జీవన సంస్కారం

అంతర్యామి

జీవన సంస్కారం

వివిధ సందర్భాలలో ‘సంస్కారం’ అనే పదప్రయోగం మనం వింటుంటాం. సందర్భాన్ని బట్టి అర్థంలో తేడా ఉంటుంది. జన్మ సంస్కారం- జీవి లక్షణాలు, వ్యవహార శైలికి సంబంధించింది. సింహాన్ని చూడగానే దాని రూపురేఖల్ని బట్టి అదేమిటో మనం చెప్పగలుగుతాం. అలాగే దాని క్రూరస్వభావం గురించీ మనం గమనికతో ఉంటాం. ఆవు దగ్గరకు వెళ్ళినంత చనువుగా సింహం దగ్గరకు వెళ్ళం, వెళ్ళలేం. మనుషులందరూ ఒకే జాతి అయినా సంస్కారాల తేడా ఉంటుంది. వంశం, కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణం, స్నేహితులు, ప్రపంచానుభవాలు... సంస్కారం మీద ప్రభావం చూపుతాయి.

మనిషి సంస్కారానికి, కులమతాలకు సంబంధం లేదు. సంస్కారం పూర్తిగా వ్యక్తిగతం. హిరణ్యకశిపుడు లాంటి క్రూరుడికి, పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు జన్మించాడు. కులహీనుడైన ధర్మవ్యాధుడు నారదుడికే నీతి పాఠాలు చెప్పాడు. చండాలుడు ఆదిశంకరుల అజ్ఞానాన్ని తొలగించాడు. శివాంశతో జన్మించిన దుర్వాసుడు ఆగ్రహానికి, అసహనానికి మారు పేరయ్యాడు. ఇది పరమ దయాళువు, నిత్య తపోదీక్షాపరత్వం గల పరమశివుడి తత్వానికి విరుద్ధం. ఆంజనేయుడు మర్కట రూపుడైనా మహాజ్ఞాని. భక్తుడు, భగవంతుడు ఏకత్వంగా ఉన్న అపురూప అవతారం. ఇలాంటి వైవిధ్యాలతో సంస్కారం ఉంటుంది. అయితే, మనిషికి తన్ను తాను సంస్కరించుకోగల మహత్తర అవకాశం ఉంది. అందుకోసం పరిశీలనా శక్తిని బలపరచుకోవాలి. మనం ప్రపంచాన్ని పరిశీలించినంతగా మనల్ని మనం పరిశీలించుకోం. అసలు సమస్య ఇదే. శరీరాన్ని బహువిధాలుగా సంస్కరించుకుంటామే తప్ప, వ్యక్తిత్వ సంస్కరణ పట్ల ఎలాంటి శ్రద్ధా చూపం. అందువల్ల చాలామంది జీవన ప్రగతి ఊహగానే ఉండిపోతుంది.

అందరూ మనల్ని గౌరవించాలని ఆశిస్తాం తప్ప మనం కూడా అందర్నీ గౌరవించాలనుకోం. మనకున్న కొద్దిపాటి ప్రత్యేకతలకు మనమే మురిసిపోతూ అహంకరిస్తుంటాం. మన మాట, ప్రవర్తనల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలో మనకు మించిన ఘనులు ఎందరో ఉంటారనే స్పృహ ఉంటే పొరపాటునైనా మనలో అహం పొడచూపదు. ప్రపంచాన్ని జయించడానికి వినయానికి మించిన ఆయుధం మరొకటి లేదు. వినయం లేనివాడు ఎన్ని ఘనతలు కలిగి ఉన్నా, ఎవరూ పట్టించుకోరు. ఎవరూ పట్టించుకోకపోవడం మరణంతో సమానం. చుట్టూ ఎందరో ఉన్నా మనం ఒంటరిగా మిగిలిపోతాం. అలాంటి దుస్థితి కలగకూడదంటే, మనల్ని మనం సంస్కరించుకోవాలి. నిత్యకృత్యాలతో ప్రాపంచిక వ్యవహారాలకు దేహాన్ని సిద్ధం చేసుకున్నట్లే, వ్యక్తిత్వాన్నీ సంస్కరించుకోవాలి. ఇది నిత్యకార్యక్రమంగా ఉండాలి. అద్దంలో శరీరాన్ని పరిశీలించుకున్నట్లే, ఆత్మ పరిశీలనతో మనసు, బుద్ధి సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.
అందరికీ జన్మతః గొప్ప సంస్కారం, జ్ఞానం ఉండకపోవచ్చు. కానీ, కృషితో వాటిని సాధించడం అసాధ్యం కాదు. సంస్కారాన్ని మించిన సంపద లేదు. దేహం దహన సంస్కారంతో నశించినా, మన జీవన సంస్కారం చిరస్మృతిగా ప్రపంచంలో ఉండిపోతుంది.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న