కర్మ రహస్యం

అంతర్యామి

కర్మ రహస్యం

దీక్షలో ఉండి నాలుగు రోజులు ఉపవాసం చేయగలం. అత్యవసరమైతే నిద్రను త్యాగం చేసి పని చెయ్యగలం. యోగాభ్యాసం చేసి కొన్ని క్షణాలు ఊపిరి ఆపి బతకగలం. కాని, మనకు తెలియకుండా శరీరంలో జరిగే చాలా పనులను ఆపలేం. కర్మలు చెయ్యకుండా ఉండలేం. నిరంతరం కర్మ జరుగుతూనే ఉంటుంది.

ఏ పనీ చెయ్యకుండా కూర్చున్నాను కదా, కర్మకు అతీతుణ్ని అనుకునే అవకాశం లేదు. ప్రయత్న పూర్వకంగా జరిగే కర్మలతోపాటు స్వచ్ఛందంగా జరిగే కర్మలూ ఉన్నాయి. శరీరం ప్రకృతికి అనుసంధానమై కర్మలు చేస్తూనే ఉంటుంది. రక్తం ప్రవహించాలి. గుండె కొట్టుకోవాలి. జీర్ణక్రియ నడవాలి. మలమూత్ర విసర్జన జరగాలి. ఎన్నో కర్మలు...

భూమి నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఆ భూమ్మీద మనం ఉన్నాం. దాని తిరుగుడు మనకు అనుభవంలో లేదు. కాని మనం కూడా తిరుగుతున్నాం. మనకూ ఒక గమనం ఉంది. అది మన మనసు గ్రహించగలిగే ఆవరణలో లేదు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చేస్తున్నవే పనులు కావు. విశ్వాత్మకమైన ఎన్నో కర్మలకు అనుగుణంగా జీవుల శరీరాలు పనిచేస్తూ ఉన్నాయి. అందరూ పని చేస్తూనే ఉండాలి. కర్మ చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు, ఉండబోరు అని గీతాచార్యుడు వెల్లడించాడు.

కర్మయోగ రహస్యాన్నీ విశదీకరించాడు. కర్మలు చేస్తూ ఉంటే, మనకు ఈ జన్మలో ప్రకృతి కేటాయించిన కర్మలు తరిగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి కర్మల వల్ల కర్మలు పుడుతూ ఉంటాయి. ఇదొక వలయం. కర్మను యోగ మార్గంలో చెయ్యాలి. అప్పుడే ఆ కర్మ మనకు అంటకుండా ఉంటుంది. కర్మ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. అకర్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. వికర్మ లక్షణాలు తెలుసుకోవాలి. ఈ విషయం నిర్ణయించడంలో విద్వాంసులూ భ్రాంతికి లోనవుతున్నారు.

పనిచేస్తున్నా చేయనట్లు ఉండటం, పని చేయకుండా ఉండటంలో కూడా పనుందని గ్రహించేవాడే బుద్ధిశాలి. అతడు కర్మయోగి, సమస్త కర్మలు చేస్తున్న వాడని భగవద్గీత తెలియజేస్తోంది. ఏం దొరికితే అది తిని ప్రసాదభావంతో ఉండాలి. అసూయ ఉండకూడదు. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి. ఏది వచ్చినా ఏది పోయినా సమదృష్టి కలిగి ఉండాలి. అలాంటి వ్యక్తి వెయ్యి పనులు చేస్తున్నా, ఆ పనుల ప్రభావంలో అతడు ఇరుక్కోడు.

పని నేను చేస్తున్నానన్న భావం ఉండవచ్చు. కాని ఆ ‘నేను’ ఎవరు అనేది అతడికి స్పష్టంగా తెలిసి ఉండాలి. అప్పుడు ఆ పనికి వచ్చే ఫలం గురించి అతడికి బాధ ఉండదు. దానినే కర్మఫల త్యాగం అంటారు. ఏది ఏమైనా చీమ పని చీమ చెయ్యాలి. రాజు పని రాజు చెయ్యాలి. పనిలో హెచ్చు తగ్గులుండవచ్చు. పని పనే. పనే దైవంగా భావించాలి. అప్పుడే పనిలో ఆనందం కలుగుతుంది. పని చెయ్యకుండా ఉండటం అసాధ్యం. దాని ఫలితాన్ని అనుభవించకుండా ఉండటం అసాధ్యం. మనం ఏ పని కోసమైతే ఈ భూమ్మీదకు వచ్చామో ఆ పని పూర్తి చెయ్యకుండా వెళ్ళడం కూడా అసాధ్యం.

సంతోషంగా గడుపుదాం. తేనెటీగలాగా పని చేద్దాం. పట్టు పురుగులా పాటుపడదాం. గాలిలా ప్రాణం పోద్దాం. నీటిలా బతికిద్దాం. అగ్నిలా శరీరాన్ని కాపాడుదాం. భూమిలా సారవంతమై, తల్లిగా కడుపు నింపుదాం. మన కర్మను మనం నిండు మనసుతో ప్రేమిద్దాం. కర్మ కోసం శ్రమిద్దాం. శ్రమలో దివ్యత్వాన్ని గుర్తిద్దాం!

- ఆనందసాయి స్వామి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న