ఏరువాక పున్నమి

అంతర్యామి

ఏరువాక పున్నమి

తెలుగునాట ‘ఏరువాక పున్నమి’ వ్యవసాయదారులకు ఎంతో ప్రీతికరమైన పండగ. ఏటా జ్యేష్ఠ పూర్ణిమనాడు ఈ పండగ జరుపుకొంటారు. ‘ఏరు’ అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరచిన నాగలి. ‘ఏరువాక’ అంటే దుక్కి ప్రారంభదినం.

అన్నదాతలు ఈ పర్వదినాన ఎడ్లు, నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లను పూలు, పసుపు, కుంకుమ, ధూపదీపాలు మొదలైన వాటితో పూజిస్తారు. రంగురంగుల కాగితాలతో వాటిని అలంకరిస్తారు. పొంగలి నివేదన, హారతి ఇచ్చి తమ భక్తి వెల్లడించుకుంటారు. వర్షరుతువు ప్రారంభంలో ఈ పండగ వస్తుంది. వ్యవసాయానికి తగిన సువృష్టిని ప్రసాదించమని రైతులు ఇంద్రుణ్ని ప్రార్థిస్తారు.

పొలం దున్నడానికి శుభకరమైన నక్షత్రం ‘జ్యేష్ఠ’ అని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఓషధులకు అధిపతి చంద్రుడు. ఓషధులు సమృద్ధిగా పెరిగితేనే వ్యవసాయం విశేషమైన ఫలసాయం అందిస్తుంది. వేదజ్ఞులు ఈ రోజున క్షేత్రపాలుణ్ని స్తోత్రం చేస్తూ వేదమంత్ర పఠనం చేసేవారని రుగ్వేదం చెబుతోంది. ‘సీతాయజ్ఞం’ పేరుతో ఈ పండగ జరుపుకొనే ఆచారం ఉండేదని విష్ణుపురాణ కథనం. నాగలి చాలులో సీతమ్మ లభించింది కనుక ఈ పర్వడికి ఆ పేరు వచ్చి ఉంటుంది. బౌద్ధ జాతక కథ]ల్లోని ‘వప్ప మంగల దివస’ అనే పండగ ఏరువాక పున్నమిని పోలిందే. శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో వర్షరుతువు ఆరంభం కాగానే కర్షకులకు బంగారు నాగళ్లను బహూకరించేవాడని ప్రతీతి. హాలుడి ‘గాథాసప్తశతి’లో ఏరువాక పున్నమి ప్రస్తావన ఉంది. ఉత్తర భారతంలో ఈ రోజున ‘ఉద్వృషభ యజ్ఞం’ పేరుతో ఎడ్లను పూజించి, వాటిని పరుగెత్తిస్తారు. జైమిని ‘న్యాయమాల’ గ్రంథంలో ఈ ఉదంతం ఉంది. అధర్వణ వేదంలో ‘అనడుత్సవం’ పేరుతో రైతులే ఉత్సవం జరుపుకొన్న వైనం ఉంది. ‘హలకర్మ’ పేరుతో నాగలిపూజ ‘మేదినీ ఉత్సవం’ పేరుతో భూమిపూజ, ‘వృషభ సౌభాగ్యం’ పేరుతో పశుపూజ జరుపుతారని కూడా ఆ వేదంలో వివరణ ఉంది. వరాహమిహిరుడు రాసిన ‘బృహత్సంహిత’లోను, పరాశర విరచిత ‘కృషి పరాశరం’లోను ఈ పండగ ప్రస్తావన కనిపిస్తుంది.

ఏరువాక పున్నమినాడు పద్మపురాణ గ్రంథం దానం చేయడం అశ్వమేథ యాగం చేసిన పుణ్యఫలంతో సమానమని శాస్త్ర కథనం. ‘హలపూర్ణిమ, కృషిపూర్ణిమ’ అనే పేర్లు కూడా ఈ పండగకున్నాయి. ఈ రోజున బండ్లను అలంకరించి, టెంకాయలు సమర్పించి మంగళవాద్యాలతో ఊరేగిస్తారు. గోగునారతో చేసిన తోరణాలు కట్టి, వాటిని చర్నాకోలతో కొట్టి, ఎవరికి దొరికిన పీచును వారు తీసుకొని వెళతారు. కొన్ని ప్రాంతాల్లో కాడికి ఓవైపు ఎద్దును కట్టి, మరోవైపును రైతే భుజాన వేసుకుని, భూమిని దున్నే ఆచారం ఉంది. బియ్యం, బెల్లంతో వండిన పులగాన్ని ఇంద్రుడికి నైవేద్యం పెడతారు. ఎడ్లను పరుగెత్తిస్తూ పందేలకు దిగుతారు. వటపూర్ణిమ పేరుతో ప్రసిద్ధికెక్కిన ఈ రోజున వటసావిత్రీ వ్రతం మహిళలు జరుపుకొంటారు. ఈ వ్రతం తమకు చిరకాల సౌభాగ్యం ప్రసాదిస్తుందని వారి నమ్మకం.
జానపద సాహిత్యంలో ‘ఏరువాక’ పైన ఎన్నో పాటలు ప్రచారంలో ఉన్నాయి.

అవని బతుకంతా అన్నదాత మెతుకుపైనే ఆధారపడి ఉంది. అందుకే అతడి పండగ ఏరువాక... మనందరికీ తేనెవాక!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న