ధీరత్వం

అంతర్యామి

ధీరత్వం

కార్యశీలి సహజ లక్షణం ధైర్యం. సముద్రాన్ని లంఘించడానికి, లంకలో అనేక సాహస కృత్యాలు చేయడానికి హనుమంతుడి ధైర్య గుణమే కారణం. క్లిష్ట సమయాల్లో, కష్టాలు ఎదురైనప్పుడు ధీరులై నిలవగలగాలి. అప్పుడే విజయ సాధనకు అవకాశం ఉంటుంది. పిరికితనం కష్టాలకు మూలం. ధైర్యవంతులే సరైన ఆలోచన చేయగలరు. అపజయాలకు కన్నీరు కార్చేవాళ్లు చరిత్రలో మిగలరు. సాహసకృత్యాలు చేసేవాళ్లు జనాదరణకు పాత్రులవుతారు. ఛత్రపతి శివాజీని ఔరంగజేబు చర్చలకు ఆహ్వానించి, ఆయనను కుమారుడితో సహా చెరసాలలో వేశాడు. ధీరత్వాన్ని చెరసాలలు బంధించగలవా? ఉపాయంతో శివాజీ ఔరంగజేబు బందిఖానా నుంచి తప్పించుకొని స్వరాజ్యానికి చేరుకున్నాడు. అతడి సాహసానికి దేశ ప్రజలు ఆశ్చర్య చకితులయ్యారు.

మన దేశ స్వాతంత్య్ర సమర కాలంలో ధీరులెందరో ఆంగ్లేయులను ఎదిరించి, చిరునవ్వుతో ఉరికంబం ఎక్కారు. ఆ కాలంలో పసివాళ్లు సైతం ధైర్యం ప్రదర్శించారు. వారిని విప్లవకారులుగా పేర్కొనే బదులు దేశభక్తులుగా భావించడం సబబు.

ఒక బాలుడు కాశీలో చదువుకొంటూ ఉన్నాడు. పేదవాడు కావడం వల్ల వారాలు చేసుకొనేవాడు. అవి స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా జరిగే రోజులు. సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. స్వాభిమానం, దేశభక్తి నిండుగా ఉన్న ఆ పేదబాలుడు ఉత్సాహంగా ఉద్యమంలో పాల్గొన్నాడు.పేరు చంద్రశేఖర్‌. రక్షకభటులు ఆ బాలుడిని బంధించి న్యాయాధిపతి ముందుంచారు.

‘నీ పేరేమిటి?’ ప్రశ్నించాడు న్యాయాధిపతి. ‘ఆజాద్‌!’ ఆ బాలుడు నిబ్బరంగా జవాబు చెప్పాడు. ఆజాద్‌ అంటే ‘స్వేచ్ఛ’ అని అర్థం! ఈ జవాబుతో న్యాయాధిపతికి బాలుడిపై ఏదో అనుమానం వచ్చింది.

‘నీ తండ్రి పేరు?’

‘స్వాధీన్‌!’ బాలుడి సమాధానం విని న్యాయాధిపతి కనుబొమలు ముడివడ్డాయి. స్వాధీన్‌ అంటే స్వాతంత్య్రం అని అర్థం.

‘మీ ఊరు ఏది?’

‘చెరసాల!’ అన్నాడు బాలుడు ఠక్కున.

ఈ జవాబుతో న్యాయాధిపతికి బుర్ర గిర్రున తిరిగింది. కోపంతో ‘16 కొరడా దెబ్బలు’ శిక్ష విధించాడు. కాశీ కేంద్ర కారాగారంలో శిక్షను అమలు చేశారు. ప్రతి దెబ్బకు ‘వందే మాతరం’ అన్నాడు ఆ బాలుడు. అతడి ధైర్యానికి రక్షకభటులు ఆశ్చర్య చకితులయ్యారు. నాటినుంచి అతడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ అనే పేరుతో ప్రఖ్యాతిచెందాడు. ఇటువంటి ధీరత్వమే మన స్వాతంత్య్రయోధులను ముందుకు ఉరికించింది.

మనం చేసే పనుల్లో శ్రద్ధ చూపితే దేనికీ బెంబేలు పడనవసరం లేదు. తాత్కాలిక అపజయాలకు కుంగిపోనవసరం లేదు. ‘నేను మహా ధైర్యశాలిని. నేను తలపెట్టిన కార్యం విజయవంతం అవుతుంది!’ అని నమ్మి చేయవలసిన పనుల్లో శ్రద్ధ చూపకపోతే వైఫల్యం తప్పదు. రేపు చేయగల పనిని ఇవాళే పూర్తి చేస్తే అది మనిషికి ఆత్మ విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఆత్మవిశ్వాసమే దైర్యానికి మొదటిమెట్టు.

మహాభారతం శాంతి పర్వం ఇలా చెబుతున్నది- ‘రేపు చేయవలసిన పనిని ఈ దినమే, సాయంకాలం చేయవలసిన పనిని ఉదయమే పూర్తి చేయాలి. మన పనులన్నీ పూర్తయ్యేదాకా మృత్యువు ఆగదు. జీవితంలో ప్రతి క్షణం విలువైనదే!’ ఆధ్యాత్మిక ధోరణి అలవడిన వారిని మృత్యువు భయపెట్టలేదు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న