ఆలయ కవులు

అంతర్యామి

ఆలయ కవులు

వైదిక మంత్రాల్లో ‘కవి’ శబ్దం పరమాత్మ అర్థంలో కనిపిస్తుంది. క్రమంగా అది రుషిపరంగా వాడుకలోకి వచ్చింది. అపారమైన కావ్య జగత్తులో కవికి బ్రహ్మకు అభేదం చెప్పాడు ఆనందవర్ధనుడు. త్రికాల వేదిత్వం రుషులకు సహజమైతే, కవి- భూత వర్తమాన భవిష్యత్తుల్ని దర్శించగల ప్రజ్ఞా చక్షువు.

‘కవి’ శబ్ద తాత్వికత ఇలా ఉండగా కాలప్రభావాన్ని అనుసరించి మన కవులు రాజాస్థానాల్ని ఆశ్రయించారు. రాజే వాళ్లకు దేవుడు. రాజ కీర్తనమే వాళ్ల నిత్యకృత్యం. రాజులు ఇచ్చే మడిమాన్యాలతో, విలువైన కానుకలతో భోగలాలసులై బతికిన కవుల గురించి విన్నాం. రాజాశ్రయం లేనిదే కవిత్వం వెలుగు చూసేది కాదు. వీరికి భిన్నంగా కేవల భక్తకవులున్నారు. రాజాస్థానాలను తోసిరాజని ‘ఆలయ ఆస్థాన కవు’లయ్యారు. వీరి సంఖ్య స్వల్పమే కావచ్చు. వీరి ఆదర్శం మాత్రం అసామాన్యం.

‘సింహగిరి వచనములు’ కర్త కృష్ణమాచార్యులు తెలుగులో అటువంటి తొలి ఆలయ కవి. సింహాచల దేవాలయాన్ని ఆశ్రయించి ఉండేవారు. తెలుగులో వచన రచనకు, భజన సంకీర్తన పద్ధతులకు పరమాచార్యుడు కృష్ణమాచార్యుడే. చతుర్లక్ష వచన సంకీర్తనలతో నరహరిని ఆరాధించాడు. 14వ శతాబ్దికి చెందిన ఈ కవి వాక్పూజలకు పరవశించి నరహరి బాలుడిలా వచ్చి తొడపై కూర్చునేవాడట. కృష్ణమయ్య పాడుతుంటే నాట్యం చేసేవాడట.

పదకవితా పితామహుడు అన్నమయ్య తిరుపతి వేంకటేశ్వరుడి ఆలయాన్నే ఇల్లుగా చేసుకున్నాడు. భార్యాబిడ్డలతో తిరుపతిలో ఉండి ఆ వేంకటేశ్వరుని సేవించాడు. సాళువ నరసింహరాయలు తనమీద కీర్తన పాడమని అడిగితే ‘నరహరి కీర్తన నానిన జిహ్వ నొరుల నుతింప’దని పలికాడు. రాజాగ్రహానికి గురైనప్పుడు ‘ఆకటి వేళల నలపైన వేళలను హరినామమే మరి దిక్కు’ అని పాడుకున్నాడు. ‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడి’ గరిమను లోకానికి చాటాడు. అన్నమయ్యది సంకీర్తనా యజ్ఞం. ఆ కీర్తనల్లో మధురభక్తి సంప్రదాయం విశేషంగా గోచరిస్తుంది. నేటికీ ఆ కీర్తనల్ని భక్తులు గాయకులు తన్మయత్వంతో పాడుకుంటున్నారు. తెలుగు పలుకుల నిసర్గ సౌరభాన్ని గుబాళింపజేశాడు అన్నమయ్య.

కవిగా ధూర్జటి మొదట ఆస్థానకవే. కృష్ణరాయల చేత ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేలగల్గెనీ యతులిత మాధురీ మహిమ’ అని ప్రశంసలు పొందినవాడు. రాయల మరణం తరవాత ఆనాటి పాలకుల అహంకారం, పండితుల భేషజాలు ధూర్జటికే రోత పుట్టించాయి. ఐహిక భోగాలు బుద్బుద ప్రాయమని భావించి శ్రీకాళహస్తి చేరుకున్నాడు. ఆస్థానకవి ఆలయకవి అయ్యాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం రాశాడు. కవితా కళను దివ్యార్చన కళగా చేసుకున్నాడు. నిశ్చల భక్తుడైన ధూర్జటి తన కృతుల్ని హరాంకితం చేశాడు తప్ప నరాంకితం చేయలేదు. ధూర్జటి భక్తి ఐహిక వైరాగ్యంగా పరిణమించింది.
కంచర్ల గోపన్న భద్రాచలం వెళ్ళి ‘రామదాసు’ అయ్యాడు. ‘అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి’ అని ఆలపించాడు. భగవత్సాన్నిధ్యంలో కాలం గడిపాడు. జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరించాడు. కొత్త నిర్మాణాలు చేశాడు. పాలకుల ఆగ్రహానికి గురయ్యాడు. కారాగారవాసమూ చేశాడు. ‘ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’ అని వేడుకున్నాడు. ‘పలుకే బంగారమాయెనా’ అంటూ రామభద్రుణ్ని తెలుగువారి కొంగుబంగారం చేశాడు.

ఒక ఆలయంతో అనుబంధం లేకపోయినా తన గుండెనే రాముడి గుడిగా చేసుకున్నాడు పోతన. భోగపరాయణులైన రాజులకు కృతులను అంకితం చేసి సంపదలు గ్రహించడం నరకయాతనగా భావించాడు. ఆ శ్రీరాముడే తనచేత భాగవతం పలికిస్తున్నాడని చెప్పుకొన్నాడు.
వాగ్గేయరాజు త్యాగరాజుదీ పోతన మార్గమే. మానవాశ్రయం, మానవ స్తుతి గిట్టనివాడు. పేదరికంలో కూడా ‘తెలిసి రామచింతనతో’ జీవనం సాగించిన నాదబ్రహ్మ త్యాగయ్య. వీరంతా పరమాత్ముడి కొలువులో ధన్యులు. ఇంకా ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు!

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న