పద్యం - హృద్యం
close

అంతర్యామి

పద్యం - హృద్యం

ర్షంలో తడవని వారు, పోతన పద్య ధారతో తృప్తి చెందనివారు నిన్నమొన్నటి దాకా ఈ గడ్డపై లేరంటే అతిశయోక్తి కాదు. భాగవతంలోని పద్యం ఒక్కటైనా రాని తెలుగువారు అరుదుగా ఉండేవారు. ఈ పద్యాలు చెవులకు, చవులకు విందు చేస్తాయి.
భాగవతంలో కనిపించే ధర్మ భావనలు, చేసిన మర్మ బోధనలు చేదుమాత్రకు చక్కెర పూతలా ఉండి, జాతినంతటినీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అందుకు కారణం పోతన చేపట్టిన అనువాదం భుక్తి కోసమో, సుఖానురక్తి కోసమో కాకుండా- భక్తికోసం, జీవన్ముక్తి కోసం కావడమే. గురు శిష్య పరంపరకు ఆద్యులైన నరనారాయణులు ఉపదేశించిన నారాయణతత్వమే భాగవత పురాణంగా విస్తృతి చెందింది.
పోతన పద్యాల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాటిలో లొసుగు ముసుగు లేకుండా విషయాన్ని కచ్చితంగా చెప్పడం ఒకటి. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క బోధన, ఒక్కొక్క సూచన. ఆదినుంచి అంతం వరకు అడుగడుగునా, ఎన్నో రసగుళికలు... మరెన్నో మధుకలశాలు. మచ్చుకు కొన్నింటిని స్మరించుకుందాం.
‘గర్భ, జన్మ, జరా మరణాదులతో కూడిందే సంసారం. వాటి బంధనాలను ఛేదించుకుంటేనే మోక్షం కలుగుతుంది. దానికోసం శరీరధారి అయిన ప్రతి మానవుడూ ధార్మిక కర్మలను ఆచరిం చడం అనివార్యం’ అని కచ్చితంగా చెప్పాడు ఒక పద్యంలో.
‘చేతులు జోడించి, మనస్ఫూర్తిగా భగవంతుణ్ని పూజించనివాడు, కంఠమెత్తి అలసిపోయేవరకు శ్రీహరి గుణవైభవాలను కీర్తిస్తూ గానం చేయనివాడు, భూత దయ- సత్యవర్తన లేనివాడు... మానవుడిగా జన్మించడం వ్యర్థమే’ అని సూటిగా బోధించాడు మరో పద్యంలో.
ప్రపంచంలో ఏ సమయంలోనైనా రాక్షస బాధకలిగితే, ఆయా సమయాలకు తగిన అవతారం దాల్చి కాపాడేవాడు శ్రీహరి. కాబట్టి అవకాశం చిక్కినప్పుడల్లా విష్ణు కథలను చదివితే సంసార దుఃఖం తొలగిపోతుంది. ‘ఈ విశ్వమంతా ఎవరి నుంచి పుట్టి, ఎవరి లోపల ఉండి, ఎవని యందు లయించిపోతుందో, అంతకూ మూలకారణం పరమేశ్వరుడు. అతడు ఆదిమధ్యాంతాలు లేనివాడు, ఈ సమస్తమూ తానే అయినవాడు. అటువంటి సర్వాంతర్యామి అయిన ఈశ్వరుని శరణు కోరాలి’ అని చెప్పాడు మరో పద్యంలో.
కపటం ఏ మాత్రమైనా లేకుండా, ఎప్పుడూ మనసు నుంచి వీడని భక్తితో ప్రవర్తిస్తూ, ఎవడు శ్రీహరి దివ్యపాదపద్మాల సుగంధ పరిమళాలను ఆస్వాదిస్తాడో- అతడు బ్రహ్మరుద్రాదులకైనా సాధ్యం కాని శ్రీహరి దివ్యలీలలను గ్రహించగలడు.
పవిత్రమైన శ్రీహరి చరిత్రతో కూడిన కావ్యాలు సకల పాపాలనూ పటాపంచలు చేస్తాయి. అందుకే సజ్జనులైన తపోధనులు ఆ శ్రీహరి లీలల్ని నిరంతరమూ గానం చేస్తూ, ఆయన నామాన్ని జపిస్తూ, ఆయన కథల్ని వింటూ జన్మ సార్థకం చేసుకోవాలి..... అంటూ సందర్భానుసారం సరళంగా, సున్నితంగా, సుబోధకంగా పద్య రూపంలో ఎన్నో రకాల బోధనలు చేశాడు పోతన.
ఆయన భాగవత అనువాదం అన్ని రకాల వృత్త- జాతిపద్యాల్లో సాగినప్పటికీ నైతిక జ్ఞాన బోధనలు చేసే విషయాలకు మాత్రం కందం, ఆటవెలది, తేటగీతులనే ఎన్నుకున్నాడు. క్లుప్తత, సారళ్యం, సుబోధకం- ఈ పద్యాల ప్రత్యేకత.

- అయ్యగారి శ్రీనివాసరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న