ఈదుల్‌ అజ్‌హా

అంతర్యామి

ఈదుల్‌ అజ్‌హా

శాశ్వతమైనది జీవితమని గుర్తించినా మోహావేశాలకు ఆకర్షితులయ్యేవారు సామాన్యులు. వీరు సర్వదా కోరుకునేవి- శారీరక సుఖసౌఖ్యాలు, జిహ్వ చాపల్యాన్ని తీర్చే ఆహారాలు, డాంబికాన్ని ప్రదర్శించేందుకు సిరిసంపదలు. ఇహలోకంలో తమ ప్రస్థానం బహుకొద్ది కాలమేనని గ్రహించి సర్వాంతర్యామి కరుణా కటాక్షాలకోసం పరితపించేవారు జ్ఞాన సంపన్నులు. తాము విశ్వసించిన అల్లాహ్‌ ఆరాధనతో స్వీయ సమర్పణ గావించుకొని పరలోక ప్రయాణానికి సంసిద్ధులు కాగలిగేవారు ధన్యజీవులు. చరాచర సృష్టికి ఆధారభూతుడు అల్లాహ్‌ రాజ్యాధికారం ఆకాశాలను, భూములను ఆవరించుకొని ఉంది. ఆయన సర్వాధికుడు, నిరాకారుడు, సర్వోత్తముడని పవిత్ర ఖురాన్‌ గ్రంథంలోని సూరె బఖర తెలుపుతుంది. ‘జీవన్మరణాలు ఎవరి అధీనంలో ఉన్నాయో ఆయనే నా ప్రభువు అల్లాహ్‌’ అని ప్రకటించిన ఇబ్రహీం(అ.స.) ప్రవక్తల పితామహుడిగా పేరుపొందారు.

హిజ్రీశకానికి 2510 సంవత్సరాల పూర్వం ఇరాక్‌ ప్రాంతంలో జన్మించిన హజ్రత్‌ ఇబ్రహీం(అ.స.)ను అల్లాహ్‌ ఎన్నో విధాలుగా పరీక్షించాడు. అన్నింటిలోనూ అమిత విశ్వాసంతో నెగ్గి ఆయన వినయ విధేయతలతో అల్లాహ్‌ను మెప్పించి గొప్ప ప్రవక్తగా పేరు పొందారు. ముదిమి వయసులో లేకలేక పుట్టిన బిడ్డ ఇస్మాయిల్‌(అ.స.)ను సమర్పించవలసిందిగా ఇబ్రహీం(అ.స.)కు స్వప్నంలో అల్లాహ్‌ ఆదేశం రాగానే ఆయన పితృవాత్సల్యాన్ని పక్కన పెట్టారు. అల్లాహ్‌ ఆజ్ఞ శిరసా వహించడమే తన జీవిత పరమా వధిగా తలచి ఇస్మాయిల్‌ (అ.స.)ను ఖుర్బానీ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇబ్రహీం(అ.స.) త్యాగనిరతికి మెచ్చి అల్లాహ్‌ అతడి బిడ్డకు బదులుగా గొర్రెను ఖుర్బానీ ఇవ్వవలసిందిగా సూచించారు. ఆ సంప్రదాయమే ఈనాటికీ ఈదుల్‌ అజ్‌హాగా బక్రీదు మాసంలో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది.

హజ్రత్‌ ఇబ్రహీం(అ.స.) ప్రజానాయకుడిగా అత్యుత్తమ ఆధ్యాత్మికవేత్తగా నాటి అరబ్‌దేశాలను ప్రభావితం చేశారు. ఇస్మాయిల్‌ (అ.స.), ఇస్‌ హాక్‌(అ.స.), యాకూబ్‌ (అ.స.), మూసా(అ.స.), ఈసా(అ.స.) ప్రవక్తలందరూ వారివారి కాలాల్లో ఇబ్రహీం(అ.స.) ఆచరించిన అల్లాహ్‌ ఏకోపాసనా మార్గాన్ని అనుసరించారు. ఆదం(అ.స.) ప్రవక్త నిర్మించిన అల్లాహ్‌ ఆరాధనాలయం కాలగర్భంలో కలిసింది.

మక్కా పర్వతాల మధ్య ఉన్న ఆ కాబా గృహాన్ని పునర్నిర్మించవలసిందిగా ఇబ్రహీం(అ.స.)కు అల్లాహ్‌ ఆదేశమొచ్చింది. కొడుకు ఇస్మాయిల్‌(అ.స.)తో కలిసి ఏకైక ఆరాధనా గృహాన్ని ఇబ్రహీం(అ.స.) నిర్మించారు. మానవులందరికీ అది శాంతినిలయంగా భాసిల్లుతోంది.

స్తోమత కలిగిన ప్రతి ముస్లిం, జీవితంలో ఒక్కసారైనా కాబా గృహాన్ని దర్శించాలన్నది ఇస్లాం మూలసూత్రాలలో ఒకటి. పన్నెండో నెల జుల్‌హిజ్జా బక్రీదునెలలో హజ్‌తీర్థ యాత్ర చేస్తారు. కాబా గృహం చుట్టూ మూడులక్షల యాభైఆరువేల ఎనిమిదివందల చదరపుమీటర్ల వైశాల్యంలో నిర్మించిన మస్జిద్‌-అల్‌-హరమ్‌లో నమాజు చేస్తారు. ఈ పవిత్ర యాత్రచేసే వారు దుష్కార్యాలకు ఘర్షణలకు దూరంగా ఉండాలి. కాబాగృహదర్శనంతో బక్రీదు పర్వదినం రోజున సకల శుభాలు చేకూరుతాయని, అల్లాహ్‌ రక్షణ పొందిన దివ్యానుభూతితో వారు పునీతులవుతారు.

- షేక్‌ బషీరున్నీసా బేగం


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న