చదువు - సంస్కారం

అంతర్యామి

చదువు - సంస్కారం

ప్రతిభ పుట్టుకతో వచ్చేదైతే విద్య నేర్చుకుంటేనే సాధ్యపడేది. మొదటిది భగవద్దత్తం, రెండోది సాధన, కృషి మీద ఆధారపడినది. విద్య సూర్యుడి కాంతి. ప్రతిభా ప్రసూనాన్ని వికసింపజేసేది అదే. కేవలం పుస్తక పఠనం వల్ల ప్రాప్తించేది విద్యకాదు. 64 కళలూ విద్యలే. సద్గురు బోధలచేత సముపార్జించగలిగేదే అసలైన విద్య. కేవలం విషయగ్రహణమే విద్య కాదు. కంఠస్థం చేయడమే విద్య కాదు. విద్యవల్ల క్రమశిక్షణ, సత్ప్రవర్తన, సంస్కారం పెరగాలి. వివేకం విస్తరించాలి. విచక్షణా జ్ఞానం వికసించాలి. ఆత్మ విశ్వాసాన్ని పెంచి సన్మార్గాన్ని నిర్దేశించేదే విద్య. స్వావలంబనను అలవరచేదే విద్య.

విద్యవల్ల మోక్షం లభిస్తుందని, అదే అమృతత్వమని యజుర్వేదం చెబుతోంది. పాపవిమోచనం కలిగించి కల్యాణ మార్గం చూపిస్తుందని మనుస్మృతి చెప్పింది. సర్వసుఖాలకు సకల విజయాలకు విద్య పరాకాష్ఠ అని, విద్య అనే తపస్సు ద్వారా మనిషి బ్రహ్మ పదాన్ని పొందుతాడని శతపథ బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్య మహర్షి వెల్లడించాడు. మానవుడు విద్య, ప్రజ్ఞ ద్వారా శ్రద్ధతో ఏ సత్కార్యమైనా సంకల్పించి, సంపూర్ణ సాఫల్యం పొందగలడని ఛాందోగ్యోపనిషత్‌ కథనం. యాస్కమహర్షి ‘దిరుక్త’ గ్రంథంలో విద్యవల్ల మానవుడు మహనీయుడు, మాననీయుడు కాగలడని ప్రవచించాడు. మనిషి విద్య వల్లనే శోభిల్లుతాడని పూర్వ మీమాంసాగ్రంథంలో జైమిని మహర్షి ఉద్ఘాటించాడు. విద్యతో భౌతిక సుఖాలే కాక మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని వ్యాస భగవానుడు వేదాంత శాస్త్రంలో ఉటంకించాడు. శరీరం, మనసు- ఈ రెంటి అభివృద్ధికి విద్య మూలకారణమని ఆయుర్వేద గ్రంథంలో చరకమహర్షి చెప్పాడు. నశించేది అవిద్య, నశించనిది విద్యగా ‘శ్వేతాశ్వతర’ ఉపనిషత్తులో పేర్కొన్నారు. కణద మహర్షి ‘వైశేషిక’ దర్శనంలో విద్య-అవిద్యల స్వరూపాల తారతమ్యాలను విపులీకరించాడు. సంస్కారం నేర్పే విద్య తావులీనే స్వర్ణపుష్పం లాంటిదని అరవిందులు వర్ణించారు. విశ్వంలోని సర్వవస్తువుల సత్యజ్ఞానం కలిగించేదే విద్య అని దయానంద మహర్షి చాటారు.

జ్ఞానగంగను నిరంతరం ప్రవహింపజేసే విద్యకు మించిన పవిత్రమైనదేదీ లోకంలోనే లేదని తాపసులు, యోగులు, సిద్ధులు కీర్తించారు.

ఆచరణీయమైన సద్గుణాల ప్రోదినే సంస్కారమంటారు. ఇది వృద్ధి చెందడానికి చదువు తోడ్పడుతుంది. కేవలం చదువుతోనే సంస్కారం అబ్బదు. విద్యార్థి విద్యతోపాటు తల్లిదండ్రులు, గురువులు, సమాజం నుంచి సంస్కారం నేర్చుకోవలసి ఉంటుంది. మనిషికి చదువుతోపాటు, సంస్కార సంపద మాత్రమే  మహోజ్జ్వల భవితవ్యాన్ని ప్రసాదిస్తుంది. సంస్కారం అనే శబ్దాన్ని సంపాదన అన్నపదం ఆక్రమించేసి నేటి యువత ‘చదువు’ అర్థాన్ని పరమార్థాన్ని మార్చివేసింది. సంస్కార విహీనతవల్లనే నేడు సమాజంలో విద్యావంతులు విద్యాహీనులు అన్న తేడా లేకుండా అకృత్యాలు, అత్యాచారాలు విశృంఖలంగా విజృంభిస్తున్నాయి. చదువు విజ్ఞానానికి సంబంధించింది. సంస్కారం సద్గతికి, పురోగతికి సంబంధించింది. సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వు, బుధవర్గం లేని పురం వంటిదని పెద్దలు ఏనాడో చెప్పారు. వినయవిధేయతలతో నేర్చుకున్న విద్య సార్థక్యం చేకూరుస్తుంది. విద్యకు సమానమైన ధనమే లేదంటాడు భర్తృహరి. సంస్కారంతో నేర్చినవిద్య ఆత్మజ్ఞానాన్నిస్తుంది. మోక్షప్రాప్తికదే ప్రథమ సోపానం. జ్ఞాన కర్మమార్గాలను సమన్వయ పరచేదే సంస్కారం. ఆధ్యాత్మిక సౌధానికి దారిచూపే కరదీపికలో వత్తి చదువైతే తైలం సంస్కారం. నాణానికి బొమ్మ, బొరుసుల్లాంటివి చదువు సంస్కారాలు. పాఠ్య ప్రణాళికల్లో సంస్కారాన్ని పాఠ్యాంశంగా చేర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న