నీ నగుమోమూ...

అంతర్యామి

నీ నగుమోమూ...

దైవం విశ్వాన్ని ఆనందంతోనే సృజించాడు. ఏమీ తెలియని శిశువులు ఆ విశ్వాన్ని మనుషుల్ని జీవరాశులను పారవశ్యంతో చూస్తారు. విశ్వంలోని పొందిక వారికి సామరస్యంగా కనిపిస్తుంది. వంకరచూపులు చూసే వారికి విశ్వం వికృతంగా కనిపిస్తుందని గోవింద భగవత్పాదులు బ్రహ్మసూత్రాల్లో ప్రస్తావించారు. ముఖంలోని చిరునవ్వు, మాటల్లోని మాధుర్యం ఇతరులను ఆహ్లాదానికి గురిచేస్తాయి. నవ్వుతూ మాట్లాడితే శత్రువైనా స్నేహితుడిగా మారతాడని ప్రఖ్యాత మానసిక శాస్త్రజ్ఞుడు ఫ్రాయిడ్‌ అనేవాడు. పదమూడో శతాబ్దానికి చెందిన హొయసల వంశానికి చెందిన విష్ణువర్ధనుడు కర్ణాటకలో హొయసలేశ్వర ఆలయం నిర్మించాడు. అందులో ఒక విభాగంలోని ఆలయం లోపలి స్తంభాలకు చెక్కిన దేవతామూర్తులు అందరూ చిరునవ్వులు చిందిస్తూ కనపడతారు. ఎందరో అన్యమత రాజులు ఆ ఆలయ నిర్మాణంపై దాడిచేసినా ఆ మూర్తులు చిందిస్తున్న చిరునవ్వులను గమనించి విగ్రహాలను నాశనం చేయలేకపోయారట. నవ్వు అంత ఆకర్షణీయమైంది. చూసేవారిని సమ్మోహితులను చేస్తుంది.

సమాజంలోని ఇతరులతో సఫలమైన జీవితం గడపాలంటే మృదువుగా నవ్వుతూ తీయగా మాట్లాడాలని కిష్కింధలో హనుమతో పరిచయం తరవాత శ్రీరాముడు సౌమిత్రితో అంటాడు. శ్రీరాముడు సైతం నవ్వుతూ మధురంగా మాట్లాడేవాడని వాల్మీకి రామాయణం చెబుతోంది. కోకిల స్వరమంత తీయనిది రామనామం. రామ అనే రెండక్షరాలు మధురాక్షరాలని వాల్మీకి అంటాడు. శ్రీరాముడి వదనంలో చిరునవ్వే తనను ఆ దైవానికి దగ్గర చేసింది అనేవారట వాగ్గేయకారుడు త్యాగయ్య. ఆయనలోని సంగీత ప్రజ్ఞను గమనించి అభినందన పురస్సరంగా తంజావూరు రాజు పంపిన కానుకలను త్యాగయ్య తిరస్కరిస్తాడు. దానితో కోపించిన అతడి అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేస్తాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక ‘నగు మోము గనలేని నా జాలి దెలిసి నను బ్రోవగ రాదా శ్రీరఘువర(అభేరి)’ అంటూ తన రాముడి నవ్వు మొఖాన్ని జ్ఞాపకం చేసుకొని ఆర్తి చెందాడు త్యాగరాజు.

వివాదాస్పద విషయాలు కాకుండా మనసుకు హాయినిచ్చే మాటలు మాట్లాడాలని అనుభవజ్ఞులు చెబుతారు. సాహిత్యం సంగీతం గొప్ప వాంగ్మయాల గురించి మాట్లాడితే మన మాటలు ఇంపుగా ఉండి అందరినీ ఆకర్షిస్తాయి. పదిహేనో శతాబ్దానికి చెందిన శ్రీపాద వల్లభాచార్యులు శ్రీకృష్ణుణ్ని వర్ణిస్తూ రాసిన మధురాష్టకంలో వెన్నుడి హసితం(నవ్వు) మధురం అన్నాడు. వచనం(మాట) మధురం అన్నాడు. చివరికి అఖిలం మధురం అంటూ గానం చేశాడు. మధురమైన మాట, నవ్వుతో వికసించే వదనం అందరినీ అలరిస్తాయి. సమాజంలో సైతం మధురమైన నవ్వు రాజిల్లే వదనంతో తీయని మాటలతో వ్యవహరించగలిగితే ఎవరైనా అందరివాడు అవుతాడు.

మన చుట్టూ ఉన్నవారితో సామరస్యంగా హాయిగా నవ్వుతూ... ఒకరు మెచ్చేలా మాట్లాడుతూ దుఃఖాల నుంచి బాధలనుంచి మానవులు వెలుగులోకి రావాలి. పవిత్రులై ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి. అప్పుడే లోకంనుంచి దుఃఖం వైదొలగుతుంది. కష్టంగా ఉన్నా కాలక్రమంలో మేలు చేసే మార్గాన్ని నవ్వుతూనే స్వీకరించాలి. మంచిమాటలను మాట్లాడుతూ కష్టాలను కొనితెచ్చే మార్గాన్ని వదిలివేయాలి. అదే జీవితానందం.

- అప్పరుసు రమాకాంతరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న