వివేకజ్ఞానం

అంతర్యామి

వివేకజ్ఞానం

మనిషి ధనవంతుడే కావచ్చు, విద్యావంతుడే కావచ్చు, సర్వాంగ సుందరుడే కావచ్చు కాని బుద్ధిమంతుడు కాకపోతే ఆ ధనం, విద్య, సౌందర్యం ఎందుకూ కొరగావు.

బుద్ధిమంతుడు అంటే ఏకసంథాగ్రాహి, మహామేధావి అని కాదు- సద్బుద్ధి కలవాడని అర్థం. సద్బుద్ధి అంటే వివేకంతో కూడిన బుద్ధిశక్తి. మంచీచెడుల మధ్య తేడా తెలియడమే వివేకం. మనిషికి బుద్ధిశక్తి ఉన్నా వివేకం లేకపోతే అది వక్రమార్గం పడుతుంది. మనిషికి గొప్ప తెలివితేటలు లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు కాని దుర్బుద్ధి ఉంటే చాలా ప్రమాదకరం. మనిషి ఎదిగినా, దిగజారినా, పేరు ప్రఖ్యాతులు గడించినా, అపఖ్యాతి మూటకట్టుకున్నా- అదంతా బుద్ధి మహిమే. ఇహపరాలు రెండూ బుద్ధి చేతుల్లోనే ఉంటాయి. సద్బుద్ధి ఉంటే మంచి స్నేహితులు, శీల సంపద, గౌరవ మర్యాదలు, సత్సంబంధాలు, మనోనిర్మలత, ఆత్మవివేచన కలిగి ఉంటారు. దుర్బుద్ధి ఉంటే కపటత్వం, అసూయాద్వేషం, అసహనాలు ఆవరిస్తాయి. మనిషి దేహాంగాలన్నీ దివ్యంగా పనిచేస్తున్నా, బుద్ధి ఒక్కటి వక్రంగా పనిచేస్తే చాలు- జీవితం పతనమవుతుంది.

ఈశ్వరుణ్ని తపస్సుతో మెప్పించి వరాలు పొందిన రావణ విభీషణ కుంభకర్ణులలో, రావణకుంభకర్ణులను ఆ వరాలు రక్షించలేదు. కాని సద్బుద్ధినే వరంగా వేడిన విభీషణుడు మాత్రం చిరంజీవి అయ్యాడు. పూర్వకాలం గురుకుల విద్యలో సద్బుద్ధిని పుట్టించే అంశాలను విశేషంగా బోధించేవారు. గురువులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యాబుద్ధులు రెండూ నేర్పేవారు. నిజానికి విద్య అంటేనే బుద్ధిని మేల్కొల్పేదని అర్థం. దురాలోచనలకు, వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా విద్యార్థులను ఉంచేందుకు నాటి గురువులు తీవ్రంగా శ్రమించేవారు. చిటికెడు ఉప్పు కలిస్తే బిందెడు పాలూ విరిగిపోతాయి. ఒక చెడు స్నేహం చాలు మనిషి పాడయ్యేందుకు. అర్జునుడిపై అసూయతో రగిలే కర్ణుడి స్నేహమే దుర్యోధనుడి పతనానికి కారణమంటారు పెద్దలు. ఒక వస్తువు నాణ్యత దాన్ని ఉత్పత్తిచేసే యంత్రసామర్థ్యంపైనా, దానిలో వినియోగించే ముడిసరకు నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి నాణ్యత (వ్యక్తిత్వం) అతడి అంతరంగంలోని మనోబుద్ధులపై ఆధారపడి ఉంటుంది. మనసు వ్యామోహాలకు, త్రిగుణాలకు, వాంఛలకు, అసూయాద్వేషాలకు, ప్రేమపగలకు, ఇష్టాయిష్టాలకు, సుఖదుఃఖాలకు, భావోద్రేకాలకు స్వస్థానం. బుద్ధి వివేకానికి, విచక్షణకు, తాత్విక తార్కిక ఆలోచనలకు, నిశ్చయాత్మక శక్తికి, క్రియాజ్ఞానశక్తులకు, సంకల్పబలానికి, శ్రద్ధకు మూలస్థానం. మనసు బుద్ధి వేరు వేరు అంశాలయినా లోతుగా అవి అనుసంధానమై ఉండటం వలన ఒకటిగానే మనిషికి స్ఫురిస్తాయి. మనసుకు వశుడై బతికితే ఒకలా, బుద్ధిని ఆశ్రయిస్తే మరోలా మనిషి జీవితం ఉంటుంది.

బుద్ధి మనసుకన్నా శక్తిమంతమైనదైనా, సర్వసాధారణంగా అది మనసు చెప్పినట్లే వింటుంది. మనిషి బుద్ధి శక్తి అనంతమైనది. దాని శక్తియుక్తులకు అవధులు లేవు. సాధనతో బుద్ధిని సూక్ష్మతరం చేయాలని వేదం పదేపదే చెబుతుంది. ధ్యాన, యోగ, పూజ, అనుష్ఠాన అభ్యాసాలన్నీ దీనికోసమే. బుద్ధి సూక్ష్మస్థితిని పొందుతున్నకొద్దీ మనసు తనంతట తానుగా నియంత్రణకు వస్తుంది. సద్బుద్ధి కలుగుతుంది. దాన్ని సారథిగా చేసుకుంటే జీవితం సాఫీగా క్షేమంగా శ్రేయోమార్గంలో సాగుతుంది. మనసు లోకోపకారానికి ఉర్రూతలూగుతుంది. పరోపకారమే జీవిత ధ్యేయమవుతుంది.

- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న