వ్యాస భాగవతం

అంతర్యామి

వ్యాస భాగవతం

జ్ఞానమే ముక్తికి మార్గం. ముక్తి లేదా మోక్షం అనేది నాలుగో పురుషార్థం. ప్రతి మానవుడూ తన జీవితంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాల ఫలితాలను తప్పక పొందాలన్నది రుషులు చెప్పిన మాట. మొదటి మూడూ స్వశక్తి, పూర్వజన్మ సుకృతి లాంటి మార్గాల్లో లభిస్తాయి. నాలుగో పురుషార్థమైన ‘మోక్షం’ మాత్రం అంత సులభంగా కలగదు. సులభంగా మోక్షం కలగడానికి జనులకు మంచి మార్గం చూపాలని తలచాడు నారదుడు. ఆ పనికి వ్యాస మహర్షిని ఎంచుకున్నాడు.
ఆయన ద్వారా శ్రీమద్భాగవత రచన చేయించాలని నిశ్చయించుకున్నాడు. నారదుడి ఆలోచనకు పరిస్థితులూ అనుకూలించాయి.      
మొదట నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకు భాగవతాన్ని ఉపదేశించాడు. దాన్ని ఆయన నారదుడికి ఉపదేశించగా- దాన్ని కేవలం నాలుగు శ్లోకాల్లోకి కుదించి వ్యాసుడికి ఉపదేశించాడు. వాటి ఆధారంగా కలియుగ జనులకు సూక్ష్మంలో మోక్షం కలిగించే విధంగా భాగవత రచన సాగించమన్నాడు.      
ముక్తిని పొందడానికి జ్ఞానమే సరైన మార్గం. అది కలగడానికి చాలా సమయం పడుతుంది. అంత సమయం, ఓపిక కలియుగ జనులకు ఉండవు. ఆ కారణంగా సమాజం ధర్మ వ్యతిరిక్తం కాకుండా, జనుల మనసుల్లో నైతిక విలువలు పెంపొందించే విధంగా భాగవతాన్ని మహా పురాణంగా మలచాడు వ్యాసుడు.
‘హృదయంలో ఆత్మ స్వరూపుడైన భగవంతుడి సాక్షాత్కారం కలగ డంతోనే అజ్ఞాన హృదయ గ్రంథులు తెగిపోతాయి. సంశయా లన్నీ తొలగిపోతాయి. కర్మ బంధనాలు క్షీణిస్తాయి. ఫలితంగా ముక్తుల వుతారు’ అని వేదాంతులకు అర్థమయ్యే విధంగా చెప్పాడు.
అందరిలో ఆత్మ స్వరూపుడై ఉన్న భగవంతుడు ఒక్కడే అయినా, ప్రాణుల   భేదం వల్ల అనేకుడు అన్నట్టు అనిపిస్తుందని జ్ఞానులకు తెలియజేశాడు.  
‘గర్వం, హింస, అబద్ధమాడటం, కపటం, వైరం, వ్యసనం లాంటి అనేక దుర్గుణాలు ధనం వల్ల కలుగుతాయి. కాబట్టి తమ శ్రేయస్సును కోరుకునే వారు పై అనర్థాలకు కారణమైన ధనానికి దూరంగా ఉండాలి’ అని జిజ్ఞాసువులకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు.  
‘అహింస, సత్యం తప్పకూడదు. అనవసర విషయాల జోలికి వెళ్ళకూడదు. ప్రతి ప్రాణి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అతిగా కూడబెట్టడం తగదు. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడనే ఆస్తిక బుద్ధి కలిగి ఉండాలి. భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తేనే ముక్తి లభిస్తుంది. పై లక్షణాలు కలిగి ఉన్నవాడు మోక్షానికి అప్రయత్నంగానే దగ్గరవుతాడు’ అని అతి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వ్యాసుడు తెలియజెప్పాడు.
మానవుణ్ని దివ్యుడిగా మార్చేందుకు గాను అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుని భాగవతాన్ని శక్తిమంతమైన సాధనంగా మలచాడు. అందుకోసం శ్రీకృష్ణ చరితానికి ప్రాధాన్యమిచ్చాడు. కథల రూపంలో మరెన్నో సవివరంగా చెప్పాడు.      
‘సర్వ వేదాంత సారం ఈ భాగవతం. దీని రుచిని ఆస్వాదించి తృప్తి పొందిన వారికి మరే ఇతర రుచీ నచ్చదు’ అని భాగవత పఠన ఫలితాన్ని ఒక్కమాటలో చాటాడు. 

- అయ్యగారి శ్రీనివాస రావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న