సమూహ ఫలం ఎంతో బలం

అంతర్యామి

సమూహ ఫలం ఎంతో బలం

చేతి వేళ్లు విడిగా ఉన్నప్పుడు నిస్తేజంగా ఉంటాయి. కాని, అవి దగ్గరగా కలుసుకున్నప్పుడు చైతన్యవంతమవుతాయి. భౌతికంగా ఒక పిడికిలి ఆవిష్కృతమవుతుంది. సహజంగానే దానికి బలం చేకూరుతుంది. పిడికిలి, సమీకరణకు ప్రతిబింబం. అది సామూహిక బలానికి సూచికగా, విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. శరీరం పిడికిలి బిగించగానే మనసూ ధైర్యాన్ని కూడ గట్టుకుంటుంది.
వనరులు పుష్కలంగా లభించే చోట నాగరికతలు వెలశాయి. అలా జరగడం కేవలం మనుషులకు కలిగిన ఆలోచనవల్ల మాత్రమే కాదు. ‘కలపడం’ అనేది ప్రాథమికంగా సృష్టి ధర్మం. అన్నింటినీ కలిపి ఉంచడం- ప్రాకృతిక ప్రామాణిక సూత్రం. నిర్విరామ చలనంతో విస్తృతంగా పరచుకునే సృష్టి ఎల్లవేళలా బంధాలు సృష్టిస్తుంది. అనుబంధాలు ఏర్పరుస్తుంది. సమూహాలుగా తీర్చిదిద్దుతుంది. అందుకే సృష్టిలో ఎన్నెన్నో ఖగోళాలు, సూర్యమండలాలు, కోటానుకోట్ల నక్షత్రాలు...
‘ఆత్మ’ అంటేనే ‘బంధం’ అనేవారు సుప్రసిద్ధ ఆధునిక తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఈ మాట వేదకాలం నుంచీ ఉంది. ఒక దండలో పూలన్నింటినీ బంధించి వెలుపలికి కనబడకుండా వాటి వెనకాల దారం ఉంటుంది. అదే రీతిన ఈ సృష్టిలో ఆత్మ చైతన్యం అన్నింటినీ కలిపికుట్టి వాటి వెనకాల దాగి ఉంటుంది.గీతలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ చూపించే విశ్వరూప దర్శనానికి అర్థమూ అదే. గోచర అగోచర విశ్వమంతా ఒక వసుధైక కుటుంబం. కనిపించే ప్రపంచమంతా అనేకానేక పదార్థాల సమాహారం.
చైతన్యం ఉన్నంతవరకు సమీకరణ జరుగుతూ ఉంటుంది. పిండంలో ప్రాణం పడ్డప్పటి నుంచి వృద్ధాప్యంలో మొదటి భాగం వరకు శరీర కణాలు వృద్ధి చెందుతాయి. మనసులోనూ ఆలోచనలు బాగా కలుగుతాయి. అనుభవాల గాఢత, విషయ సేకరణ వైశాల్యమూ పెరుగుతాయి. ఆ తరవాత క్రమంగా ప్రాణశక్తి క్షీణిస్తున్న దశలో శరీరం కుంగడం ఆరంభిస్తుంది. మనసులో మతిమరుపూ మొదలవుతుంది. అంటే, అప్పటిదాకా నిండుకున్న విషయాలు బయటకు వెళ్ళిపోవడమన్నమాట.
కేంద్రీకృతమైన (ముద్దకట్టిన) చైతన్య కణాలే పదార్థాలుగా, మూర్తులుగా ఆకృతులై భౌతిక రూపం దాలుస్తాయి. అదే మూలసూత్రంతో సూర్యకిరణాల్ని ఒక దగ్గర చేర్చి సూర్యశక్తి (సోలార్‌)ని విద్యుత్‌ శక్తిగా తయారుచేస్తున్నారు. ప్రపంచానికి వెలుగులు పంచుతున్నారు.
నదులు ప్రశాంతంగా ఉన్నప్పుడే పంట పొలాలకు నీరు అందిస్తాయి. ఆహ్లాద వాతావరణాన్ని కల్పిస్తాయి. విహార యాత్రలకూ ఆహ్వానం పలుకుతాయి. పుష్కరాల పండుగలతో శోభిల్లుతాయి. దానికి భిన్నంగా నదులే ఉప్పొంగితే గ్రామాలను పట్టణాలను ముంచెత్తుతాయి. సావధానంగా, ప్రశాంతంగా ఉన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆనందంగా జీవిస్తాడు. ఆ సంతోషంలో అందరినీ కలియజూస్తాడు. ఆరోగ్యంగా ఉన్న బలవంతుడే ఆపదల్లోని వారికి చేయూత ఇస్తాడు. పురోభివృద్ధిలో సాధికారికంగా భాగస్వామి అవుతాడు.
బంధం అనేది ఒక మండపానికి పైకప్పులాగా ఉండాలి. ఆ బంధం నిలుపుకోవాలనుకునేవారు అది నిలబడటానికి ఆయా పరిధుల్లో గుంజలుగా నిలబడాలి. అంతేగానీ అనుబంధం బాగా పెంచుకుందామని మరింత దగ్గరైతే మండపం కూలిపోతుంది. బంధం చెడిపోతుంది. ఇదే అర్థంలో- ‘ఆలుమగలు ఒకే కంచంలో అన్నం తినాలి. కాని, ఎవరికి వారుగా ఉండాలి’ అన్నారు ఖలీల్‌ జీబ్రాన్‌. అంటే ఒకే సంబంధంలో ఉంటూనే ఎవరి వ్యక్తిత్వంతో వారు, ఎవరి ఎరుకతో వారు, ఏకాంతంగా వెలుగుతూ ఉండాలని అంతరార్థం!

- మునిమడుగుల రాజారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న