విశ్వవిజేత
close

అంతర్యామి

విశ్వవిజేత

నిర్వాణం అన్న పదానికి నానా అర్థాలున్నాయి. ముక్తి, అస్తమయం, మృతి, నాశనం, మునగడం, చల్లారడం వంటివి. జీవితానికి అర్థం, పరమార్థం ఉన్నాయి. జీవితంలో ప్రేమ, భక్తి, సేవ మొదలైన క్రియాశీల చర్యలకు అవకాశం ఉండాలి. ‘ఇంకా తెలుసుకోవాలి, ఏదో సాధించాలి...’ అన్న తపనకు, పొందిన విజయాలకు, తదుపరి లభించే శాంతికి, ఆనందానికి జీవితం ఒక నిలయంగా రూపొందాలి.

గీత చెప్పే బ్రహ్మ నిర్వాణం ఇదే. బ్రహ్మలీనం అంటే కూటస్థ చైతన్యంలో ఏకమై బాహ్య చైతన్యానికి దూరం కావడం, దాన్నే ‘పాక్‌ పరిపక్వ శరీర విమోచనం’ అదే మోక్షం అంటున్నాయి శాస్త్ర గ్రంథాలు. యోగి ప్రశాంత మనస్కుడై, జ్ఞానానంద హృదయుడు కావడమే బ్రహ్మ నిర్వాణం. అంటే జీవ బ్రహ్మ పరబ్రహ్మగా పరిణతి చెందడం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అహంకారం తొలగడమే బ్రహ్మ నిర్వాణ స్థితి పొందడానికి అనువైన మార్గం అన్నమాట.

నేను-నువ్వు, నాది-నీది అన్న భేద భావనకు బదులు అందరం ఒకటే, అన్నీ అందరివీ అని తెలుసుకునే స్థాయికి ఎదిగినప్పుడు ఆ యోగ సాధకుడు జీవన్ముక్తుడై బ్రహ్మమే అవుతాడు. లోక కల్యాణం కోసం పాటుపడే మనిషి దేవుడితో సమానం. నిర్వాణానికి ఇప్పుడు సరైన అర్థం చెప్పుకోవడానికి వీలవుతుంది.
ఈ ప్రపంచ వేదికపైన తనకు చేతనైనంత వరకు సాయపడటమే మానవ కర్తవ్యం. క్షరాక్షరుల మధ్య ఒకే అక్షరం తేడా. క్షర పురుషుడు అక్షర పురుషుడిగా మారినప్పుడు పురుషోత్తముడికి ప్రీతి పాత్రుడు అవుతాడు. నిర్వాణం అన్న పదాన్ని ‘స’ కారాత్మకంగానే స్వీకరించాలి. నాశనం కావలసింది మనలోని పరిమితత్వం, స్వార్థం, అహంకారం. అందుకే నిర్వాణానికి ‘జీవిత వ్యామోహాల నుంచి సంపూర్ణ విముక్తిని పొందడం’ అనే అర్థాన్నీ ఇచ్చాయి నిఘంటువులు.

ఎదగడానికి అడ్డుగోడల్లా నిలిచే ప్రకృతి పరమైన త్రిగుణాలను గెలిచి నిలిచినప్పుడే మోక్షద్వారం తెరుచుకుని, నిజరూపదర్శనం దొరుకుతుంది. చిత్తవృత్తులను నిరోధించి రాజద్వారంలో నిలిచిన యోగిరాజు బ్రహ్మస్థితికి చేరుకోగలడు. జనకుడు మొదలైన రాజయోగులు లోపల బయట ఉన్న ఉభయ రాజ్యాలను సజావుగా ఏలగలిగారు. మౌనంగానే మహాకార్యాలు సాధించగలిగారు. మహాయాన బౌద్ధులు విశ్వంలో సానుభూతి, సాహార్దంతో కూడిన కర్మవీరులను దైవంగా ఆరాధించారు. బుద్ధుడు దేవుడై మహాయాన ఆలయాలలో కొలువుతీరాడు. ఆలయ సంస్కృతికి మహాయాన బౌద్ధులే ఆదిమూలాలని ప్రతీతి.

పరిమితమైన మానవుడు పరిపూర్ణుడు కావడానికి కర్మక్షేత్రం ఈ భూలోకమే. జీవిత పాఠశాలలో, కళాశాలలో పట్టభద్రుడు సుభద్రుడై శీతోష్ణ సుఖ దుఃఖాలకు, మానావమానాలకు అతీతుడు కావడమే జీవితాశయం. నన్ను అన్ని చోట్లా అన్నింటిలో చూడగలిగినవాడే నావాడు; నేను వాడి యోగక్షేమాలను చూడగలనని కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. సృష్టి సర్వాన్ని ఆకళించుకుని, సర్వత్రా విజయుడై, అన్నింటికీ అతీతంగా మనగలిగినవాడు జితసర్గుడు- అంటే, నిజమైన విశ్వవిజేత, భగవంతుడికి అత్యంత ప్రియుడు. సాక్షాత్తు బుద్ధుడే నిర్వాణ ద్వారం దగ్గరకు పోయి వెనక్కి తిరిగి చూశాడు. బాధ నుంచి ముక్తి పొందనివాడు, అహంకారం నుంచి బయటపడనివాడు ఈ ప్రపంచంలో ఒక్కడు మిగిలి ఉన్నా ఆ ద్వారాన్ని దాటి లోపలికి పోను అని శపథం చేశాడు!

- ఉప్పురాఘవేంద్రరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న