మనసే మిత్రుడు

అంతర్యామి

మనసే మిత్రుడు

గవంతుడు మనిషికి ప్రసాదించిన గొప్పవరం మనసు. మనిషిని మనసుకన్నా అధిక ప్రభావితం చేసేది మరేదీ లేదు. అభ్యుదయానికి మూలం మనసు. అలాగే పతనానికి కారణం కూడా మనసే. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనసే మనకు మిత్రుడు, శత్రువు అని ఉపదేశిస్తాడు.

స్వచ్ఛతకు నిర్మలత్వానికి సంకేతం మనసు. మనిషిలో కలిగే స్పందనలు, ప్రతిస్పందనలు, రాగద్వేషాలు... ఇలా అన్నింటికీ మూలం మనసే. ఇలాంటి మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి? మానసిక ఆనందం కలగడానికి ఏం చేయాలి? దీనికి పతంజలి మహర్షి నాలుగు విషయాలు బోధించాడు. మొదటిది సజ్జనసాంగత్యం. సజ్జనులతో సహవాసం చేస్తే భ్రమర కీటక న్యాయంగా మనిషి సజ్జనుడిగా మారతాడు. సజ్జన సాంగత్యం వల్ల మనసు నిర్మలమవుతుంది. మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక రెండోది, సహాయం. ఈ సమాజంలో రకరకాల పరిస్థితుల వల్ల దుఃఖపడుతున్నవారున్నారు. వారిని ఓదార్చి తగిన సహాయం అందించాలి. ఈ సహాయ సహకారాల వల్ల మానసికానందం కలుగుతుంది.

ఎవరైనా సత్కార్యాలు చేస్తుంటే అభినందించాలి. ప్రోత్సహించాలి. ఆ సత్కార్యాల్లో భాగస్వాములమైతే మనకు తప్పక మనశ్శాంతి కలుగుతుంది. ఇది మూడోది.  మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మానికి అధర్మం వల్ల, సత్యానికి అసత్యం వల్ల హాని కలుగుతున్నప్పుడు దానినణచి వేయగలిగిన సామర్థ్యం గలవారు చూస్తూ ఊరుకోకూడదని, అలా ఉపేక్షించి ఊరుకొన్నట్లయితే వారికే నష్టం వాటిల్లుతుందని చెబుతాడు. అందుకే సమర్థులైనవారు అధర్మాన్ని ఆపాలి. ఆ దుర్మార్గాన్ని ప్రోత్సహించకూడదు. ఇది నాలుగోది. వీటిని పాటించిన మనిషి మానసిక ఆనందాన్ని, మనశ్శాంతిని పొందుతాడు.

మనసు చాలా చంచలమైనది. ఇలాంటి చంచలమైన మనసును ఎలా అదుపు చేయాలన్న అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడు అభ్యాస వైరాగ్యాలతో అదుపు చేయగలమని సమాధానం ఇచ్చాడు. నిత్యం బాహ్యవిషయాలపై పరుగులిడుతూ చెడు అలవాట్లకు బానిసైన మనసును సక్రమమైన మార్గంలోకి మళ్ళించి, ఆ దారిలో ముందుకు పయనించేలా అభ్యాసం చేయగలిగితే మనోనియంత్రణ సాధ్యపడుతుంది.

మనసు ఎంత పవిత్రమైనదైతే దాన్ని స్వాధీనం చేసుకోవడం అంత సులభం. అందుకే మనసులోకి నిరంతరం సత్‌సంకల్పాలను ఆహ్వానించాలి. మనసును పరిశుద్ధం చేయడానికి సాధనలు చేయాలి. మనోనియంత్రణ కలిగిన మనిషి సమగ్రమైన వ్యక్తిత్వ వికాసం కలిగి ఉంటాడు. అతడిలో మానసిక రుగ్మతలు ఉండవు. మానసిక ఒత్తిళ్ల వల్ల కలిగే శారీరక రుగ్మతలూ దరిచేరవు. ప్రతిక్షణం పరిపరి విధాల ఆలోచించే మనసును నియంత్రించి స్థిరత్వం కలిగించడానికి ధ్యానం చక్కని ఆయుధం. అంతర్ముఖులైన ధీరులే అంతరాత్మను దర్శించగలరు అంటారు ఆధ్యాత్మికవేత్తలు.  బహిర్గతమైన మనసును అంతర్ముఖం చేసుకుని భగవంతుడి ధ్యానంలో గడిపిన మనిషికి శాశ్వతానందం చేకూరుతుంది.
ప్రార్థన, సాధుజీవనం, సంకీర్తన, సద్గ్రంథ పఠనం, నిష్కామ సేవల వల్ల మనసులో మాలిన్యాలు తొలగిపోతాయి, మానసిక శుద్ధత అలవడుతుంది. అప్పుడే మనసులో ఉన్నతమైన భావాలు అంకురిస్తాయి. అవే మనిషిని విజయతీరం వైపు నడిపిస్తాయి.

- విశ్వనాథ రమ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న