బలమైన ప్రత్యర్థి

అంతర్యామి

బలమైన ప్రత్యర్థి

ఎదుటివాడు మనపట్ల ద్వేషం పెంచుకుని, రోషంతో పగ సాధించాలనుకోవడం సమాజంలో ఇటీవల వెర్రితలలు వేస్తున్నది. సహజీవనం సుఖ జీవనానికి పునాది. మనిషి ఒంటరిగా మనలేడు. తోడు, నీడ కావాలి. లేకపోతే జీవితం ఒక ఎడారిగా మారుతుంది. సంఘజీవి అయిన మనిషి ఎదుటివారితో పేచీ పడుతున్నప్పటికీ, సమాజాన్ని కాదనుకుని కాలదన్నలేడు. సాధ్యమైనంతవరకు సర్దుబాటు చేసుకుంటూ, చేతనైన సాయం అందజేస్తూ, తనతోపాటు అందరూ హాయిగా ఉండాలని కోరుకునే మనిషి ధన్యజీవి.
ప్రకృతి ప్రభావం వల్ల మనిషికీ మనిషికీ నడుమ ఆలోచనల్లో, ఆశయాల్లో, ఆచరణలో తేడాలు తప్పవు. తెలివిగా పయనం సాగించి గమ్యం చేరుకోవడం సముచితం. అలాగని ఆత్మాభిమానాన్ని చంపుకొని, అవమానాలను భరిస్తూ జీవించాలన్నది ఉద్దేశం కాదు. ఒక్కొక్కసారి మన తప్పు లేకుండానే నిందలపాలు కావలసి వస్తుంది. ఇతరులకు ఉపకారం తలపెట్టినా, అది అపకారంగా మారి మనల్ని చిక్కుల్లో పడవేస్తుంది. జీవితం సగం మానవ ప్రయత్నం పైన, సగం దైవ నిర్ణయంపైనా ఆధారపడి ఉంటుంది. చిత్తశుద్ధితో మనం మన పని చేసుకుంటే, సాధారణంగా జీవితం నల్లేరుమీద బండిలా సాఫీగానే జరుగుతుంది. గాడి తప్పినప్పుడు బతుకు బండి బోల్తా పడిపోయిందని దిగులు చెందకుండా, పెడదారి నుంచి రహదారికి ఎలా తేవాలో ఆలోచించడం మంచిది. అదే తెలివైన పని. ఆదర్శ పురుషుల అడుగుజాడల్లో నడుచుకుని, పూర్ణత్వం సంపాదించుకోవడానికి జీవిత కాలాన్ని ఉపయోగించుకునే వ్యక్తిని వివేకవంతుడు అంటారు. అనుకోకుండా వైరం ఎదురైనప్పుడు ఏం చేయాలి? మొట్టమొదట ఆ ప్రత్యర్థి గురించి పూర్వాపరాలు క్షుణ్నంగా తెలుసుకోవాలి. అతడి బలాబలాలను అంచనా వేసుకోవాలి. ఆ తరవాత మన శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని, దూరదృష్టితో తగిన చర్యను చేపట్టాలి. అవసరమైతే ఆత్మీయులు, విజ్ఞులు, అనుభవజ్ఞులు అయినవారి సలహాలను తీసుకోవాలి. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు, శత్రువును ఎదుర్కోవడం సులభం కానప్పుడు మూడు మార్గాలను మన ముందుంచారు రాజనీతిజ్ఞులు. ఒకటి- చిక్కకుండా పలాయనం చిత్తగించడం. రెండోది, సంధి చేసుకోవడం. మూడోది, లొంగిపోవడం. మొదటి మార్గం- పైకి పిరికితనంగా అనిపించినా, యుద్ధతంత్రంలో అదీ ముఖ్యమైన అంశమే. బ్రహ్మదేవుడి వరాలు అందుకుని, గర్వంతో విష్ణుమూర్తిని తుదముట్టించాలని హిరణ్యకశిపుడు బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శత్రువుకు చిక్కకుండా మాయమైపోయాడు. వాడి పాపం పండగానే, స్తంభంలో నుంచి నరకేసరిగా అవతరించి, అసురుణ్ని హతం చేశాడు. బలవంతుల్లో అతి బలవంతుడు తానేనని రుజువు చేశాడు.

సంధి కూడా ఇలాంటి రాజ్యతంత్రమే. అందుకే దాన్ని సంధి అంటున్నారు. రెండు యుద్ధాలకు మధ్యనున్న ఒక విరామం లాంటిది సంధి. ఇక మిగిలింది శరణాగతి. శరణాగతుడు కావలసినది ఒక పరమాత్ముడికే. శత్రువును శరణుకోరితే, గతి అధోగతి పాలవుతుందని ఓడిపోయిన రాజులు వీరమరణాన్ని కోరుకునేవారు. లేకపోతే ఆత్మాహుతికి సిద్ధపడేవారు. మానవబలం దైవబలాన్ని ఎన్నటికీ జయించలేదు. భగవంతుడు లేడనే వారు, ఆయన్ని ద్వేషించేవారు సమాజంలో కొందరున్నారు. మనం చూడలేకపోయినా గాలి వీస్తున్నది, ఆ గాలిని పీలుస్తూ ఎన్నో జీవరాశులు ఈ ప్రపంచంలో జీవిస్తున్నాయి. ఆ ఊపిరి కాస్తా ఆగిపోగానే- రాజైనా, రారాజైనా శవమై శ్మశానం చేరవలసిందే.

- ఉప్పు రాఘవేంద్రరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న