భాగవత సత్సంగం

అంతర్యామి

భాగవత సత్సంగం

గవంతుడి తత్వాన్ని తెలుసుకొనే భక్తులను, పరిపూర్ణమైన హృదయంతో ఆయనను అర్చించేవారిని భాగవతులంటారు.     

విష్ణు భక్తుల్లో భాగవతులు అనే పదానికి వైష్ణవ మతబోధకులు లేదా ఆళ్వారులు అని అర్థం. గోదాదేవితో పాటు వీరిలో ముఖ్యమైనవారు పన్నెండు మంది. ప్రజలందర్నీ ఒకచోట చేర్చి భగవత్కల్యాణాలు, మహోత్సవాలు, దీక్షలు, వ్రతాలు, ప్రవచనాలు... చేస్తూ వారికి భగవంతుడి పట్ల భక్తి పెంపొందేలా చేయడం వీరి పని.   

శ్రీవైష్ణవంలో దాస్య భక్తి ప్రధానమైనది. సమాజంలో సామూహికంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అనేకమంది భాగవతోత్తములు పాల్గొంటారు. అలాంటి సందర్భాల్లో అందరికీ సేవ చేయడం దాస్యభక్తిలో ఒక భాగం. ‘మధుకైటభులనే రాక్షసులను సంహరించిన స్వామీ! లోకనాథా! నీ సేవకులకు సేవకులైనవారి వరసలో చిట్టచివరి సేవకుడిగానైనా నన్ను స్వీకరించు. ఇదే నా జన్మకు సాఫల్యం కలిగించేది. ఈ విధంగా అనుగ్రహించడమే నీవు నాపై చూపే దయగా భావిస్తాను’ అని కులశేఖరాళ్వారులు ముకుందమాలలో ప్రార్థించారు.     

భాగవతోత్తములైన ఆళ్వారుల మధ్య ఉత్తమ, అధమ భేదాలు లేవు. అందరూ సమానమే. వీరు భగవంతుడి భక్తులుగాను, భాగవతోత్తములకు దాసులుగాను భావించుకునే తత్వం కలవారు. కేవలం దాస్యభక్తి వల్లనే ఇది సాధ్యమవుతుందని, అదే జీవన సాఫల్యమని వారు భావిస్తారు. భాగవతోత్తములు నిత్యం భగవంతుడిపై మనసు లగ్నం చేసి, నవవిధ భక్తి మార్గాల ద్వారా అర్చనలు చేస్తూ, భగవంతుడి వైభవాన్ని వ్యక్తీకరిస్తూ, సజ్జన సాంగత్యంతో అమితానందాన్ని పొందుతారు. వారి లక్ష్యం, ఆశయం... అన్నీ పరమపద ప్రాప్తికోసమే. ‘భాగవతుల పాద స్పర్శ సకల తీర్థాలను సందర్శించినదానితో సమానం’ అని వారు నమ్ముతారు.

ఈ విషయాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘నాయందే మనసును లగ్నం చేసినవారు, నన్ను గురించి తెలుసుకుంటూ ఇతరులకు తెలియజేస్తూ నిరంతరం సంతృప్తి పొందుతూ ఆనందిస్తున్నారు’ అని చెప్పాడు.       

విశిష్టాద్వైత సిద్ధాంతంలో భగవద్రామానుజులు ధ్యాన, జ్ఞాన, కర్మ మిశ్రితమైన మార్గమే భక్తికి సరైన తోవ అని, తమ నిత్య నైమిత్తిక కర్మలను యథావిధిగా ఆచరిస్తూ, అహంకార రహితులై సాత్వికాహారంతో జీవిస్తూ, హరిచరణ ధ్యానశీలురై బాహ్యాంతరంగిక శుద్ధిగలవారితో సాంగత్యం కలిగి ఉన్నా, అమృతమయమైన వారి ప్రవచనాలను ఆలకించినా, వారితో యజ్ఞ యాగాది క్రతువుల్లో గాని, అర్చావిధుల్లో గానీ పాల్గొన్నా మిక్కిలి శుభప్రదమని  సూచించారు. అదే మోక్ష మార్గమని, ఆ మార్గంలో తమ ప్రయాణాన్ని సాగించేవారు నిజమైన భాగవతులని ఆయన బోధించారు.     

భాగవతోత్తములతో కలిసి జీవించడం వల్ల హృదయ మాలిన్యం నశించి పునీతులవుతారు. సాత్వికత అలవడుతుంది. అహంకారం పటాపంచలవుతుంది. సత్యాన్వేషణలోని ఉపాయాలు, భక్తిప్రపత్తులతో భగవంతుణ్ని ఆరాధించ వలసిన అనేక విశేషాంశాలు భాగవత సత్సంగం వల్ల బోధపడతాయి. దోషాలు లేకుండా జీవించడం, సాత్వికాహారం తీసుకోవడం, సకల ప్రాణులలోను పరమాత్మనే దర్శిస్తూ- సత్కావ్య పఠనం, జపం, తపస్సు చేసేవారే భాగవతులు. భగవంతుడితో అనుసంధాన  జీవితం గడపాలనుకొనేవారికి భాగవత సత్సంగం దారి చూపిస్తుంది.

- వి.ఎస్‌.ఆర్‌.మౌళి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న