శ్రీ రామాయణ పారాయణం

అంతర్యామి

శ్రీ రామాయణ పారాయణం

దికావ్యం రామాయణాన్ని ఆద్యంతం చదివి అందులో ఉన్నదంతా ఆకళించుకోగల మనిషికి ధర్మాన్ని గురించి ప్రత్యేకించి తెలుసుకునేందుకు మరిన్ని శాస్త్రగ్రంథాలు చదివే అవసరమే ఉండకపోవచ్చు. రామాయణంలో కనపడేదంతా ధర్మమే. మంచి ఆలోచనలు కలిగిస్తూ, దుష్కర్మలన్నింటినుంచీ దూరం చేసే జ్ఞానమది. స్నేహపూర్వకమైన మిత్రవాక్యం లాంటిది.

సామాన్యంగా భగవంతుడు ఎత్తే అవతారాల్లో దుష్టశిక్షణ శిష్టరక్షణ అంతరార్థమై గోచరించే పరమార్థమై ఉంటాయి. రామాయణకర్త మహర్షి వాల్మీకి మాత్రం, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి సాధించలేనిదంటూ ఉండదని చెప్పడానికే, భగవంతుడైన రాముడిని మనిషి రూపంలో పాత్రగా మలచి చూపించినట్లు స్పష్టమవుతుంది. రాముడు తాను భగవంతుడినన్న విషయం తనకే తెలియనట్లుంటాడు. సామాన్యుడిలా సంచరిస్తాడు. అతడి మానసిక వైఖరులన్నీ మనుషులనే తలపిస్తాయి. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్య దశలన్నింటిలో మనుషులు కనబరచే స్పందనలనే వ్యక్తంచేస్తాడు. జీవితంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలను మనుషుల్లాగే దాటుకుంటూ వెళతాడు. మానవ సంబంధాలను బలహీనపడనీయని పరిపూర్ణతతో, అరుదైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ అందరినీ సమ్మోహితులను చేస్తాడు. మహర్షి వాల్మీకి రామాయణంలో రాముడి నోటి వెంట తాను ధర్మ సంస్థాపనార్థం వచ్చినవాడినని ఎప్పుడూ చెప్పించరు. అందుకోసమే వచ్చినవాడని అందరికీ అనిపింపజేస్తారు.

రాముడు కట్టుబట్టలతో అరణ్యవాసానికి వెళ్ళవలసిన పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోలేదు. ఎవరినీ అందుకు బాధ్యుల్ని చేయలేదు. పితృధర్మం, పితృవాక్య పాలనలు పాటించేందుకు అది తనకు వచ్చిన అవకాశమే అనుకున్నాడు కానీ, పినతల్లి కుతంత్రమని అనడానికి అంగీకరించడు. రాజ్యాధికారాన్ని, భోగభాగ్యాలను తృణప్రాయంగా త్యజించి, సుఖాలకు దూరంగా కారడవులలో, క్రూరమృగాలు, ఘోరరాక్షసుల మధ్య పద్నాలుగేళ్లు వనవాసం చేస్తాడు.

ఏకపత్నీ వ్రతానికి, ఆదర్శ దాంపత్యానికి రాముడు నిర్వచనం. అతడి సోదర ప్రేమ సాటిలేనిది. భక్తితో సేవలందించే వారినుంచి భగవంతుడు ఫలం, పుష్పం, తోయాలను మించి మరేదీ కోరడనే సత్యాన్ని చెప్పే సంఘటనలు రామాయణంలో అనేకం. శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను ఆరగించడం, గుహుడు నదిని దాటించడం గొప్ప విషయమనడం, చిన్న ఉడుత వారధి కడుతున్నప్పుడు పడిన ప్రయాసను పెద్ద సహాయమంటూ ప్రేమతో ఆ ప్రాణిని చేరదీసి దీవించడం... భగవంతుడెప్పుడూ భక్తవత్సలుడేనని మనిషికి చెప్పేందుకే!

రాముడు స్నేహపాత్రుడు, శరణాగతుడు. రాజ్యాన్ని, కట్టుకున్న భార్యను అపహరించి బాధలకు గురిచేసిన బలవంతుడైన వాలి సోదరుడు సుగ్రీవుడిని చేరదీశాడు. ధర్మమార్గాన్ని విడిచిపెట్టవద్దని హితబోధ చేసినందుకు రావణుడి ఆగ్రహానికి గురైన అతడి సోదరుడు విభీషణుడికి శరణు ఇచ్చి యుద్ధంలో విజయానంతరం లంకారాజ్యానికి పట్టాభిషిక్తుణ్ని చేస్తాడు. అహంకారం అణుమాత్రమైనా చూపించని రాముడు శత్రువుల నుంచి కూడా నేర్వగలదెంతో ఉంటుందని తెలిసిన విజ్ఞుడు. తన చేతిలో పరాజితుడై మృత్యుముఖంలో ఉన్న రావణుడి దగ్గరకు రాజనీతి పాఠాలు నేర్చుకొమ్మని సోదరుడు లక్ష్మణుడిని పంపిస్తాడు.

రాముడి మాటలు చేతలు మనిషికి ఉండవలసిన ఆధ్యాత్మికతనంతా సూచిస్తాయి. జ్ఞానులతడిని మనిషి రూపంలోని బ్రహ్మమని కీర్తించారు.  

భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి, నైతిక విలువలకు, నాయకత్వ లక్షణాలకే దర్పణం పట్టే రాముడి చరిత్ర రామాయణాన్ని, వ్యక్తిత్వవికాసం బోధనాంశంగా చేపట్టిన చోటల్లా పాఠ్యపుస్తకమై కనిపించాలి. ధర్మమార్గంలో జీవించాలనుకునే మనుషులకు నిత్యపారాయణ గ్రంథం కావాలి.

- జొన్నలగడ్డ నారాయణమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న