క్రోధం - శాంతం

అంతర్యామి

క్రోధం - శాంతం

రిషడ్వర్గాల్లో క్రోధమంత ప్రమాదకరమైనది మరొకటి లేదు. అందుకే క్రోధాన్ని అగ్నితో పోలుస్తారు పెద్దలు. అగ్ని బాహ్యపదార్థాలను నాశనంచేస్తే క్రోధం మనిషి శీలాన్ని, శక్తియుక్తుల్ని దహించివేస్తుంది.

సకల అనర్థాలకు మూలం క్రోధం. క్రోధంవల్ల ధర్మబుద్ధి కూడా నశిస్తుంది. రాబోయే క్రోధాన్ని ముందుగానే గ్రహించి అది రాకుండా చూసుకోవాలంటాడు భర్తృహరి. క్రోధం మనిషిని మూర్ఖుడిగా మారుస్తుంది. ఆలోచనా రహితుణ్ని చేస్తుంది. ఆలోచనా శక్తి మనిషిలో ఎప్పుడు నశించిందో అప్పుడు జ్ఞాపకశక్తి కూడా అణిగిపోతుంది. వివేకం తొలగిపోతుంది. వివేకం కోల్పోయిన మనిషి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు. ఇన్ని అనర్థాలకు మూలమైన కోపం వల్ల మోక్షప్రాప్తి దూరమవుతుందని, కోపాన్ని త్యజించమని బోధిస్తాడు గీతాకారుడు.

‘తన కోపమే తన శత్రువు’ అని సుమతీ శతక కర్త బద్దెన హితవు చెబుతాడు. విశ్వామిత్రుడు అనేకమార్లు ఆగ్రహంతో, ఆవేశంతో తన తపశ్శక్తిని కోల్పోయాడు. తిరిగి తపస్సుచేసి దాన్ని సముపార్జించుకున్నాడు. శిశుపాలుడు, రావణుడు, హిరణ్యకశిపుడు... ఇలా ఎందరో క్రోధాహంకారాలకు బలైపోయారు. క్రోధం కాఠిన్యాన్ని పెంచుతుంది. ఫలితంగా మనిషి దానవుడై విధ్వంసకర కార్యక్రమాలకు పూనుకొంటాడు.

దుర్వాస మహాముని విష్ణుభక్తుడైన అంబరీషుడి మీద కోపాన్ని ప్రదర్శించాడు. ఆ తరవాత విష్ణుదేవుడి చక్రం నుంచి వెలువడిన అగ్నిజ్వాలల బారినపడి నానాయాతనలూ అనుభవించాడు.

సాత్వికాహారం, సద్గ్రంథపఠనం, సత్సాంగత్యం, ధ్యానం, తీర్థయాత్రలు, సేవాగుణం... ఇవన్నీ క్రోధాన్ని దూరం చేస్తాయి. వీటివల్ల మనిషి మానవతా మూర్తిగా మారతాడు.

ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మనిషి ఆవేశకావేషాలకు లోను కాకూడదు. కొన్ని క్షణాలు మౌనంగా, ఏకాంతంగా గడపాలి. లేదా ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలి. అలా ప్రవర్తించినప్పుడు మనిషిలో క్రోధావేశాలు అణిగిపోతాయి.

క్రోధావేశాలు అణిగినప్పుడే మనిషిలో శాంతం ప్రవేశిస్తుంది. అప్పుడే మనిషి ప్రవర్తనలో చక్కటి మార్పొస్తుంది. కోపం వల్ల మనిషికి ఎంత హాని కలుగుతుందో శాంతం వల్ల అంతటి ప్రయోజనం  చేకూరుతుంది.

శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు త్యాగరాజు. శాంతగుణం అందరికీ శుభాన్ని కలిగిస్తుంది. మనిషికి మేలుచేస్తుంది. శాంతం కలవారు మానావమానాలను, కష్టసుఖాలను సమానంగా భావిస్తారు. శాంతచిత్తులైనవారికి సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి.

అన్ని పురాణాలూ శాంతరసానికే అగ్రస్థానం కట్టబెట్టాయి. మన పురాణాల్లో ధర్మరాజు, వసిష్ఠుడు, విదురుడు శాంతమూర్తులుగా పేరుగడించి ఎందరికో ఆదర్శప్రాయులయ్యారు.

శాంతం సంతోషానికి స్థావరం. అది హాయిని కలిగించే చలువ పందిరి. మనిషికి భూషణం లాంటిది. శాంతం, ప్రేమలతో మనిషి ఎంతటి కష్టతర కార్యాన్నయినా అవలీలగా సాధించగలడు.

శాంతంతో సమానమైన తపస్సు లేదని ఆర్షధర్మం వివరించింది. శాంతగుణం ఉన్న మనిషి రుషితుల్యుడు. ఆ వ్యక్తికి అందరూ మిత్రులే. శాంతస్వభావం మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

గౌతమ బుద్ధుడు, గాంధీ మహాత్ముడు శాంతగుణంతోనే తమతమ లక్ష్యాలు సాధించి అందరికీ మార్గదర్శకులయ్యారు. శాంతగుణం అలవరచుకున్న మనిషికి శత్రువులుండరు. అతడు అందరినీ ప్రేమిస్తాడు. అందరికీ మిత్రుడవుతాడు!

- విశ్వనాథ రమ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న