ప్రతి మనిషీ ఓ రుషి!

అంతర్యామి

ప్రతి మనిషీ ఓ రుషి!

దండ, కమండలాలు, విభూతి రేఖలు, రుద్రాక్షమాలలు ధరించి, జపమాల తిప్పేవాడు మాత్రమే రుషి కాడు.  ఆడంబరాలు, ఆస్తిపాస్తులు త్యజించి ఏక భుక్తం చేసేవాడు మాత్రమే ఆస్తికుడు కాదు. ప్రతి మనిషీ పుట్టుకతోనే రుషి. దైవం ఆత్మను నిక్షిప్తం చేసిన మానవ జన్మ అందుకు తగినదిగా, తీర్చిదిద్దినదిగా, రూపుదిద్దినదిగా ఉంది. అయితే ఈ పవిత్రమైన మట్టిముద్దను తీరైన ఆకృతిలో, అలంకారంతో మార్చుకోవలసిన మలచుకోవలసిన బాధ్యత మాత్రం మనిషిదే. అవసరం కూడా మనిషిదే. అందుకు కావలసిన అన్ని వనరులు, అవకాశాలు ఆ ముద్దలో ఉన్నాయి.

బాధ్యతా రహితంగా అచ్చం పశువులా బీడు పొలాల్లోకి వదిలేసిన పశువు కాదు మనిషి. అమృత తుల్యమైన క్షీరాన్నిస్తూ, రేపటి అవసరాలకు తన జాతిని ఉత్పత్తి చేస్తూ, ఉన్న స్థితిలోనే ఉన్నత స్థితికి ఎదిగే క్రమంలో తన్నుతాను దేవతగా రూపుదిద్దుకుని రగులుతున్న చల్లని అగ్నిశిఖ అయిన ఆవు... మనిషి. గోవు... మనిషి. త్యాగం లాంటి పెద్దమాటల అవసరం లేదు. యాగం లాంటి కఠిన సాధనల అగత్యం లేదు. ఉన్న స్థితిలోనే- ఔను- ఉన్నట్లుగానే తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ సాధు జీవనం గడిపే గోవు, మానవ జాతికి ముక్కోటి దేవతల నిలయమైన మాత, పునీత. హంగులెన్నో ఉన్న అవసరాలు అమర్చుకునే అవకాశమున్న మనిషి ఏమీ కాలేడా? ఎదిగిన మనిషిని కుదించుకుపొమ్మని చెప్పడం లేదు. సహజ రుషి అయిన మనిషి, ఆత్మ రుషి అయిన మనిషి- తానేమిటో తాను తెలుసుకుంటే చాలు. కనీసం తనను తాను కనీస స్థాయిలో కనిష్ఠ స్థాయిలో గ్రహిస్తే మేలు.

సరైన అవయవ అవకాశం, అవగాహన లేని జంతుజాలం కూడా, పక్షి లాంటివి సైతం ముక్కుతో, కాళ్లతో, రెక్కలతో తమను తాను శుభ్రం చేసుకుంటాయి. ఉన్నంతలో తమ పరిధిలో తాము శుభ్రంగా, భద్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. మనిషి సర్వశక్తి సంపన్నుడు. సర్వ సౌకర్య నిర్మిత మహిమాన్విత జీవుడు. ఆ మెదడు కాస్త మోకాళ్లలోంచి పైకి జరిపితే, కుంచించుకుపోయిన బుద్ధి శక్తిని మరికాస్త వికసించనిస్తే- రుషి మహర్షి కాగలడు. బ్రహ్మర్షి కాగలడు. ముఖ్యంగా భారతీయుడికున్నన్ని ఎదిగే అవకాశాలు, అదృష్టాలు మరే దేశీయుడికీ లేవు. భౌగోళిక పరిస్థితులు, అత్యుత్తమ వాంగ్మయం, ఉన్నతోన్నత ఇతిహాస సంపద, రుషి పరంపర, గురు మండలి... పశు స్థాయికి దిగజారినా మనిషిని పశుపతి స్థాయికి పెంచే అమృత హస్తం ఇది. ఆచార్య పీఠం ఇది. సిద్ధ సింహాసనం ఇది!

ఎదగడం శుభప్రదం. ఉత్సాహపూరితం. ప్రగతి కారకం. దాన్ని అవగాహన చేసుకుందాం. ఆవాహన చేసుకుందాం. ఎదగడం అంటే కేవలం భక్తి కాదు. దైవం మాత్రమే ఏకైక ధ్యేయం కాదు. దేవుడికి సంకేతం కేవలం గుడిలోని విగ్రహం కాదు. ప్రతి పనీ... ఏ పనైనా- దైవమే. ప్రతి కృషీ... ఏ కృషైనా... భక్తి సాధనమే. సాధన సాకారమైతే, సఫలీకృతమైతే మనిషి శంకరుణ్ని పొందినట్లే. ఆ పని, ఆ సాధన, ఆ ధ్యేయం... ‘సర్వేజనా స్సుఖినో భవంతు’ అయి ఉండాలి. ‘లోకాస్సమస్తా స్సుఖినో భవంతు’గా విలసిల్లాలి.

విస్తృతం కావడం జీవి లక్షణం. వివేకం మనిషి లక్షణం. రెండువిధాలా వివేకంతో విస్తృతం కావలసిన, కాగలిగిన మనిషి ఇలా కుంచించుకుపోకూడదు. గొంగళిపురుగు సీతాకోక చిలుక కాగలిగినప్పుడు, వడలిపోయిన మోడు వసంతాన్నే కొనితెచ్చుకోగలిగినప్పుడు- మనిషి రుషి కాలేడా?

- చక్కిలం విజయలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న