వెంటాడే భయం

అంతర్యామి

వెంటాడే భయం

మానవజీవితం సుఖదుఃఖాలకు ఆలవాలం. సుఖం కలిగినప్పుడు ఆనందించడం, దుఃఖం కలిగినప్పుడు చింతించడం సహజం. మనిషికి సుఖాలు ఎంత ధైర్యాన్ని కలిగిస్తాయో, దుఃఖాలు అంతటి నిరాశను మిగిలిస్తాయి. మానవుడికి దుఃఖాలు దైవికంగాను, భౌతికంగాను, మానసికంగాను, స్వయంకృతంగానూ కలుగుతాయి.

సుఖాలలో ఇష్టదైవాలు, ఆత్మీయులు గుర్తుకు రాకపోవడం మానవనైజం. దుఃఖాలు కలిగినప్పుడు మాత్రం మనిషి ఇష్టదైవాలను ప్రార్థిస్తాడు. ఆత్మీయుల అండదండలను కోరతాడు. మానవుడి ఈ ప్రవృత్తిని అనాదిగా కవులు గ్రహించి, తాము రచించే స్తోత్రాల్లో మానవుల దుఃఖార్తిని ప్రతిబింబించే విధంగా ఎన్నో వర్ణనలు చేశారు.

ఈ భూమిపై మానవుడు బతికినంతకాలం మాయా సంసార బంధాల్లో చిక్కుకొని, సకల పాపాలూ చేయడానికి వెనకాడడని, చివరకు మృత్యువు సమీపించే సమయంలో జ్ఞానోదయం కలిగి, చేసిన తప్పులకు చెంపలు వాయించుకుంటాడని నరసింహ శతకకర్త అంటాడు. పుణ్యకాలమంతా చెడుపనులు చేసి, చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు అంత్యకాలంలో మేల్కొంటే లాభం ఏమిటని ప్రశ్నిస్తాడు. అలాంటి దీనస్థితి నుంచి రక్షించమని వేడుకుంటాడు.

కొడుకులు పుట్టలేదని చాలామంది బాధపడుతుంటారు కానీ- కొడుకులు పుట్టినా, వాళ్లు కౌరవులవంటి వాళ్లయితే లాభం ఏమిటని అంటాడు ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వర శతకంలో! వందమంది పుత్రులున్నా ధృతరాష్ట్రుడు ఏ ఒక్కనాడూ శాంతిమయ జీవనాన్ని గడపలేదని, వాళ్లవల్ల వేదననే అనుభవించాడని అంటాడు. శుకమహర్షి సంతతి లేకున్నా ప్రశాంతంగా బతకలేదా అని ప్రశ్నిస్తాడు.

భాగవతంలో గజేంద్రుడికి మొసలి కారణంగా ప్రాణాపాయస్థితి కలిగింది. ఆ సమయంలో గజేంద్రుడికి తన ఆర్తి చెప్పుకోవడానికి భగవంతుడు గుర్తుకు వచ్చాడు. తానెంత గజరాజైనా ఆపద వచ్చినవేళ ధైర్యాన్ని కోల్పోయి ‘లావొక్కింతయు లేదు’ అంటూ నీవే శరణ్యమని దీనంగా మొర పెట్టుకోవడం చూస్తే- ప్రాణులందరికీ ఆర్తి సమానమే అనిపిస్తుంది.

కౌరవ సభలో వస్త్రాపహరణ ఘట్టంలో మాన సంరక్షణకోసం ద్రౌపది ఆర్తితో కృష్ణుణ్ని శరణువేడిన తీరు మనిషి నైజాన్ని ప్రతిబింబిస్తుంది.

మోహం, కామం, ఆశ, మనోవ్యాకులతల మధ్య సంసారాన్ని సాగదీయడం ఎంతో కష్టమని వీటన్నింటినీ దూరంచేసి తనకు మనశ్శాంతిని కలిగించమని శివానందలహరిలో భక్తుడి ఆర్తిని ప్రతిబింబించాడు ఆదిశంకరాచార్యుడు.

దాహం వేసినప్పుడు చల్లటి నీళ్లు తాగడం, ఆకలైనప్పుడు అన్నం తినడం, కోరికలు రేగినప్పుడు సుఖాలు అనుభవించడం అనేవి రోగాలే కాని, భోగాలు ఎలా అవుతాయని భర్తృహరి వైరాగ్య శతకంలో ప్రశ్నిస్తాడు. లోకంలో అడుగడుగునా కష్టాలే తారసపడతాయని, వాటినుంచి నిరంతరం రక్షించమని దీనుడు ఆర్తితో భగవంతుణ్ని అర్థిస్తాడు. మనిషికి బలం ఉంటే మరొక బలవంతుడు శత్రువుగా మారతాడు. సద్గుణాలు ఉంటే దుర్గుణాలు గలవాళ్లు విరోధులవుతారు. మంచి అందం ఉంటే దాన్నీ సహించలేని క్రూరులుంటారు. సంపదలు అధికంగా ఉంటే కొందరు వాటిని దోచుకునేందుకు ప్రయత్నిస్తారు. మనిషి ఆయుర్దాయం ముగుస్తున్నదంటే ప్రాణాలను తీసుకొని పోవడానికి యమదూతలు వస్తారు. ఎంతటి జ్ఞానాన్ని సంపాదించినా జ్ఞానంలో పోటీపడేవాళ్లుంటారు. ఇలా మనిషికి జీవితంలో ఏదో రూపంగా భయం వెంటాడుతూనే ఉంటుందంటాడు ఆ మహాకవి.

ఆర్తి లేని మనిషి ప్రపంచంలో ఏ ఒక్కడూ ఉండడు. ఆర్తిలో తేడాలు ఉండవచ్చుకానీ, దీనత్వం అంతటా వ్యాపించి ఉంటుందని, అది మనిషిని పునరాలోచనకు పురిగొల్పుతూ, ఆత్మ వివేచనకు దారితీస్తుందని అంటారు తత్త్వవేత్తలు! 

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న