ఆషాఢ బోనాలు

అంతర్యామి

ఆషాఢ బోనాలు

ప్రకృతినే పరమాత్మగా భావించే సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు నిర్దిష్టమైన సంప్రదాయాలు సువ్యవస్థితమయ్యాయి. ఆ సంవిధానంలోనిదే ఆషాఢ మాసంలో మాతృశక్తి స్వరూపాల ఆరాధన.

కృతి అంటే సృష్టి. ప్రశస్తమైన కృతే- ప్రకృతి. ఈ ప్రకృతిలో జీవుల పురోభివృద్ధిలో జీవుల ఉత్పత్తి, శరీర నిర్మాణం, పోషణ, కార్యనిర్వహణ దక్షత ముఖ్య భూమిక పోషిస్తాయి. సమాజంలో, వ్యక్తులలో ఈ అంశాలు విలసిల్లడానికి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంపద, ఆ సంపదను యుక్తాయుక్త విచక్షణతో వినిమయం చేయడానికి తగిన శక్తి కావాలి. జ్ఞానం, సంపద, శక్తుల్ని ప్రసాదించే మూల బ్రహ్మాత్మిక- ప్రకృతేశ్వరి. ఈ ముగ్గురమ్మలను సరస్వతి, లక్ష్మి, దుర్గలుగా వైదిక రీతిలో అర్చిస్తున్నాం. ప్రకృతి ఆకృతులైన జగన్మాత రూపాల ఆరాధనకు ఆషాఢం తగిన సమయమని దేవీ భాగవతం, కాళికా పురాణాలు నిర్దేశించాయి. ఆషాఢంలో ప్రకృతి పరంగా అనేక అనారోగ్యకారక పరిస్థితులు ఉంటాయి. వర్ష ప్రభావంవల్ల సాంక్రామిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వీటినుంచి రక్షణ పొందడానికి దైవశక్తిని ఆశ్రయించడానికి శక్తి సమార్చన చేయాలని ఆర్షధర్మం సూచించింది. ఆ నేపథ్యంలోనే ఆషాఢంలో త్రిలోచనీ పూజ, మహిషాసురమర్దిని పూజ, ఐంద్రీవ్రతం, మహాలక్ష్మి పూజ, శాకంబరీ నోము, గోపద్మవ్రతం, కోకిలా వ్రతం, చండికాపూజ, అంబికా వ్రతం వంటి శక్తి ఆరాధనా ప్రక్రియల్ని నిర్వహిస్తారు. వివిధ అన్న పదార్థాల్ని శక్తి స్వరూపాలకు నివేదించి అమ్మ అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తారు. భవిష్యోత్తర పురాణం పంచభూత మాతృ ఉత్సవాన్ని ఆషాఢ ప్రధాన వేడుకగా అభివర్ణించింది. వైదికంగా విస్తరిల్లిన శక్తి రూపాలకు అనుగుణంగా జానపదులు, గ్రామీణులు, పలు రూపాల్లో అమ్మతల్లిని ఆరాధించుకోవడం మన సంస్కృతిలో ముఖ్య భాగం. ప్రకృతి శక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతం వెల్లడించింది.

అమ్మ ఇచ్చే అనుగ్రహ ఫలితాల్ని బట్టి జానపదులు శక్తిరూపాలకు పేర్లు నిర్ణయించుకున్నారు. ఈ శక్తిమాతలకు ఆషాఢంలో సభక్తికంగా ఆహారపదార్థాల్ని నివేదించే సంప్రదాయం బోనాల వేడుకగా తెలంగాణలో స్థిరపడింది.

భోజనానికి రూపాంతరమే బోనం. ప్రకృతి శక్తివల్ల దక్కిన సస్యాల్ని, శాకాల్ని, ధాన్యాల్ని, ఆ శక్తికే సమర్పణ చేసి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికే బోనాల వేడుక సాకారమైంది. కాకతీయుల కాలంలో బోనాల సందడిలో తమ ఇలవేల్పు అయిన ‘కాకతి’కి అన్నపురాశుల్ని సమర్పణ చేశారని ‘నృత్యరత్నావళి’ వెల్లడించింది. రెండో ప్రతాప రుద్రుడి కాలంలో బోనాల సందడిలో భాగంగా సామ్రాజ్యమంతా ఆషాఢంలో అన్న సంతర్పణ అవిచ్ఛిన్నంగా కొనసాగేది. కుతుబ్‌షాహీ నవాబులు గోల్కొండ కోటలోని జగదంబిక ఆలయంలో బోనాల పండుగను ప్రారంభించారు. ఆషాఢంలో  మొదటగా ఇక్కడే బోనాల వేడుక మొదలవుతుంది. అందుకే ఈ గోల్కొండ బోనాలను చెలిమి బోనాలంటారు. ఆషాఢంలో ప్రతి ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల సందడి సాకారమవుతుంది. ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా మాతామహేశ్వరి, షాలిబండ అక్కన్న మాదన్న మహాకాళి ఆలయాలలో విశేషంగా బోనాల ఉత్సవాల్ని నిర్వహిస్తారు. జంటనగరాల్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆఫాడ శ్రావణ మాసాల్లో ఈ సంరంభం వెల్లివిరుస్తుంది. పసుపు, వేపాకు, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలిసిన నీటితో శక్తి మాతలకు అభిషేకం చేస్తారు. దీన్ని ఘటోత్సవంగా వ్యవహరిస్తారు. ‘విషూచి’గా పేర్కొనే కరోనా వంటి సాంక్రామిక వ్యాధుల నివారణకు ఈ ఔషధీయుక్త జలం ఉపయోగపడుతుంది. ఎదుర్కోళ్లు, ఫలహారపు బండ్లు, రంగం, సాగనంపు వంటి అంశాలతో ఈ బోనాల సందడి ప్రకటితమవుతుంది.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న