స్నేహబంధం

అంతర్యామి

స్నేహబంధం

మాజంలో మనుషుల మధ్య ఉన్న స్నేహబంధం అన్ని విధాల అనుబంధాలకన్న పరమోత్కృష్టమైంది. ఒకరిని కళ్లతో చూసినంత మాత్రాన, లేదా కర స్పర్శ మాత్రాన, లేక గొంతు వినబడినంతనే, ముచ్చటించడంతోనే హృదయం పులకరించి, శరీరం రోమాంచితమైపోతే- అదే అసలైన స్నేహం.

నిజమైన స్నేహవృక్షం త్యాగాన్ని పూస్తుంది, సేవను ఫలిస్తుంది, ఆదర్శ బీజాన్ని ప్రసాదిస్తుంది. త్రికరణశుద్ధిగా పరస్పరం అర్థం చేసుకుని, కష్టనష్టాలను పంచుకుంటూ ఓదార్చుకుంటూ సహకరించుకుంటూ విజయసోపానాలను అధిరోహించడమే వాస్తవమైన స్నేహం. స్నేహితులు ఒకరి శ్రేయాన్ని మరొకరు నిరంతరం కాంక్షిస్తారు. ఒకరి మేలుకోసం మరొకరు పరితపిస్తారు. ఆనందంగా శ్రమిస్తారు. కోరకుండానే తమంత తాముగా ఏ త్యాగానికైనా సిద్ధపడతారు.

శుచిత్వం, నైర్మల్యం, త్యాగశీలత, క్షమ, నిస్సంకోచంగా నిర్భయంగా సాయపడేందుకు కావాల్సిన శక్తి, ఉత్సాహం, శౌర్యం, ఆత్మవిశ్వాసం, దాక్షిణ్యం, ఆత్మీయత- ఈ క్షణాలు సన్మిత్రుడికి ఉంటాయని గుప్తుల కాలంనాటి నీతి గ్రంథం ‘కామందికీ నీతిసారం’లోని శ్లోకం చెబుతోంది. స్నేహమనేది పాలు, నీరు కలిసిపోవడం లాంటిది. పాలు పొంగి నీటికోసం తహతహలాడతాయి. అలాగే స్నేహితుడూ తన మిత్రుడితో కలవడానికి, మాట్లాడటానికి తపనపడతాడు. క్షీరనీరాల ఉపమానంతో భర్తృహరి తన సుభాషితంలో స్నేహమాధుర్యాన్ని మనోహరంగా విశ్లేషించాడు.

శుభసందర్భాల్లో, దుఃఖంలో, కరవుకాటకాలు వచ్చినప్పుడు, అరాచక పరిస్థితిలో, రాజానుగ్రహం కోసం నిరీక్షించినప్పుడు, మహాప్రస్థానంలో శ్మశానం చేరినప్పుడు తోడుగా నిలిచేవాడే బాంధవుడు అంటే మిత్రుడు- అని చాణక్య శతక శ్లోకం చెబుతోంది.

వ్యాధిలో, దారిద్య్రంలో, శోకంలో, సమస్యలో ఆత్మీయుడు కనిపిస్తే గొప్ప ఊరట. అతడితో కలిసి భోజనం చేస్తూంటే కలిగే ఆనందం అనుభవైకవేద్యం. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా శపథం చేసి పరస్పరం సహకరించుకున్నారు. ఫలితంగా సీతాన్వేషణ ప్రారంభమైంది. ఇరువురికీ విజయం కలిగింది. కృష్ణసుదాముల మైత్రి సంస్మరణీయమైంది. సుదీర్ఘకాలం తరవాత తనను చూడవచ్చిన సుదాముణ్ని వాసుదేవుడు ఆప్యాయతతో స్వాగతించి, ఆతిథ్యమిచ్చి, అవ్యాజ ప్రేమతో పలకరించి, అతడు అడగడానికి మొహమాటపడినప్పటికీ అపార సంపదలిచ్చి అనుగ్రహించాడు.

మంచైనా చెడు అయినా స్నేహధర్మాన్ని నిర్వర్తించాలన్న ఆశయంతో చివరిదాకా సుయోధనుడికి తోడుగా ఉండి ప్రాణత్యాగం చేశాడు కర్ణుడు. దుష్టస్నేహం ఎంతటి దుష్ఫలితాన్నిస్తుందో కర్ణదుర్యోధనుల మైత్రి చెబుతోంది. ‘మనిషికి ఆపదలు రావడం మంచిదే. ఎందుకంటే ఆ కష్టాల్లో అండగా ఉండి ఆదుకునేవాడెవడో, సన్మిత్రుడెవడో తెలిసిపోతుంది’ అంటాడు రహీమ్‌ తన దోహాలో. స్వార్థానికి, అర్థానికి ప్రభావితం కాని స్నేహమే స్నేహం. పరమాత్మతో చేసే ఆధ్యాత్మిక మైత్రి అలౌకికానంద వైచిత్రి!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న