భగవంతుడి స్వభావం

అంతర్యామి

భగవంతుడి స్వభావం

క్తి ఎన్ని రకాలో, భక్తులు అన్ని రకాలు. ఇన్ని రకాల భక్తులను భగవంతుడు ఎలా భరిస్తున్నాడా అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. భర్తల హింసలు భరించలేక భార్యలైనా విడిచి పెడతారేమో గాని- తననే నమ్ముకొన్న నిజమైన భక్తులను భగవంతుడు ఎన్నటికీ విడిచి పెట్టడు. తన భక్తులెన్నడూ బాధ పడరాదన్నది నిజానికి భగవంతుడి ప్రతిజ్ఞ. గీతలో శ్రీకృష్ణుడు ఆ మాటను స్పష్టంగా చెప్పాడు. అందుకోసం తనకెన్ని కష్టాలు ఎదురైనా ఎదురీదడం, ఎలాంటి  అవమానాలనైనా సహించడం భగవంతుడి స్వభావం.
పద్మవ్యూహంలో అభిమన్యుణ్ని ఒంటరివాణ్ని చేసి కౌరవ యోధులంతా కలిసికట్టుగా  మట్టుపెట్టారన్న దుర్వార్త అర్జునుడికి తెలిసింది. అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుణ్ని మర్నాటి సాయంత్రానికల్లా సంహరిస్తానని భీషణమైన శపథం చేశాడు. ఆ ప్రతిజ్ఞ వినగానే కృష్ణుడు ఉలిక్కి పడ్డాడు.

‘సూర్యాస్తమయం లోగా కౌరవ సైన్యాన్ని జయించడం ఎలా సాధ్యం? ఆ విధంగా అందరిముందూ ప్రతిజ్ఞ చేయడం అర్జునుడికి తగునా’  అని తన రథసారథి దారుకుడి వద్ద కృష్ణుడు అసహనం వ్యక్తం చేసినట్లు భారతం చెబుతోంది.
అసంతృప్తిని ప్రకటించాడే గాని, కృష్ణుడు తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. బాధ్యతను మరిచిపోలేదు. ఏరికోరి కృష్ణుణ్ని తెచ్చిపెట్టుకొన్నాడు ధర్మజుడు. దాంతో పాండవులను విజయ తీరాలకు చేర్చే బాధ్యత కృష్ణుడిపై పడింది. కనుక,  ఆ రాత్రి శ్రీకృష్ణుడు కఠోర దీక్షతో  పరమేశ్వరుణ్ని  ప్రసన్నం చేసుకొన్నాడు. అర్జునుణ్ని స్వయంగా కైలాసానికి తోడ్కొని వెళ్ళి పరమశివుడి అనుగ్రహాన్ని సాధించి పెట్టాడు. సైంధవ వధకు ప్రణాళిక రచించి అర్జునుణ్ని ముందుకు నడిపించాడు. 

యుద్ధ సమయంలో  భీష్మ పితామహుడు ప్రళయకాల రుద్రుడై విజృంభించిన వేళ అర్జునుడితో సహా పాండవులందరూ  భీతావహులయ్యారు. పార్థుడికి రథసారథిగా ఉంటానే గాని, ఆయుధాన్ని ధరించనని తాను చేసిన శపథాన్ని శ్రీకృష్ణుడు ఆ క్షణంలో పక్కన పెట్టాడు. చక్రాన్ని చేపట్టాడు. భీష్ముడి పైకి కుప్పించి దూకాడు. ‘నిన్ను ఇప్పుడే చంపేస్తున్నాను’ అని ప్రకటించాడు. ఆ సమయంలో ‘అంతకన్నా మహాభాగ్యమా?’ అంటూ భీష్మ పితామహుడు చేతులు జోడించి మరీ కృష్ణ పరమాత్మను స్వాగతించాడు. భీష్ముడే కనుక అంతమంది ముందు నిలదీసి ‘నువ్వు మాట తప్పుతున్నావు’ అని  ఉంటే ఏమయ్యేది? ఎంత చిన్నతనం! ఇదంతా దైవ స్వరూపుడైన స్వామికి తోచకపోవడం కాదు, భక్తులపై ఆయనకున్న  కారుణ్యం అంతటిది! తనకు మానావమానాలతో నిమిత్తం లేదు. తనను నమ్ముకున్న భక్తులకు మాత్రం ఆపద కలగరాదన్న భీషణమైన నిర్ణయం కృష్ణుడిది.అందుకే తన ప్రతిష్ఠను సైతం పణంగా పెట్టాడు.

లోక సంరక్షణకై కాలకూట విషాన్ని మింగడానికి సిద్ధపడిన పరమ శివుడు... రాక్షసుల బారి నుంచి మునుల్ని కాపాడటానికి సమకట్టిన శ్రీరామచంద్రుడు... ధర్మాన్ని పరిరక్షించే పనిలో రథం తోలడానికి సైతం సిద్ధపడిన శ్రీకృష్ణుడు... తనను సిలువ వేసినవారిని సైతం క్షమించమని కోరిన జీసస్‌... రాజ్యభోగాలను త్యజించి ప్రజల కష్టాలకు పరిష్కారాన్ని అన్వేషించాలని అడవి  బాట పట్టిన గౌతమ బుద్ధుడు... ఇలా అవతార పురుషులందరూ తమ భక్తుల కోసం బాధలు పడినవారే. మానావమానాలకు, సుఖదుఃఖాలకు అతీతంగా వ్యవహరించే విలక్షణ స్వభావమే వారిని భగవంతులుగా చేసిందేమో!

- ఎర్రాప్రగడ రామకృష్ణ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న