కబీర్‌ దాసు బోధనలు

అంతర్యామి

కబీర్‌ దాసు బోధనలు

భారతీయ సమాజంలో సాంస్కృతిక చైతన్యం మధ్యయుగంలో భక్తిసాహిత్యంతో మొదలైంది. ఉత్తర భారతంలో భక్తి ఉద్యమానికి బీజం వేసింది కబీర్‌ దాసేనని చరిత్రకారులు చెబుతారు. కబీర్‌ దాస్‌ భక్తిని ఆయుధంగా మలచుకొని నాటి సామాజిక వైషమ్యాలను తొలగించడానికి, తద్వారా సామాజిక సుహృద్భావన ఏర్పడటానికి కృషి చేశాడు.

జ్యేష్ఠమాస పూర్ణిమ రోజున కబీర్‌ దాసు కాశీలో జన్మించాడని ప్రతీతి. ఇతడి పుట్టుక గురించి ఒక కథ జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది. దీని ప్రకారం ఇతడు ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టాడు. ఆ వితంతువు లోక మర్యాద కారణంగా అతణ్ని కాశీలోని లహర్‌ తారా అనే చెరువు దగ్గర వదలి వెళ్ళిపోయింది. నీరు-నిమా అనే చేనేత కార్మిక దంపతులు చేరదీసి పెంచి పెద్ద చేయగా, కబీర్‌ దాసు జీవన భృతికై నేత వృత్తినే చేపట్టాడంటారు. కబీర్‌ దాసు భార్య పేరు లోయీ. ఓ కొడుకు, కూతురు వీరి సంతానం.

కబీర్‌ దాసు తాను నిరక్షరాస్యుడైనప్పటికీ గురువు రామానందుల దివ్యానుగ్రహంతో గొప్ప కవిగా, సమాజ సేవకుడిగా ఎదిగాడు. వేదాంతాన్ని అతి సరళమైన భాషలో, పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో వివరించగల తత్వవేత్తగా అవతరించాడు. ఆయన బోధనలను ధర్మదాసు అనే శిష్యుడు బీజక్‌గా గ్రంథస్థం చేశాడు.

కబీర్‌ దాస్‌ తన బోధనల్లో వేదాంత విషయాలైన అద్వైత వాదాన్ని, ఆత్మ-పరమాత్మల స్వరూపాన్ని విశదీకరించాడు. ఒక దోహాలో- నీళ్ళలో కుండ, కుండలో నీళ్ళు... లోపల బయట నీళ్ళు... కుండ పగిలి పోయినప్పుడు లోపలి, బయటి నీళ్ళు కలిసిపోతాయన్న వాస్తవాన్ని గ్రహించినవాడే జ్ఞాని అంటాడు కబీర్‌ దాస్‌- అద్వైత తత్వాన్ని వివరిస్తూ. మనసును నియంత్రణలో పెట్టుకోవాల్సిన అవసరం గురించి కబీర్‌ దాస్‌ ఈ విధంగా అన్నాడు- ‘ఓ సాధకుడా! మనసు రూపంలో ఉన్న మదపుటేనుగును నియంత్రించు... ఎప్పుడైనా సాధనలో కొద్ది విముఖత చూపినా సరే... అంకుశంతో సరైన దారిలో పెట్టు!’

వ్యక్తిత్వ నిర్మాణానికి కావలసిన సమయ పాలన, మనసుపై నియంత్రణ, సహనశీలత, సాధనా మార్గం, మధుర భాషణ, పరోపకారం, ప్రేమ, దయ, మమతానురాగం గురించి కబీర్‌ చక్కని బోధనలు చేశాడు.

మనిషి సహనంతో, ఓపికతో ఉండాలని కబీర్‌ చెబుతాడు. తోటమాలి చెట్టుకు నూరు బిందెల నీరు పోసినా రుతువు రానిదే అది ఫలాలను ఇవ్వదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నది ఆయన సిద్ధాంతం. మనిషి అభివృద్ధి గురించీ చక్కని సందేశం ఇచ్చారాయన. మనిషి ఖర్జూరపు చెట్టులా ఎత్తుకు ఎదిగితే ఫలితం ఉండదు. తినడానికి ఫలాలు అందవు, బాటసారులకు విశ్రాంతి తీసుకొనడానికి నీడ ఉండదు.

కులమతాల్లోని డొల్లతనాన్ని తెలియజెప్పిన గొప్ప దార్శనికుడాయన. ప్రజల్లోని మూఢ నమ్మకాన్ని పారదోలడానికై తన చివరి రోజుల్లో మగహార్‌ (ఇక్కడ చనిపోతే నరకానికి పోతారని నమ్మకం) వెళ్ళి అక్కడే ప్రాణాలను విడిచాడు!

- డాక్టర్‌ నరసింహ రావు కల్యాణి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న