గెలుపు దారి

అంతర్యామి

గెలుపు దారి

నిషి జీవితంలో గెలుపు ఓటములు సర్వ సహజం. ఎల్లకాలం ఒకేలా కదిలితే అది కాలం కాదు. ఒకేలా జరిగితే అది జీవితం కాదు. ఎంతవారికైనా ఎదురుదెబ్బలు తప్పవని, దెబ్బ తగలడమే జీవితం ముందుకు సాగుతోందని చెప్పడానికి గుర్తు అనీ మనిషి గ్రహించాలి. ఒడ్డున లంగరు వేసిన నావ సురక్షితంగానే ఉంటుంది. నావ లక్ష్యం నదిలో ప్రయాణమే తప్ప ప్రమాదానికి జడిసి ఒడ్డున నిలిచిపోవడం కాదు. కనుక పయనం సాగుతూనే ఉండాలి. మబ్బుకు మట్టికి కుదిరిన స్నేహమే విత్తనాన్ని చెట్టుగా మలుస్తుంది. ఆలోచనకు ఆచరణకు మధ్య ఏర్పడిన సమన్వయమే మనిషి ప్రయత్నాన్ని విజయంగా మారుస్తుంది. ప్రయత్నం గెలుపుగా పరిణమించడానికి తోడ్పడే ఇంధనం పేరే శక్తి. ఆలోచన దానికి పునాది.

సాధారణంగా మనం ‘ఈరోజు అనుకున్న పనులన్నీ సవ్యంగా పూర్తవ్వాలి... ఏ రకమైన ఆటంకాలు, అపజయాలు ఎదురుకాకూడదు’ అనే ప్రార్థనతో రోజును ప్రారంభిస్తాం. అది మంచిదే. దానికి తోడు ‘ఒకవేళ అవరోధం ఎదురైతే ఎదుర్కొనే శక్తిని ఇవ్వు! సమస్యను పరిష్కరించగల సామర్థ్యాన్నివ్వు’ అని ప్రార్థించగలిగితే- అది మానసిక శక్తికి దోహదకారి అవుతుంది.

శ్రమకు దాసుడైనవాడు విజయానికి యజమాని అవుతాడు. వైఫల్యాన్ని విజయంగా మలచుకుంటాడు. అనేకసార్లు విఫలమైన థామస్‌ ఆల్వా ఎడిసన్‌ అద్భుతమైన విజయాలను చవిచూశాడు.  మనవల్ల కాదిది, ఇక మరణమే గతి అనుకున్న హనుమంతుడు ఎట్టకేలకు సీతమ్మను దర్శించాడు. విజేతగా తిరిగి వచ్చాడు. ఆశావహ దృక్పథమే విజేతకు పరాజితుడికి మధ్య తేడాను నిర్ణయిస్తుంది.

పరాజితుడి ప్రధాన సమస్య- నిన్నటి ఓటమి కాదు. ఆ పరాభవాన్ని నేటికీ రేపటికీ ఎప్పటికీ ఆపాదిస్తూనే ఉండటం అసలు సమస్య. దాన్ని తన పుట్టుకకో జాతకానికో ముడిపెట్టి అపజయాన్ని సజీవంగానే కాపాడుకుంటూ, నిత్య శంకితుడిగా మిగిలిపోవడమే నిజమైన పరాజయం. ఎన్నిసార్లు ఓడిపోయినా, తిరిగి ఇదే తొలిసారి అన్నట్లుగా తన ప్రయత్నాన్ని తాజాగా ఆరంభించేవాడు తప్పక విజేత అవుతాడు. ‘ఆలోచన సవ్యంగా’ అనే మాటకు అదే అర్థం. సవ్యంగా ఉన్న ఆలోచనను శక్తి తప్పక అనుసరిస్తుందన్నది మహర్షుల పలుకు. మనిషిని విజేతను చేసేది అదే.

‘నా జీవితం ఇంతే, నేను దురదృష్టవంతుణ్ని, నా జాతకం అలాంటిది’ వంటి భావనలు మనసులో స్థిరపడుతున్నాయంటే మనిషి వెనక్కే తప్ప ముందుకు చూడటంలేదని అర్థం. ప్రయాణానికి సిద్ధంగా లేడని అర్థం. నిలవ నీటికి నాచు పట్టినట్లు- నిరాశ ఆవరించిన మనసును అసంతృప్తి అసహనం వంటి ప్రతికూల భావనలు చుట్టుముడతాయి. నిర్వీర్యుణ్ని చేస్తాయి. అప్పుడు అనుకూల దృక్పథం కోసం అన్వేషించాలి. విజేతల తీరును పరిశీలించాలి. వారిలోని ప్రత్యేకతలను గమనించాలి. మనలోని బలహీనతలను గుర్తించాలి. సవ్యమైన ఆలోచనలే ఈ మలుపులో ఆయువుపట్టు.

గాయపరచిన గతం మనసులోంచి చెరిగిపోవడంతోనే కొత్త శక్తి ఆవిర్భవిస్తుంది. వర్తమానంలోకి రప్పిస్తుంది. భవిష్యత్తులోకి నడిపిస్తుంది. లోకంలో విజేతలుగా పేరొందిన వారందరూ ఈ దశలను చవిచూసినవారే. నిన్నటినుంచి రేపటిలోకి చేరుకున్నవారే. వర్తమానాన్ని వారధిగా మార్చుకున్నవారే. పడవలోకి నీరు, గుండెలోకి నిరాశ చేరుకుంటున్నప్పుడల్లా ఎత్తి బయటకు పారబోయడమే మనిషి కర్తవ్యం. అదే అచ్చమైన గెలుపు దారి... నిజమైన రాదారి!

- ఎర్రాప్రగడ రామకృష్ణ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న