ఆవిష్కరణోత్సవం

అంతర్యామి

ఆవిష్కరణోత్సవం

బిడ్డకు జన్మ ఇచ్చి తల్లి పట్టరాని ఆనందంతో సేద తీరుతుంది. ఆరుగాలం కష్టపడ్డ రైతు- పండిన పంట చూసి ఎంతగానో మురిసిపోతాడు. చిన్నపిల్లల బుడి బుడి అడుగులు కని, ముద్దులొలికే వాళ్ల పలుకులు విని పెద్దవాళ్లు ముచ్చటపడతారు. పిచ్చుకలు కళాత్మకంగా అల్లిన గూళ్ల వైపు దృష్టి సారించి మనుషులు ఆశ్చర్యానందాలకు లోనవుతారు. ఎర్రటి ఎండలు అడవి మీద పడి ఆకుపచ్చద(ధ)నాన్ని కొల్లగొట్టినా మళ్ళీ చిగురించిన చెట్లను కన్నందుకు వనం వసంతోత్సవం జరుపుకొంటుంది.
చిగురుటాకుల వేదికపై కూర్చుని కోకిల చేసే గానకచేరీతో సంగీత కళాభిమానులు శ్రవణానందం పొందుతారు. పచ్చదనంతో పుడమి పులకించే వేళల్లో వానాకాలం వర్షోత్సవం చేసుకుంటుంది. అదే కాలంలో మొక్క చెట్టవుతుంది. దానికి తొడిగిన మొగ్గ పువ్వవుతుంది. విరబూయడమనే ప్రక్రియ ప్రాకృతిక సహజ ఆవిష్కరణోత్సవం. జీవుల దాహార్తి తీర్చేందుకు హిమగిరుల హృదయాలు ద్రవిస్తాయి. అలా శిఖరాన నిలిచిన ఉన్నత వ్యక్తిత్వాలే సాయమందించేందుకు కరిగిన మనసుతో కరుణరసామృతంతో కిందకు దిగివస్తాయి. ఆ రీతిన ప్రవహించే నదులన్నీ జలోత్సవానికి ప్రతీకలు.

వర్తమానం- కాలానికి పునాది. అది భూత భవిష్యత్తులను ఆవిష్కరించి కాలాన్ని నడిపిస్తూంటుంది. కాలచక్రమూ ఒక నిర్విరామ ఆవిష్కరణోత్సవం. జీవిత చక్రానికి పురోగమన, తిరోగమన దిశలు ఉంటాయి. ఆ దశల్ని గమనిస్తూ ఫలాల్ని సరైన సమయాన అందుకోవాలి. దశ దాటాక పొందే(కొన్ని) ఫలితాలు పనికిరావు. కాయ పక్వానికి వచ్చి పండు అవుతుంది. అది ప్రకృతి పంచే ప్రసాదం. అప్పుడే దాన్ని అందుకోవాలి. అలా కాకుండా మరింత మెరుగైన ఫలితం కోసం వాయిదా వేస్తే అంది వచ్చింది కూడా దక్కకుండా పోతుంది. మితిమీరిన కోరిక దుఃఖాన్ని మిగల్చడమంటే ఇదే. కోరిక ఉండాల్సిందే గానీ అది ప్రాకృతిక ధర్మానికి విరుద్ధం కాకూడదు.

జీవనభృతి కోసం చేసేపని- వృత్తి. కేవలం లాంఛనప్రాయంగా పని ముగించుకుని బాధ్యత నెరవేరిందనుకునే ఆలోచన ఉన్నచోట ఆనందం లభించదు. మానసికానందం కోసం మనసుపెట్టి చేసే పని- ప్రవృత్తి. సంగీత, సాహిత్య, సృజనాత్మక కళాప్రక్రియలన్నీ ప్రవృత్తులే. కళాకారులు హృదయాలతో కళల్ని ఆవిష్కరిస్తూ పొందే ఆనందం ఇంతా అంతా కాదు. వృత్తి, ప్రవృత్తి రెండూ ఒకటే అయినప్పుడు జీవితం అత్యద్భుతమవుతుంది. వృత్తినీ ప్రవృత్తిలా భావించి ఆచరణాత్మక చర్యలు చేపట్టినవారిని చరిత్ర తన జ్ఞాపకాల ఖజానాలో భద్రంగా దాచుకుంటుంది.

పట్టరాని ఆనందంతో, జీవితం పట్ల అపారమైన ప్రేమతో ఉన్నప్పుడు సృజనాత్మకత పురివిప్పుకొంటుంది. అనేక నూతనావిష్కరణలు పుట్టుకొస్తాయి. మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ప్రేమ, ఆనందాలు- దివ్యత్వానికి పర్యాయపదాలు. సృష్టి, సృష్టికారుడు వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకేదాన్ని సూచించే పేర్లు. అందువల్లే- ‘సృష్టి’ అనే ఒకే పదం ఒకసారి ‘క్రియావాచకం’ మరో సందర్భంలో ‘నామవాచకం’గా ఉంటూ గొప్ప భావసౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది.
జీవపరిణామ క్రమంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఆవిష్కరణా ఒక బ్రహ్మోత్సవం. అందువల్లే నిర్విరామ క్రియాశీలియైన సృష్టికర్త(ఆవిష్కర్త)ను ‘ఆనందోబ్రహ్మ’ అన్నారు.

- మునిమడుగుల రాజారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న