సమతౌల్యం
close

అంతర్యామి

సమతౌల్యం

జీవితంలో సంతులనం కోల్పోయిన మనుషులు సమాజానికి భారం అవుతారు. అలాంటి వారే నేరస్థులుగా పరిణమించే అవకాశమూ ఉంది. సమాజం సమతౌల్యం కోల్పోయిన సమయంలో మనసులు చెదిరిన ప్రజలు అనేకులు నేరాలతో చెలరేగిపోయే ముప్పుంది. సమాజం శాంతిని కోల్పోయినప్పుడు అరాచకం ప్రబలకుండా కాపాడవలసిన బాధ్యత పరిపాలకులది. వృత్తిలో ఆటంకాలు, ఎదురీతలు వ్యక్తిగత సామర్థ్యాలనూ దెబ్బతీస్తాయి. బయటకు కనిపించే వ్యక్తి గుణాలు అతడి అసలైన వ్యక్తిత్వాన్ని సరిగ్గా నిర్వచిస్తాయని చెప్పలేం! వ్యక్తిగత జీవితంలో మనిషికి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఆనందాన్ని హాయిగా అనుభవించే సామాన్యుడు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వడగాలిలో కమలిన దాహార్తుడిలా నీరవ నిస్సార స్థితికి చేరుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో అటువంటి వారి ప్రవర్తనలో కొత్త పోకడలు కనిపిస్తాయి. దానినే సమతుల్యత లోపించిన స్థితికి దర్పణంగా చెప్పవచ్చు. కొన్ని సమయాల్లో మానవుడిలో ఆసురీశక్తులు ప్రబలుతాయి. విజృంభిస్తాయి. అనుకున్న కార్యాన్ని సాధించలేకపోయినప్పుడు మనిషిలో మోర ఎత్తి చూసే ప్రధాన శత్రువు ‘కోపం’! కోపం మనో చాంచల్యాన్ని సృష్టిస్తుంది. మనో దౌర్బల్యం దౌర్భాగ్య స్థితికి చేరువచేస్తుంది. ఆ స్థితిలో మనిషి మనసు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనంలా ప్రమాదకారకమవుతుంది. విషయాలపై మనసును నిలిపే శక్తిని మనిషి కోల్పోతాడు. ఆ సమయంలో అందుకు విరుగుడుగా మనిషి ఆంతరిక మిత్రులను ఆశ్రయించాలి. ఆ మిత్రులు... కరుణ, ప్రేమ, జాలి, ఔదార్యం, నిరాడంబరత వంటివి. వీటి ప్రభావం వల్ల మనిషి ఊరటను పొందుతాడు. వికారాలు నశిస్తాయి. ఆనందం ఆవిర్భవిస్తుంది. మనసు సమతుల్యమవుతుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నాలుగు జీవన వృత్తులను ప్రస్తావించాడు. భగవానుడు ప్రతిపాదించింది జన్మ వల్ల సంక్రమించే కుల వ్యవస్థ కాదు. అది ఆచరించడం, అవలంబించడం వల్ల సిద్ధించేది. మతాలకు అతీతమైనది. మిగతా కుల వృతుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. స్వీకరించిన కుల ధర్మాన్ని నిర్ద్వంద్వంగా, నిష్కాపట్యంగా అనుసరించినప్పుడే వృత్తికి న్యాయం చేకూరుతుందని భగవానుడి ఉవాచ.
ఓ ఓడ సముద్ర మధ్యంలో ప్రయాణిస్తోంది. వాతావరణం అనుకూలంగా లేదు. వాతావరణ సూచనను అనుసరించి మరికొన్ని గంటల్లో తుపాను కారణంగా ఓడ ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని తెలియవచ్చింది. సరంగులు తదనుగుణమైన చర్యలు చేపట్టారు. దుర్బల మనస్కులు కొందరు రాగల ప్రమాదాన్ని కొండంతగా ఊహించి కుంగుబాటుకు లోనయ్యారు. వాస్తవంగా ఓడ ప్రమాదంలో చిక్కుకోలేదు. కుంగుబాటుకు గురైనవారు నెమ్మదిగా తేరుకున్నారు. ఆ ప్రకటన చెవినపడనివారు ఎలాంటి ఒడుదొడుకులూ లేక స్థిరమైన మనసుతో హాయిగా ఉన్నారు. మనసు సంతులనంగా ఉండటంలో, లోపలి, వెలుపలి శక్తుల ప్రమేయం అధికంగా ఉంటుందని బోధపడు తుంది. అయితే అన్ని బయటి శక్తులనూ మనిషి నియంత్రించలేడు. ఆంతరిక శక్తులపై విజయంతో కొన్ని బాహ్యశక్తులను వశంలోకి తెచ్చుకొనే అవకాశం సమర్థుడికి కలుగుతుంది. తద్వారా మనస్సంతులనం మనిషికి సాధ్యమవుతుంది. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు. వయసుతో ఎదుగుతూ మనసు పరంగానూ ఎదిగేవారు కొందరు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే అపర మేధాశక్తితో ప్రకాశించేవారు మరికొందరు! చరిత్రగానీ పురాణేతిహాసాలు గానీ పరిశీలిస్తే స్థిర మనస్కులే మహత్తర విజయాలు సాధించినట్లు కనిపిస్తుంది. సమతౌల్యం అందరూ సాధించవలసిన అధిక ప్రాధాన్య అంశమని భావించడంలోనే లక్ష్యంపై తొలి గెలుపు సాధించినట్లవుతుందని సాధకుడు గ్రహించాలి.

- గోపాలుని రఘుపతిరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న