ఆనంద రస రాసలీల

అంతర్యామి

ఆనంద రస రాసలీల

కొండంత దేవుణ్ని కొండంత కన్నుతో చూడలేం. అరచేతి అద్దంలోకి ఆవాహన చేసుకోవలసిందే. మన భాగ్యం ఏమిటంటే- ఆ భక్తవత్సలుడు అద్దంలోకి అతి ఇష్టంతో తన్ను తాను కుదించుకోవడమే. తానుగా ఇమిడిపోవడమే. అందుకే యశోదమ్మ ముద్దుల్లో వెన్నముద్దలా కరిగిపోయాడు. అనసూయమ్మ ఊయలలో పసిబిడ్డలా ఊగిపోయాడు. కురుసభలో, కురుక్షేత్ర యుద్ధ మధ్యంలో విరాట్‌ రూపాన్ని ప్రదర్శించిన శ్రీమన్నారాయణుడు బలిముందు వామనుడైపోయాడు. నిజానికి తన లీలలతో ఆయన మనను ఆడుకోవటం కాదు. ఆయన విరాట్‌ శక్తిని గ్రహించే శక్తి లేక మనమే ఆయనను ఆడుకుంటున్నాం. ఈ బాల్య చాపల్యాన్ని ఆయన ప్రేమగా ఆనందిస్తున్నాడు. మురిపెంగా ఆస్వాదిస్తూ మురిసిపోతున్నాడు. బాలకృష్ణుడిగా గోపెమ్మలు ముద్దుమురిపాలు లాలించినా, బృందావనంలో గోపికలతో క్రీడించినా-  అక్కడ ఆట, ఆనందం ఎవరిదో అర్థంకాదు. కృష్ణుడిదా, గోపెమ్మలదా, గోపికలదా? ఆడుతూ, ఆడించే కృష్ణుడు, తాను ఆనందిస్తూ, తామే ఆనందిస్తున్నామనే ఆనందంలో గోపికా గోపెమ్మలనూ ఓలలాడేలా చేసిన శ్రీకృష్ణుడు ఆనందానికి ప్రతిరూపం కాదు... ఆనందానికి కేంద్రం. ఆనందం ఎవరిది, ఎక్కడిది, ఎక్కడుంది? ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు, ఎవరు పొందుతున్నారు- ఈ ప్రశ్నలకు తిరుగులేని సమాధానం... శ్రీకృష్ణుడి ఉనికే ఆనందం, ప్రతి అణువూ ఆనందమే. పూల పరిమళంలా పరిధులు లేని ఆనందం... అవధులు లేని ఆనందం.

నారాయణుడు రసస్వరూపుడు. రసానిది పారే స్వభావం. ప్రవహించే స్వభావం. వ్యాపించే స్వభావం. విశ్వరూపుడైన ఆయన స్వరూపం, స్వభావం ఆనందమే అయినప్పుడు మనకు ఆవేదనకు అవకాశమే లేదే?! ఆకాశమే(జాగా) లేదే!? నిజమే... అక్షరాలా. కానీ మనిషి తోక మాత్రం లేని కోతి, రెండు కాళ్లున్న పశుజాతి. అజ్ఞానం, అవిద్య మనిషిని మూర్ఖుణ్ని చేశాయి. మెదడు గిల్లుకుని మోకాళ్లలో అతికించుకున్నాడు! కావాలని చేతులు కళ్లకడ్డం పెట్టుకుని లోకాన్ని చీకటి చేసుకున్నాడు! ఎదురుగా సూర్యుడున్నా కనిపించడు. మెదడు, మనసు పనిచేయవు. ఆత్మ అభావం అయిపోతుంది. ఆనందమే తానైన శ్రీకృష్ణుడు అంతర్థానం అయిపోతాడు. కనీసం ఆ మూర్ఖుడి వరకైనా.

ఇంత విశ్వవ్యాప్తం అయిన ప్రేమను, మనలో, మనసులో అణువణువునా నిండివున్న ప్రేమను మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం? ఎందుకు అనుభూతించలేకపోతున్నాం? ఇదొక అవకాశమో, వ్యాపార వ్యవహారమో కాదు...  ఎంపిక చేసుకునేందుకో, వెనకముందులాడేందుకో. ఇది మన సర్వత్రా ఆవరించుకుని ఉన్న సహజ ప్రాణాధార శక్తి. కానీ ఈత కొట్టినప్పటిలా రెండు చేతులా పక్కలకు, వెనక్కు తోస్తూ ముందుకు మురుగులోకి, దుర్గంధంలోకి ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆత్మపూర్ణుడైన మనిషికిది తగదు. కొండంత దేవుణ్ని అద్దమంత ఆత్మలో కొలువు తీర్చుకున్న మనిషికి ఆ అభావం తగదు. అద్దానికి మనమై పట్టించుకున్న మకిలిని తొలగించుకుందాం. ఆ ఆనందమే తానైన శ్రీకృష్ణుణ్ని తిలకించుకుందాం. ఏకైక పురుషుడైన నారాయణుని ప్రియమార పరివేష్ఠించిన గోపికల్లా ఆ ఆనందరస రాసలీలను అరమోడ్పు కన్నులతో ఆస్వాదిద్దాం. అప్పుడు ఆవేదనా పూర్ణలోకమైనా ఆనందపూర్ణ బృందావనంగా భాసిస్తుంది.

  - చక్కిలం విజయలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న