మార్పును అంగీకరించాలి!

అంతర్యామి

మార్పును అంగీకరించాలి!

నిషి సాధారణంగా బాహ్యశుద్ధిపై శ్రద్ధ కనబరుస్తాడే తప్ప, అంతశ్శుద్ధిపై ఏ మాత్రం దృష్టి నిలపడు. దేహం గాలితో నడిచే తోలుతిత్తని, గాలిపోతే కట్టెలలో కట్టె అని తెలిసినా పట్టించుకోడు.

కాలక్రమేణా వయసుతో వచ్చే మార్పులను బట్టి శరీరం రూపు రేఖలు మార్చుకుంటుంది. బాల్యం గడిచి కౌమారం, తరవాత యౌవనం మూన్నాళ్ల ముచ్చటలా సాగి వార్ధక్యం వచ్చి పడుతుంది. సత్తువ తగ్గి అందాన్ని, పటుత్వాన్ని కోల్పోతుంది శరీరం. చర్మం ఎండి ముడతలతో వికార రూపం వచ్చి అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ మార్పులన్నీ మామూలే అని సరిపెట్టుకున్నా- చివరి అంకమైన మరణాన్ని మాత్రం తట్టుకోలేడు మనిషి. వద్దనుకున్నా, రాకూడదనుకున్నా అతిథిలా వచ్చి తలుపు తడుతుంది మృత్యువు. తప్పనిసరిగా వెళ్ళి తలుపు తీయాల్సిందే. తనవారిని విడిచి తలవంచుకుని వెళ్ళాల్సిందే. గీతలో పరమాత్మ చెప్పినట్లు జీర్ణవస్త్రాలు విడిచి నూతన వస్త్రాలు ధరించినట్లు దేహి దేహత్యాగం చేసి కర్మల ననుసరించి కొత్త దేహాన్ని ధరించక తప్పదు. భౌతికమైన శరీరం నశిస్తుందే గాని జీవాత్మ నశించదు. అది నిత్యం, సత్యం అని తెలుసుకోవాలి. జీవితం అనిశ్చితం, మృత్యువు నిశ్చయం అని శాశ్వత నిద్రను ఆహ్వానించే ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. ‘నిద్రలో ఆనందం పొందే మనిషీ, అర్థం చేసుకుంటే మృత్యువులోనూ  ఆనందాన్ని పొందగలవు’ అన్న రమణమహర్షి బోధలు అక్షరసత్యాలు.

బాంధవ్య బంధితుడు మనిషి. క్షణికాలైన భోగైశ్వర్యాలకు, ప్రేమానుబంధాలకు దాసుడై వాటిపట్ల అనురక్తిని పెంచుకుంటాడు. పుట్టడం, పెరగడం, చావడం, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు... వీటి మధ్య అరిషడ్వర్గాలు అనే శత్రువులతో పోరాటం సాగిస్తూ సంసార నరకకూపంలో కొట్టుమిట్టాడుతాడు. సుఖమొస్తే ఆనందం, దుఃఖమొస్తే విచారం. ఎంతకాలమీ సంకట స్థితి? మథనం మొదలవ్వాలి. ఆలోచన పెరగాలి. బుద్ధి వికసించాలి. అశాశ్వతాలను దూరంగా నెట్టేసి శాశ్వతమైన భగవత్‌ సాన్నిధ్యం కోరుకోవాలి. సృష్టికర్త ఆడించే లీలా నాటకంలో పాత్రధారుడినేనన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. హృదయంలో జ్ఞానజ్యోతిని వెలిగించి ఆనందసాగరంలో తేలుతూ- నేనే ఆనందం, ఆనందమే నేను అని ఆనందస్వరూపుడిలో చేరడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం తెలిసిన వారెవరైనా మృత్యువుకు భయపడరు. స్థితప్రజ్ఞులై కర్మబంధాన్ని తెంచుకుని నిత్యుడైన పరమేశ్వరుడి పాదాలను ఆశ్రయించిన వారికి మరణభయం ఉండదు. పరీక్షిన్మహారాజు తాను చేసిన తప్పిదానికి మరణం తరుముకొస్తోందని తెలుసుకున్నాడు. అది దైవసంకల్పంగా భావించి భయాన్ని పక్కనపెట్టి కొద్దిరోజుల సమయాన్ని సద్వినియోగపరచుకుని బుద్ధిని భగవదంకితం చేసి శుకముని ద్వారా శ్రీహరి కథలను విని ముక్తి మార్గాన్ని పొందాడు. ఖట్వాంగుడనే రాజు దేవతల ద్వారా తన ఆయువు ముహూర్త కాలమని తెలుసుకుని గోవిందకీర్తనం చేసి రెండు ఘడియల్లో తనువు చాలించి కైవల్యం పొందాడు.

కాలపురుషుడికి తలవంచి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవదారాధనతో జీవితం గడపాలి. అంత్యకాలంలో భయానికి తావివ్వక, మోహవృక్షాన్ని నిష్కామమనే కరవాలంతో ఖండించాలి. వస్త్రం పనికిరాదని తెలిశాక వదిలినట్లు శిథిలమయ్యే శరీరాన్ని వదలి కొత్త దేహాన్ని పొందడంలో ఉత్సాహాన్ని చూపించాలి. ధర్మబద్ధంగా జీవితం గడపాలి. ఉపనిషత్తుల సారాన్ని, భగవద్గీత అంతరార్థాన్ని, బ్రహ్మసూత్ర అధ్యయనాన్ని గురుముఖతః తెలుసుకుంటే మృత్యుభయం దూరమవుతుంది.

- మాడుగుల రామకృష్ణ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న