అతడు... అనంతం!

అంతర్యామి

అతడు... అనంతం!

జ్ఞానం ఎప్పుడూ విశాలత్వాన్ని ప్రతిపాదిస్తుంది. అవధులు లేని అంతర్దృష్టే జ్ఞానం. జ్ఞానమే అంతర్‌ దృశ్యం. సంకుచితత్వాన్ని తోసిరాజనే సమ్యక్‌ దృష్టి దూరాలను చేరువ చేస్తుంది. పేదవారిని తనవారిని చేస్తుంది. అణువును అనంతం చేస్తుంది. అంతా తానే అయినప్పుడు, అన్నీ తనవే అయినప్పుడు ఏకతా దృష్టి, ఆత్మభావం అనుభవంలోకి వస్తాయి. అనుభూతి పాత్రం అవుతాయి. అప్పుడు దేనికైనా పరిధి అవరోధాలుండవు.

తాను బిడ్డగా జన్మించాక అమ్మ ఒక మనిషి, తానొక మనిషి. కానీ గర్భంలో ఉండగా ఒకరే... ఒకడే... బలవంతంగా పేగు తెంచుకొన్నాకే రెండు ముక్కలు, ఇద్దరు మనుషులు. ఈ అంతర్‌ దృష్టితో పరిశీలించినప్పుడు ప్రతివారూ ఒకరు కాదు. ఒక్కరే కాదు. మరొకరితో, ఆ మరొకరు ఇంకో మరొకరితో, ఆ ఇంకో మరొకరు... విచిత్రమైన అత్యద్భుతమైన ఈ విడదీయలేని అంతర్‌బంధం అనుసంధానం వారధిలేని తీరంలేని సముద్రంలా సువిశాలం అవుతుంది. పరిధి రహితం అవుతుంది. అంతా తానై, ఒకటే అయి ఏ బిందువుకా బిందువుగా అనిపిస్తున్నా, కనిపిస్తున్నా... మళ్ళీ అదంతా సముద్రమే. ఒక సముద్రమే. ఒకే సముద్రమే. మనిషీ అంతే. ఒక బిందువు. సింధువులోని బిందువు. సింధువులో భాగమైన బిందువు.

సూక్ష్మమైన బిందువు సింధువులో కలిసిపోగలిగినప్పుడే అవధులు లేని సింధువై, సింధువే   అయి మహా సముద్రమై భాసిస్తుంది. తనకు తానే గంభీర సముద్రంగా మనగలిగినప్పుడు, మనగలిగే అవకాశం ఉన్నప్పుడు ఒక ఏకాకి బిందువుగా విడిపోయి విడగొట్టుకుని పక్కకు చిందిపోవలసిన అగత్యమేముంది?

మన దృష్టి సరళి ఎంత సరళం అవుతుందో, సమన్వయ భావంతో ఎంత విశాలం అవుతుందో- మన దృక్పథం, దృక్కోణం కూడా అంతే విశాలం అవుతాయి. దృష్టి అంటే కేవలం చూపు ఒకటే కాదు- వైఖరి, అవగాహన. ఈ వైఖరి మనసుకు సంబంధించినది. బాహ్యమైన, భౌతికమైన కన్ను విప్పితే ఆకాశమంత పరిధిగా, అంతర్నేత్రంతో చూస్తే మన చూపు పరిధి అనంతం కాదా? అందుకే మహాత్ములు బాహ్య నేత్రాన్ని ముకుళించుకుని అంతర్నేత్రాన్ని వికసించనిస్తారు. వాల్మీకి మహర్షి అంతర్నేత్రంతోనే రామాయణాన్ని తాను దర్శించడమే కాక లోకం ముందు పుస్తకంలా తెరిచిపెట్టాడు. విశ్వకావ్యంగా పంచిపెట్టాడు. వీరబ్రహ్మేంద్రస్వామి రవ్వల కొండమీద  ధ్యానముద్రతో జ్ఞాననేత్రాన్ని విప్పార్చాడు. కాబట్టే కాలజ్ఞానాన్ని ప్రపంచానికి అందించగలిగాడు.

మనిషి తన ఉనికిని నిలుపుకొంటూనే, వ్యక్తిగత మనుగడను సాగిస్తూనే ‘మానవాళి’ అనే మహామేళాలో కలగలిసిపోవచ్చు. కలిసి మెలిసి ఆనందించవచ్చు. అంతమాత్రమే కాదు. విశ్వ దృష్టితో విశ్వమానవుడిగా, విశ్వ భాగస్వామిగా ఈ విశ్వ కుటుంబంలో తన భాగస్వామ్యాన్ని బాధ్యతను కర్తవ్య దృష్టితో, నిష్ఠగా నిభాయించవచ్చు. విశ్వంతో అనుసంధానమైన ఒక అణువుగా పంచభూతాత్మకమైన మనిషి పంచభూత సమన్వితమైన ప్రపంచంతో సమన్వయపరచుకొని పూర్ణభావంతో పూర్ణంలో తాను పూర్ణమై, అనంత భావంతో అనంతమే అయి భాసించవచ్చు.

- చక్కిలం విజయలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న