దేహభ్రాంతి

అంతర్యామి

దేహభ్రాంతి

లోకంలో అన్ని వస్తువులూ నశించేవే! కనిపించేదంతా నశిస్తుంది అన్నది వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో వ్యక్తమయ్యే ఓ మహత్తర సత్యం.

మనిషి తప్ప అన్ని ప్రాణులూ పోలికకు ఒక్కలాగే కనిపిస్తాయి. వాటి ఆకృతుల్లో తేడాలు సామాన్య దృష్టికి స్పష్టంగా గోచరించేవి కావు. ప్రతి మనిషి ముఖం భిన్న రీతిలో ఉంటుంది. అతడి అదనపు ప్రత్యేకతలు- మనసు, వ్యక్తిత్వం. వేలిముద్రలు, కంటిపాపలలోని విశేషత్వం, భిన్నత్వం సరేసరి! సృష్టి వైవిధ్యంలో భాగంగా మనిషి అంతఃకరణ సైతం సాత్విక, రాజస, తామస లక్షణాలు సంతరించుకొని ఉండటం విశేషం! కొందరిని చూడగానే మంచి అభిప్రాయం కలుగుతుంది. వారికి గౌరవాదరాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకు వారి శరీర ఆకృతి, లేదా వేషధారణ లేక వారి మాటతీరు దోహదపడవచ్చు.

లోకంలో చాలా అరుదుగా శారీరక, మానసిక సౌందర్యాలు మిళితమై కనిపిస్తాయి. మన పురాణేతిహాసాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటివారు ఉదాత్తమైన పాత్రలుగా కనిపిస్తారు.

లోకరీతిలో ప్రజలు వారి శరీర ఆకృతి వల్ల తగిన గౌరవం పొందుతారు. పరిచయాలు పెరిగి మనస్తత్వాలు వెల్లడయ్యాక నిజంగా వారు ఏమిటో లోకానికి తెలుస్తుంది. కొందరికి అందం లేకపోయినా లోక ప్రసిద్ధమైన కార్యాచరణ వల్ల వారు చరిత్ర ప్రసిద్ధులవుతారు. జాతిపిత మహాత్ముడిది సాధారణ రూపమే అయినా ఆయన లోక జనప్రియులై ఆరాధ్యులయ్యారు.

రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి మహనీయులు తమ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లి త్రిలోక పూజ్యులుగా వెలుగొందారు.

స్వామి వివేకానంద, యువతను ప్రభావితం చేయగలిగిన మహనీయుడు. ఆయన 30 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఆయన ఔన్నత్యం ఆ చిన్న వయసులోనే దశదిశలకూ వ్యాపించింది. రమణ మహర్షి శారీరక రూపం బహు సాధారణం. ఆయనకు కేవలం రూపం వల్ల పూజనీయత రాలేదు. ఆత్మశక్తి వల్ల సాధక హృదయాల్లో ఆరాధ్య స్థానం సంపాదించుకున్నారు. దేహ సౌందర్యం, దైహిక సుఖాలూ ఒక భ్రాంతి మాత్రమే. అవి ఏదో ఒకనాటికి నశించేవే అన్న నిజం తెలుసుకున్న సాధకుడు ఒడుదొడుకులకు లోనుకాకుండా హాయిగా జీవించగలుగుతాడు. ఆ పరమ సత్యాన్ని తెలుసుకున్న వారు గనుకనే మహర్షులు, వేదాంతులు ఏనాడూ దేహభ్రాంతి పొందలేదు. పరమాత్మతో మనసును అనుసంధానం చేసి ఎల్లప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఓలలాడారు. సామాన్య ప్రజలకు ఉన్నట్లుగా ఆ మహనీయులకు దేహభ్రాంతి లేదు. శరీర ఆకృతికి, అందానికి వారి వద్ద స్థానం లేదు. ఆ భ్రాంతి వీడినవారు కాబట్టే వారు ఆత్మను ప్రత్యగాత్మతో అనుసంధానం చేసి సాధనలో పరిపక్వత పొందగలిగారు.

ఒక మనిషి శక్తి సామర్థ్యాలను శరీర ఆకృతిని బట్టి అంచనావేయడంకన్నా తప్పు మరొకటి ఉండదు. మనిషిని మనిషిగా చూడటం మానవత్వం అనిపించుకుంటుంది. అటువంటి నేర్పు ఒక్క రోజులో సిద్ధించేది కాదు. కాలం తనపని తాను చేసుకుపోయే పరిణామ క్రమంలో మనిషి ఆ దివ్యశక్తిని సంతరించుకుంటాడు. జీవితంలో అనుభవాలు నేర్పే పాఠాలు మానవ సంబంధాలను నిర్ధారించడంలో తోడ్పడతాయి. దేహం ఆత్మ అస్తిత్వానికి తోడ్పడే దివ్య సాధనమని మనిషి గుర్తించిననాడు అతడి సాధన విజయవంతమవుతుంది.

- గోపాలుని రఘుపతిరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న