కూర్మావతారం

అంతర్యామి

కూర్మావతారం

ప్పుడు ధర్మానికి హాని కలిగి అధర్మం విజృంభిస్తుందో అప్పుడు ధర్మస్థాపనకు తాను అవతరిస్తానని గీతాకారుడి ఉవాచ. మహావిష్ణు దశావతారాల్లో నేరుగా రాక్షస సంహారం లక్ష్యంగా గోచరించకపోయినా విశిష్ట ప్రయోజనాన్ని ఉద్దేశించింది కూర్మావతారం. దుర్వాస మునిశాపం వల్ల ఇంద్రుడి సర్వ సంపదలూ నశించిపోయాయి. దేవతలకు అసురుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంద్రాది దేవతలు విష్ణువును ప్రార్థించారు. క్షీర సాగర మథనాన్ని సూచించిన శ్రీహరి దానవుల సహాయం కూడా తీసుకొమ్మన్నాడు. పాల సముద్రంలో సకల తృణాలు, లతలు, ఔషధాలు వేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి మహాసర్పాన్ని తాడుగా ఉపయోగించి మథిస్తే అమృతం లభిస్తుందన్నాడు.

పాముకు విషం తలభాగంలో ఉంటుంది. అది మృత్యుస్వరూపం. రాక్షసులు తామసులు. తమస్సును అణచివేస్తే తప్ప లోకాల్లో ధర్మం ప్రకాశించదు. అందుకే హరి రాక్షసుల్ని వాసుకి ముఖం వద్ద నిలిపాడు. దేవతలు సర్పంతోక పట్టుకున్నారు. పర్వతం బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవడంతో సముద్రంలో మునిగిపోయింది. ఆ సంకట స్థితిలో శ్రీహరి లీల కూర్మావతారం. బ్రహ్మాండాన్ని తలపించే పరిమాణంతో సుందరకూర్మ రూపంలో మహావిష్ణువు అవతరించాడు. లక్ష యోజనాల విస్తీర్ణం కలిగిన ఆ కూర్మరూపుడు పాలసముద్రంలో మునిగిపోయిన మందర పర్వతాన్ని పైకెత్తి తన శరీరంపై నిలిపాడు. క్షీరసాగర మథనంలో చిట్టచివరిగా అమృతం లభించింది. విష్ణువు మోహిని రూపంలో రాక్షసుల్ని సమ్మోహితుల్ని చేసి దేవతలకు అమృతం పంచాడు. శ్రీహరి జంబూద్వీపంలో కూర్మరూపంలో ప్రకాశిస్తూ ఉంటాడని బ్రహ్మపురాణోక్తి.
 

కూర్మానికి వెన్నులో మేష, వృషభరాశులు, తలలో మిథున కర్కాటకాలు, ఆగ్నేయంలో సింహరాశి, దక్షిణ ఉదర భాగంలో కన్య, తులలు, నైరుతిలో వృశ్చికం, తోకపై ధనుస్సు, వాయవ్యాన మకరం, ఈశాన్యంలో మీనరాశి, ఎడమవైపు కుంభరాశి ఆక్రమించి ఉంటాయని చెప్పిన పండితులు కాలానికి ప్రతీకగా కూర్మాన్ని భావించారు.

తాబేలు సంకల్ప రహితంగా ఉన్నప్పుడు నీట్లో స్తంభించి ఉంటుంది. అవసరం లేనప్పుడు ఇంద్రియాల్ని విషయ సుఖాల నుంచి మరల్చగలగడమనే స్థితప్రజ్ఞకు దాన్ని సంకేతంగా భావించవచ్చు.

కూర్మం సర్వాధిష్ఠాన భగవత్‌ స్వరూపం. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రంలో కూర్మనాథుడు వెలశాడు. తూర్పు గంగరాజైన అనంతవర్మ 11వ శతాబ్దంలో ఆలయం నిర్మించినట్లు చరిత్రకారుల కథనం. ఆలయ మండపాలపై తూర్పు చాళుక్యులు, గజపతులు, పద్మనాయకుల దాన శాసనాలు ఉన్నాయి. మధ్వాచార్యుడైన నరహరి తీర్థులు ఆలయానికి ప్రాకారం కట్టించినట్లు ఒక శాసనం చెబుతోంది. చైతన్య మహా ప్రభువు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. పద్మ, బ్రహ్మాండ పురాణాల్లోను, పాంచరాత్రాగమ సంహితలోను ఈ క్షేత్ర మహిమ, స్థలపురాణం ఉన్నాయి. అసోంలోని గువాహటిలోనూ కూర్మనాథాలయం ఉంది. అష్టాదశ పురాణాల్లో కూర్మపురాణం ఒకటి. దీన్ని మహావిష్ణువు పృష్ఠభాగం(వీపు)గా చెబుతారు. లక్ష్మీ కల్పంలో ఇంద్రద్యుమ్నుడనే రాజు కూర్మ రూపుడైన విష్ణువును దర్శించి అతడివల్ల విన్న పురాణమే కూర్మ పురాణమని పురాణ వాంగ్మయం చెబుతోంది.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న