కోపం పాపకారణం

అంతర్యామి

కోపం పాపకారణం

కోపం ఒక మానసిక దౌర్బల్యం. అరిషడ్వర్గాల్లో రెండోది. సృష్టిలో ఉన్న ప్రాణులన్నింటికీ సహజంగా ఉండే గుణాల్లో కోపం ఒకటి. మానవుల్లో కోపం కలగడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి. కోపం మంచిది కాదని, దాని వల్ల కలిగే పర్యవసానాల గురించి పురాణాలు, శాస్త్రాలు, తత్వశాస్త్రాల్లో ఉదాహరణలు, కథలు, ఆఖ్యానాల రూపంలో చెప్పారు.

ప్రతి విషయానికీ ఆవేశపడటం, కోపాన్ని ప్రదర్శించడం వల్ల మానవ సంబంధాలు దెబ్బతిని సమాజంలో ఒంటరిగా మిగిలే పరిస్థితులు ఏర్పడవచ్చు. దాంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకనే సుమతీ శతక కారుడు సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష ...’ అన్నాడు. 

రగిలే అగ్ని లాంటిది కోపం. అగ్నిమీద నీళ్లు చల్లి ఆర్పడానికి ప్రయత్నించినట్టే, కోపం వచ్చినప్పుడు ప్రయత్నంతో దాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేసేవాడే ప్రాజ్ఞుడు. కోపంతో ఉన్నవారు వివేకాన్ని కోల్పోతారు. ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఆ స్థితిలో పలికిన మాటలు వెనక్కు తీసుకోవడం అసాధ్యం. కాబట్టి కోపం వచ్చినప్పుడు సంయమనం పాటించి అంతఃపరిశీలన చేసుకునేవాడు ధన్యాత్ముడు.   

రామాయణంలో రావణుడు సీతను అపహరించుకు పోయినప్పుడు రాముడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో ‘నా సీతను నాకు వెంటనే అప్పగించకపోతే దేవతలను, రాక్షసులను వారి లోకాలతో సహా నాశనం చేస్తాను. పర్వతాలను పిండి చేస్తాను. నదులను సముద్రాలను ఇంకిపోయేలా చేస్తాను. గ్రహగతులు ఆగిపోయేలా చేస్తాను. అగ్నికి, సూర్యుడికి ఉన్న తేజస్సును హరిస్తాను. వాయువును బంధిస్తాను’ అంటూ ధనుస్సు చేతపట్టి ప్రళయకాల రుద్రుడిలా హుంకరించసాగాడు.

అన్న పరిస్థితి చూసిన లక్ష్మణుడు కలవర పడ్డాడు. రాముణ్ని సాంత్వనపరచడానికి ‘ఇంద్రియాలను జయించిన నీకింత కోపం తగదు. నువ్వు దోషరహితుడవు. మానవ రూపం దాల్చిన సద్గుణ సంపదవు. సామాన్య మానవుడిలా వదిన కోసం భావోద్వేగానికి లోనై దుఃఖించడం తగదు. అందునా ఇలా ఆగ్రహించకూడదు’ అంటూ నచ్చజెప్పాడు. తమ్ముడి మాటలతో రాముడు సావధాన చిత్తుడయ్యాడు. 

భారతంలో ధర్మరాజు కౌరవులతో ఆడిన జూదంలో సర్వం కోల్పోయాడు. ఆ సందర్భంలోను, అజ్ఞాతవాసంలో కీచకుడు ద్రౌపదిని అవమానించినప్పుడు, ఇంకా అనేక సమయాల్లో భీముడు ఆవేశానికి, కోపానికి గురయ్యాడు. అలాంటి సమయాల్లో ధర్మరాజు కలగజేసుకొని సంయమనం పాటింపజేశాడు. అలాగే కొందరు తపోధనులైన మునులూ తమ క్రోధాన్ని జయించలేక ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారో పురాణ కథలు తెలుపుతున్నాయి. కోపానికి ఉదాహరణ పాత్రగా దుర్వాసుణ్ని సైతం పేర్కొంటారు.

హిరణ్యకశిపుడి కథ- క్రోధావేశాలు ఎంతటి వినాశనానికైనా దారితీస్తాయని తెలియజెబుతుంది.

‘అరిషడ్వర్గాలను, అందులోనూ కోపాన్ని జయించడం అనుకున్నంత సులభం కాదు. కానీ సాధన, ప్రయత్నం చేస్తే క్రోధాన్ని సులభంగానే జయించవచ్చు’ అంటారు విశ్లేషకులు. దానికి అనేక మార్గాలనూ సూచించారు. యోగాభ్యాసం, ప్రార్థన, ధ్యానం, ఇతరుల పట్ల సానుకూల దృక్పథం లాంటివి అందులో కొన్ని.

- గంటి ఉషాబాల


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న