ప్రేమే పెన్నిధి

అంతర్యామి

ప్రేమే పెన్నిధి

ప్రేమానుబంధమే మధురానందం, జీవన మకరందం. కవుల కలం నుంచి జాలువారిన ఈ తీయని అనుభూతి, జగతికి జ్యోతి అని, జీవకోటి పాలిట దివ్య సంజీవని అని చెప్పాలి. ప్రేమ అనే రెండు అక్షరాలు ఈ ప్రపంచాన్ని ఏలుతున్న మాట వాస్తవం. కొన్ని ప్రాణులు తమనే ప్రేమిస్తూ తమ కోసమే జీవిస్తాయి. మరి కొన్ని ఆ పరిధిని దాటి తమవారి కోసం పరితపిస్తాయి. పరిణామ క్రమంలో పరిణతి కోసం పాకులాడే మనిషికి ఎదిగే అవకాశం ఉంది. నేను, నాది అనే పరిధులు దాటి మనందరిదీ అని చాటి చెప్పగల మనిషిని మనీషి అని మహాత్ముడని దివ్యమానవుడని ఈ లోకం పొగుడుతుంది, పూజిస్తుంది, ఆరాధిస్తుంది.

సృష్టికి మూల కారణంగా చెప్పుకొనే ప్రేమ మూడు రకాలు. కేవలం శారీరక సుఖం పశుప్రేమ. శరీరానికి మనసుకు చెందినది, సుఖంతో పాటు సంతోషం కలిగించేది మానవ ప్రేమ. వీటిని మించినది ఆనంద రసాస్వాది అయిన దివ్య ప్రేమ. అది ఆగని ప్రవాహం! స్వ, పర, భేదభావం లేకుండా ముంచెత్తే రసవాహిని. సాక్షాత్తు ఆ పరమాత్మ తత్త్వం! సచ్చిదానంద రూపమైన ఆ పరబ్రహ్మను రసస్వరూపుడు అంటున్నాం. ఒకరికి పరిమితమైన స్వార్థ ప్రేమకన్నా, ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకొనే ప్రేమకన్నా, అడగకనే ఇచ్చే అవ్యాజ ప్రేమ దివ్యమైనది. ప్రపంచంలోని జీవరాశులన్నీ సంతానం కోసం, సంతోషం కోసం ప్రేమను పాటిస్తాయి. తరగని ఆనందం కోసం పాటుపడే అవకాశం మానవ జాతికి ఆ దేవుడి వరం!

దేవుడు పరమ ప్రేమ స్వరూపుడని నారద[ భక్తి సూత్రం మానవజాతికి చెబుతోంది. ఆ ప్రేమను పంచడానికి పదేపదే పరమాత్మ పలు రకాల అవతారాలు ధరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శరణాగతుడైన మానవుడికి ఈతి బాధలు, భవబంధాలు తొలగిపోతాయి. ప్రకృతి సహజమైన త్రిగుణాలు ఈ ప్రపంచంలో రాగ ద్వేషాలకు మూల కారణాలు. పురుషోత్తముడి చల్లని చూపు పడితే ప్రలోభాలు పారిపోతాయి. క్షణికమైన భౌతిక సుఖ భోగాల పట్ల ఆకర్షణ క్రమంగా క్షీణిస్తుంది. నిశ్చలానంద రసాస్వాదన వైపు మనసు మొగ్గుతుంది. అదే వైరాగ్యం! జ్ఞాన వైరాగ్యాలు దివ్య ప్రేమ సౌధానికి పునాదిరాళ్లు. రుణానుబంధాలన్నీ దివ్య ప్రేమకు అనువాదాలు. తల్లి బిడ్డను, భార్య భర్తను, భక్తుడు భగవంతుడిని ప్రేమించడానికి ఆత్మానుబంధమే కారణం. తాత్కాలికమైన సుఖభోగాల కోసం తాపత్రయపడే మనిషి ఎండమావి కోసం పరుగెత్తే లేడితో సమానం! సిరిసంపదలు, భోగభాగ్యాలు శాశ్వతం అనుకుని సాటి మనిషిని సాధించి బాధించేవారు మనిషి రూపంలో ఉన్న పశువులు. స్వార్థపరులు తాము బాగుపడరు, పరులను బాగుపడనివ్వరు. తన బాగు నలుగురి బాగుతో ముడివడి ఉన్నదని తెలుసుకున్నవాడు మానవ ప్రేమకు ప్రతినిధి. అందరి బాగు కోసం జీవితాన్ని త్యాగం చేసేవాడు దివ్యప్రేమకు పెన్నిధి.

బుద్ధభగవానుడు, చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమహంస- దివ్యప్రేమకు దాసులు. హరిదాసులై వారు ప్రజలను సేవించారు. ప్రేమ ఉన్నచోట భయం నిలువదు. నిజమైన ప్రేమకు స్వేచ్ఛ నిదర్శనం. నిర్బంధమే భయకారణం. రాధ మాధవుడి ప్రేమ కోసం సర్వస్వాన్నీ త్యాగం చేసింది. స్త్రీ జాతికి ప్రేమ మాధుర్యాన్ని ఎరుకపరచింది. తాళి కట్టిన భార్య భర్త ప్రేమ కోసం తనవారినందరినీ వదులుకుంటుంది. ఎన్ని పరీక్షలనైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఆ ప్రేమ కోసం సావిత్రిలా యముడితో పోరాడుతుంది. చివరికి ప్రాణాలనైనా విడవడానికి సిద్ధమవుతుంది. ప్రేమ అన్న రెండక్షరాల పెన్నిధి కోసం జీవితాన్ని బలిపెట్టిన ప్రేమజీవులకు ధన్యవాదాలు! ఆ పేరు ఉన్నా, విన్నా, పిలుపు విన్నా, పిలిపించుకున్నా జీవితం ధన్యమవుతుంది.

- ఉప్పు రాఘవేంద్రరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న