ఉత్సాహమే వరం

అంతర్యామి

ఉత్సాహమే వరం

వెన్న వంటి మనసు, వెన్నెల వంటి చూపు, తేనెవంటి పలుకు మనిషి సంస్కారాన్ని తెలియజేస్తాయి. వీటి కోసం మనిషి ప్రత్యేక సాధన చేయనవసరం లేదు. అవి మానవ స్వభావసిద్ధాలే!

నవ్వగలిగే ప్రాణి, ప్రేమించగలిగే ప్రాణి మనిషి మాత్రమే. పుట్టుకతో వచ్చిన లక్షణాలను బంధాలు కట్టి పడేసి ఎరువు తెచ్చుకున్న అసహజ లక్షణాలైన కోపం, ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యాలను జీవితం సంతరించుకుంటుంది. మనిషి మనుగడే మారిపోతుంది.

మనసు, చూపు స్వచ్ఛంగా ఉండే పసితనంలోనే, ఉయ్యాలలోనే అయినవాళ్ళు అనుబంధాలతో ముడే స్తారు. అమ్మ, నాన్నలతోపాటు బాంధవ్యాలన్నీ చుట్టుముట్టేలా అందర్నీ నా వాళ్ళు అనిపిస్తారు. అప్పుడే తన, పర భేదం ప్రారంభమై, నాది అనే స్వార్థం బిగుస్తుంది. ‘నేను’ అనే అహంకారం మొదలవుతుంది.

ఉన్న శక్తిని మరిచిపోయి, మానవతా విలువలు దూరమై స్వార్థం పుంజుకొన్నప్పుడు ఆధ్యాత్మిక ఆవశ్యకత పెరుగుతుంది. ఎక్కడ విజ్ఞానశాస్త్రం అంతమవుతుందో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది అంటారు పెద్దలు. భౌతిక స్థితిగతులకు లోబడి మనిషి నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతాడు. జీవితం నిస్సారమనుకుంటాడు. ఆ సమయంలో వేదాంత జ్ఞానం జవసత్త్వాలనిస్తుంది.

దేవుడి ఉనికి మనకు కష్టాల్లోనే తెలుస్తుంది. ఇంద్రప్రస్థపురంలో రాజభోగాలతో గడిపారు పాండవులు. మయుడు నిర్మించిన మయసభా భవనం వారి ఐశ్యర్యానికి అద్దంపట్టింది. శ్రీకృష్ణుడు వారికి బంధువుగా, సహచరుడిగా కనిపించాడు. మాయాజూదంలో సర్వస్వాన్ని కోల్పోయి అరణ్యవాసం గడిపే కాలంలో శ్రీకృష్ణుడు దేవుడిగా, ఆదుకొనే బాంధవుడిగా కనిపించి శరణాగతులయ్యారు. కృష్ణపరమాత్మ బోధ వారికి మార్గం చూపింది. శక్తియుక్తులు పెంచుకొని, తమ సామర్థ్యాన్ని కూడగట్టుకుని విజయం సాధించేందుకు ఉపయోగపడింది.

శారీరక బలం కన్నా మానసిక శక్తినిచ్చే ఆధ్యాత్మిక బలం మిన్న అని సకల పురాణాలు తెలియజేస్తాయి. శ్రీరాముడు సీతా వియోగంతో కుమిలిపోతూ కోపానికి, తాపానికి బానిసైన తరుణంలో చిన్నవాడు లక్ష్మణుడు ధైర్యాన్నిస్తాడు. శ్రీరాముడి సహజ లక్షణాలను గుర్తుచేస్తాడు. శోకం లేని జీవితం రాముడిది. భయం, అధైర్యం, పిరికితనం దగ్గరకు చేరని ధీరత్వం కలిగినవాడు భార్యా వియోగంతో తన సహజ లక్షణాలను వదిలి బేలతనం చూపడం అసహజంగా తోచి- లక్ష్మణుడు ఉత్సాహమే విజయానికి ఊపిరి అని ఊరడిస్తాడు, కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు.

చుట్టూ రాక్షస స్త్రీలు, వారి ప్రవర్తన అసహ్యకరం. ఎప్పుడు వచ్చి బెదిరిస్తాడో తెలియని రావణుడి దుర్మార్గం. దగ్గర నా అన్నవాళ్లు లేరు. ప్రేమతో పలకరించే తోడు లేదు. భవిష్యత్తు అంధకారం. సంవత్సర కాలం దాటితే చంపి భక్షిస్తానని రావణుడి బెదిరింపు. పరిస్థితులన్నీ విషమంగా ఉన్నా సీతమ్మ అధైర్యపడలేదు. తన ఆత్మవిశ్వాసాన్ని వీడలేదు.

నిరాశ జీవితంలోని అవకాశాలను దూరం చేస్తుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం జీవితాన్ని బలితీసుకుంటాయి. దుర్యోధనుడే అందుకు ఉదాహరణ. కష్టాలను ఎదుర్కొని, శక్తియుక్తులను కూడగట్టుకుని, భగవంతుడి రక్షణలో, ఉత్సాహంతో కృషి చేయడమే విజయానికి మార్గమనేందుకు పాండవులే ఉదాహరణ.

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనిషి తన సహజ ప్రవృత్తి అయిన చిరునవ్వు, మంచి మాట, ప్రేమ భరిత హృదయంతో జీవించడమే ఆధ్యాత్మిక జీవన విధానం. అది మనిషికి మాత్రమే దేవుడిచ్చిన వరం.

- రావులపాటి వెంకట రామారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న