మహాలక్ష్మీవ్రతం

అంతర్యామి

మహాలక్ష్మీవ్రతం

హాలక్ష్మీ వ్రతం ఆచరించే విధి వ్రతకల్పంలోను, ధర్మశాస్త్రంలోను ఉంది. ఈ వ్రతం ఆషాఢ శుద్ధ దశమి రోజున ఆచరిస్తారు. దీన్ని ఆచరించడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుందంటారు.

లక్ష్మీ అనే పదం మనకు రుగ్వేదఖిలకాండలోని శ్రీసూక్తంలో వినవస్తుంది. ఆ సూక్తమే లక్ష్మీదేవి పంచభూతాత్మకమైన ఈ ప్రకృతికి మూలమని తెలుపుతోంది. ‘జగత్తు అంతా వ్యాపించిన విష్ణువు లాగే ప్రపంచమంతా శ్రీమహాలక్ష్మీ వ్యాప్తమైంది’ అని విష్ణు ధర్మోత్తర పురాణ వచనం. ఏ విధమైన సంపద కోసమైనా లక్ష్మినే అర్చిస్తారు. సకల సంపదలకు అధిష్ఠాత్రి శ్రీ మహాలక్ష్మి. సాక్షాత్తు విష్ణుమూర్తి స్కాంద పురాణంలో మహాలక్ష్మి గురించి చెబుతూ, ‘సంసార సాగరంలో మునిగిపోయేవారు నన్ను పొందడానికి లక్ష్మీదేవిని కటాక్ష రూపిణిగా మహర్షులు నిర్ణయించారు. ఇది నాకూ సమ్మతమే. లక్ష్మి పట్ల విముఖత చూపేవారు నాకూ ద్వేషులే’ అంటాడు.

ఆషాఢ శుద్ధ విదియ నాడు శాకవ్రత మహాలక్ష్మీ వ్రతారంభం దధివ్రతారంభం జరుగుతాయి. లక్ష్మీదేవిని పూజించి ఒక నెల ఆకుకూరలు తినడం మాని, ఆకుకూరలు దానంచేస్తారు. అనమిత్రుడు, గిరిభద్ర దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. మక్కువతో బిడ్డను ముద్దుపెట్టుకుంటుంటే, బిడ్డ ఫక్కున నవ్వాడు. తల్లి కారణమడిగింది. ‘నన్ను మింగడానికి జాతహారిణి అనే మార్జాలం పొంచిఉంది. మన పరిచయం అయిదారు దినాలది. ఎందుకింత వ్యామోహం?’ అన్నాడు. తల్లి గిరిభద్ర కోపగించుకుని పురిటి గదిలోంచి వెళ్ళిపోయింది. జాతహారిణి వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్ళి విక్రాంతుడనే రాజు భార్య హైమిని ప్రసవించి ఉన్న శయ్యమీద ఉంచి, అక్కడి బిడ్డను మరో ఇంటికి తీసుకెళ్ళి, అక్కడున్న శిశువును తినేసింది. విక్రాంతుడు తన కొడుక్కు ఆనందుడనే పేరు పెట్టి తగిన వయసు వచ్చాక, ఉపనయనం చేశాడు. గురువు ఆనందుడికి తల్లికి నమస్కరించమని చెప్పాడు. ఆనందుడు- ‘ఈమె నా కన్నతల్లి కాదు. ఈమె కొడుకు ‘చైత్రుడు’ విశాల గ్రామంలో పెరుగుతున్నాడు’ అని వివరించాడు. చైత్రుడిని పిలిపించుకొమ్మని విక్రాంతుడికి చెప్పి, ఆనందుడు అడవులకు వెళ్ళి బ్రహ్మకోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ‘నీవు మనువు కావాల్సి ఉంది. మన్వాధికారం నిర్వర్తించిన తరవాత నీకు ముక్తి కలుగుతుంది. పూర్వజన్మలో నీవు నా కంటినుంచి పుట్టావు. ఇక నుంచి చాక్షుషమనువు అనే పేరుతో వర్ధిల్లగలవు. ఇప్పుడింక తపస్సు మానెయ్యి’ అని అంతర్థానమయ్యాడు. చాక్షుషుడు తపం చాలించి, ఉగ్రుడనే రాజు కూతురు విదర్భను వివాహమాడాడు. ఈ వ్రతకథను షోడశోపచార పూజానంతరం చెప్పుకొని శ్రీమహాలక్ష్మిని కీర్తించి స్మరిస్తారు.

తొలి ఏకాదశికి ముందు రోజున వచ్చే ఈ పర్వదినం శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైంది. ఈ రోజున వ్రతం చేసి, కథ చెప్పుకొని, శాస్త్రోక్తంగా దానధర్మాలు చేసే వారింట లక్ష్మి స్థిరనివాసం ఏర్పరచుకుని, కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహించి, సకల సంపదలను శాశ్వతంగా ఇచ్చి, సుఖశాంతులను ప్రసాదించి, మోక్షానికి అర్హత కలిగిస్తుందని వ్రత ఫలశ్రుతి చెబుతోంది. ‘జ్ఞానం, ఐశ్వర్యం, సుఖం, ఆరోగ్యం, ధనం, ధాన్యం, జయం... మొదలైనవన్నీ లక్ష్మీ శబ్దానికి నిర్వచనాలే’ అని వేద నిరుక్తసారం చెబుతోంది.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న