బలి వామన సంవాదం

అంతర్యామి

బలి వామన సంవాదం

హాభాగవతంలోని రమణీయ ఘట్టాల్లో వామన చరిత్ర ఒకటి. ఈ వృత్తాంతంలో బలి వామనుల మధ్య జరిగిన సంభాషణలో మానవాళికి ఉపయోగపడే ఎన్నో విషయాలు కనిపిస్తాయి. వాటిని తెలుసుకుంటే మనిషి ఏమి కోరుకోవాలో, ఏమి కోరుకోకూడదో తెలుస్తుంది.

పూర్వం దానవ రాజైన బలి చక్రవర్తి ఒక గొప్ప యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగానికి మహావిష్ణువు వామనావతర మూర్తిగా వచ్చాడు. సూర్యసమాన తేజస్సుతో వెలిగిపోతున్న బ్రహ్మచారి వామనుణ్ని చూడగానే బలి చక్రవర్తి ఎంతో సంతోషించాడు. భక్తి శ్రద్ధలతో వామనుడికి స్వాగత సత్కారాలు చేసి, ఉన్నతాసనంలో కూర్చోబెట్టాడు. తన దగ్గర ఉన్న పుష్కల సంపదల్లో ఏది కోరితే అది ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ధన కనక వస్తు వాహనాది సంపదలు కోరుకొమ్మన్నాడు. అన్నీ ఇస్తానని వాగ్దానం చేశాడు.

అప్పుడు వామనుడు- ‘ఓ రాజా! నీవు నీ వంశ ప్రతిష్ఠను నిలుపుతున్నావు. నీ వంశంలో పూర్వపురుషులందరూ గొప్పవారే. కాని, నేను బ్రహ్మచారిని. నాకు సంసార బంధాలు లేవు. నాకు కావలసింది మూడు అడుగుల నేల. అది నాకు ఇస్తే చాలు. సంతోషిస్తాను’ అన్నాడు. బలి చక్రవర్తి నవ్వాడు. ‘నేను తలచుకుంటే ఎన్నో ద్వీపాలనే నీకు దానం చేయగలను. కనుక ఇంకా ఏదైనా కోరుకో’ అన్నాడు.

వామనుడు కూడా చిరునవ్వుతో- ‘రాజా! ఒక మనిషికి ఈ భూమండలంలోని సమస్త సంప దలను ఇచ్చినా, అతడికి తృప్తి ఉండదు. ముల్లోకాలను ఇచ్చినా తృప్తి ఉండదు. ఈ భూమండలాన్ని పూర్వం ఎందరో చక్రవర్తులు పాలించి, కాలగర్భంలో కలిసిపోయారు.

వారందరూ ఎన్ని సంపదలున్నా తృప్తి చెందలేదు. మనిషికి ఏది లభించాలో అది లభిస్తుంది. ఆ సంపదలతోనూ సుఖాలతోనూ సంతృప్తి చెందకపోతే మనిషికి ఏ సంతోషమూ మిగలదు. నీవు చక్రవర్తివి కనుక ఏది అడిగినా ఇస్తావు కానీ, అడిగేవాడు తనకు ఎంత అవసరమో, అంతే అడగాలి. నాకు మూడడుగుల నేల మాత్రమే చాలు. అదే నాకు ఇవ్వు!’ అన్నాడు. బలి చక్రవర్తి సరేనన్నాడు.

బలి చక్రవర్తి గురువైన శుక్రాచార్యుడు- వచ్చినవాడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు మహా విష్ణువేనని తెలుసుకున్నాడు. వెంటనే బలి చక్రవర్తిని హెచ్చరించాడు. ‘ఈ వామనుడు నిన్ను నిలువునా ముంచడానికే వచ్చాడు కనుక జాగరూకుడవై వ్యవహరించు’ అన్నాడు. కానీ బలి చక్రవర్తి గురువు మాటలను వినలేదు. దానం ఇస్తానని వాగ్దానం చేశాక, తన మాటను వెనక్కి తీసుకోలేనని నిష్కర్షగా చెప్పాడు. శుక్రాచార్యుడు కోపంతో ‘నా మాటలను విననందుకు త్వరలోనే నీ సంపదలన్నీ నశిస్తాయి’ అని బలి చక్రవర్తిని శపించాడు. గురువు శపించినా సరే, బలి వామనుడికి మూడడుగుల నేలను ఇవ్వడానికి పూనుకొన్నాడు. వామనుడు త్రివిక్రముడై ఒక పాదంతో భూమండలాన్ని, రెండో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు. మూడో పాదం ఎక్కడ పెట్టాలని బలిని అడిగాడు. తన తలపై పెట్టమని బలి వామనుణ్ని కోరాడు. వామనుడు మూడో అడుగును బలి తలపై పెట్టి పాతాళానికి అణగదొక్కి, అతణ్ని ధన్యుణ్ని చేశాడు.

కోరికలకు అంతులేదు. ఎన్ని కోరినా ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి. సంపదలు శాశ్వతం కావు. అన్నీ ఇవ్వగలననే అహంకారం మనిషికి పనికిరాదు.  

అన్నీ తాను ఇవ్వగలనని అనుకోవడం అజ్ఞానం. ఏది అవసరమో అదే చాలనుకోవడం జ్ఞానం. ఇదీ బలి వామన సంవాద పరమార్థం!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న