాహినిని బోధించగలను’ అంటాడు. శ్రద్ధ, భక్తి అనే విషయంపై ఆసక్తి, గురువు మీద విశ్వాసం ఉంటే క్షణాల్లో జ్ఞానబోధ అందగలదని దీని సారాంశం.
భోజ మహారాజు దగ్గరికి మూడు బొమ్మలు తెచ్చి వీటిలో ఏ బొమ్మ విశిష్టమైందో చెప్పాలని కోరతారు. మూడు బొమ్మలను పరీక్షింపదలచి ఒక ఇనుప తీగ తెప్పించి మొదటి బొమ్మ చెవిలో దూర్పగా తీగ రెండో చెవిలోంచి వచ్చింది. రెండో బొమ్మలో చెవిలోంచి వెళ్ళిన తీగ నోటిలోంచి వచ్చింది. మూడో బొమ్మ చెవిలో నుంచి హృదయంలోకి వెళ్ళింది. భోజరాజు- మొదటి బొమ్మ ఈ చెవితో విని రెండో చెవితో వదిలేసే వారికి ప్రతీక, రెండో బొమ్మ చెవితో విని నోటితో చిలక పలుకుల్లా పలికే వారిలాంటిది, మూడో బొమ్మ విన్న విషయాన్ని మనసుకు చేర్చుకుని ఆచరించే ఉత్తముల వంటిది... కనుక మూడో బొమ్మ విశిష్టమైంది అని తీర్పు చెప్పాడు.
కొంతమంది ఎంతటి ప్రాధాన్యం కలిగిన విషయాన్నయినా తేలిగ్గా వదిలేస్తారు. విన్న విషయం ఆచరణలో పెట్టరు. దాని వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు విజ్ఞులు.
శ్రవణం, స్మరణం, నిధి, ధ్యాస అనేవి నాలుగు సాధనా మార్గాలు. విన్నదాన్ని మరుపు లేకుండా నిరంతరం స్మరించాలి. దాన్ని మేధలో నిధిలాగా  నిక్షిప్తం గావించాలి. ధ్యాస ఉంచి అవసరమైనప్పుడు ఆచరణలో పెట్టాలి. అదే విజ్ఞానానికి సార్థకత.
కొంతమంది గ్రంథాలను చూసి వదిలేస్తారు. విషయాలను విని వదిలేస్తారు. సత్యమార్గాన్ని తెలుసు కోవడం తప్ప ఆచరించరు. నిజమైన సాధకుడి లక్షణాలు ఇవి కావని పెద్దలు పేర్కొంటారు.
పుస్తకాలను హస్త భూషణాలుగా పరిగణించి ప్రయోజనంలేదు, ఉండదు. అలమరా నిండా గ్రంథాలు ఉంటే ఏం లాభం... వాటిని చదివి జీవితంలో అన్వయించుకోవాలి. భారత, భాగవత పురాణాలు వినడం వల్ల ప్రయోజనం- వాటిలోని విలువలను పాటించినప్పుడే.
తెలుసుకోవాలనే శ్రద్ధతో గురువును ప్రశ్నించు, నీలోని విద్యను ప్రకటించడానికి గురువును పరీక్షించ డానికి ప్రశ్నించకు- అని భగవద్గీత పరిప్రశ్నగా బోధిస్తుంది.
భక్తి మార్గాలెన్ని ఉన్నా- మనిషిలో ఉత్సాహం, ఉత్తేజం, స్ఫూర్తి కలిగేది మొదట విన్నప్పుడే. విని, దాన్ని ఆచరించి, ఆదర్శంగా నిలిచారు యుగపురుషులు.

- రావులపాటి వెంకట రామారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న