చాతుర్మాస్య దీక్ష

అంతర్యామి

చాతుర్మాస్య దీక్ష

కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస... అని, సన్యాస దీక్ష వహించిన వారిలో నాలుగు వర్గాల వారుంటారు. బ్రహ్మచర్య వ్రతం కాషాయ వస్త్రధారణ వంటి నియమాలు అందరికీ తప్పనిసరి. వీటితోపాటు అందరూ ఆత్మనిష్ఠులై ఉండాలని ‘ధర్మసింధు’ నిర్దేశించింది. వీరిలో హంస, పరమహంసలు ఇద్దరూ ఏకదండాన్ని, కుటీచకుడు త్రిదండాన్ని ధరిస్తారు. త్రిదండం- జీవ ప్రకృతి పరమాత్మతత్వాలు మూడింటికీ ప్రతీక. పొడవులో వీటికి తేడా ఉంటుంది. అన్నింటికన్నా చిన్నది ప్రకృతి తత్వం. దీనిపైది జీవతత్వం. పరమాత్మతత్వానికి ప్రతీకగా ఉండే దండం మిగిలిన వాటికన్నా పొడుగ్గా ఉంటుంది. ప్రకృతి, జీవుడు, దైవం ఒకదాన్ని ఒకటి ఎన్నడూ విడిచి ఉండవని చెప్పడమే వాటిని కలిపి ముడేసిన త్రిదండ ధారణలోని ఆంతర్యం. త్రిదండానికి ధ్వజంగా కనిపించే తెల్లని వస్త్రంపేరు ‘జలపవిత్రం’. అది సాత్వికతకు గుర్తు. గృహస్థులకు దర్భలతో చేసిన పవిత్రం ఎలాగో- సన్యాసులకు జలపవిత్రం అలాగ!

సన్యాసి ఏ గ్రామంలోనూ ఒక్కరాత్రి కన్నా ఎక్కువ కాలం బస చేయరాదు. వర్షాకాలం నాలుగు నెలలు దానికి మినహాయింపు. ఊరి పొలిమేర దాటకుండా, ఒకే చూరుకింద నాలుగు మాసాలు గడపడాన్నే ‘చాతుర్మాస్య వ్రతం’ అంటారు. మాసాన్ని పక్షంగా గ్రహించి కొందరు రెండే నెలలపాటు దీక్ష వహిస్తారు. శాస్త్రం దాన్ని ఆమోదించింది. ఇటీవలి కాలంలో యతులు మాత్రమే ఆచరిస్తున్న కారణంగా- చాతుర్మాస్య వ్రతాన్ని సన్యాసులు లేదా పీఠాధిపతుల కార్యక్రమంగా భావిస్తున్నాం. వాస్తవానికి అన్ని వర్గాల వారు సర్వ ఆశ్రమాల వారు చాతుర్మాస్య వ్రతం పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఆషాఢ శుక్ల ఏకాదశిని వ్రతోత్సవ చంద్రిక ‘మహా ఏకాదశి’గా అభివర్ణించింది. చాతుర్మాస్య దీక్ష రోజుల్లో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో దీన్ని తెలుగువారు ‘తొలి ఏకాదశి’గా భావిస్తారు. ఆనాటి నుంచి శ్రీమహా విష్ణువు పాలకడలిలో శేష తల్పంపై నిద్రలోకి జారుకొని, నాలుగు నెలల పిదప కార్తిక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడని పురా ణాలు చెబుతున్నాయి. అందుకే తొలిఏకాదశిని ‘హరిశయనం’ అని ‘శయనైకాదశి’ అని పేర్కొన్నారు. తొలిఏకాదశి దరిమిలా వచ్చే ఆషాఢ శుద్ధ ద్వాదశిని చాతుర్మాస్య వ్రతానికి శుభారంభ దినంగా ‘స్మృతికౌస్తుభం’ నిర్ణయించింది. ఆనాడు వీలులేని పక్షంలో గురుపూర్ణిమ రోజున చాతుర్మాస్య దీక్షను స్వీకరించే ఆచారం కూడా ఉంది.

చన్నీటి స్నానం, భూతల శయనం, మంత్రానుష్ఠానం, యోగాభ్యాసం, ఏక భుక్తం (ఒంటిపూట భోజనం), జాగరణం, ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, హరినామ స్మరణం వంటి ప్రత్యేక విధి విధానాలతోపాటు చాతుర్మాస్య దీక్షలో పాటించవలసిన వివిధ ఆహార నియమాల గురించి పద్మపురాణం విశేషంగా చర్చించింది. ఆషాఢంలోని శయనైకాదశి మొదలు కార్తికంలోని ఉత్థాన ఏకాదశి వరకు గల నాలుగు నెలలను ఎంతో పుణ్యదినాలుగా పురాణాలు పేర్కొన్నాయి.

తార్కికంగా ఆలోచిస్తే- ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో మనకు పండుగలు పబ్బాలు విందులు వినోదాలు జాస్తి. అనారోగ్య సమస్యలూ ఎక్కువే. ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ కట్టుబాట్లు, దీక్షా విధులు. ఈ ప్రపంచంలోని విషయాలన్నింటినీ గ్రహించి లోపలికి చేర్చేవి- జ్ఞానేంద్రియాలు. మనలో ఉండే శక్తి సామర్థ్యాలను వెలికి తీసి బయటకు ప్రదర్శించేవి- కర్మేంద్రియాలు. వాటిని సక్రమ మార్గంలో నియంత్రించే దీక్షల్లో ప్రధానమైనది- చాతుర్మాస్య వ్రత దీక్ష. చాతుర్మాస్య దీక్ష- లోపల బయట మనిషికి శ్రీరామరక్ష!

- ఎర్రాప్రగడ రామకృష్ణ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న