బ్రహ్మవిద్య

అంతర్యామి

బ్రహ్మవిద్య

రాత్పరుడి గురించి సంపూర్ణంగా తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానమని ముండకోపనిషత్తు చెబుతోంది. ఈ జ్ఞాన సముపార్జనను బ్రహ్మవిద్య అన్నారు. బ్రహ్మవిద్య వల్ల సర్వం తెలుస్తుంది. అంతకు మించి తెలుసుకోవలసింది ఇంకేమీ మిగిలి ఉండదు. ఈ జ్ఞానం కలిగిన వాడినే బ్రహ్మజ్ఞాని అంటారు. భగవంతుడి గురించి ఎవరైనా కచ్చితంగా నిర్వచించగలరంటే- అది బ్రహ్మజ్ఞాని మాత్రమే! బ్రహ్మజ్ఞాని సామాన్యుడు కాదు, దైవంతో సమానమైనవాడు. అతడిలోని జ్ఞానానికి అవధులు ఉండవు. సృష్టి సృజనకు బ్రహ్మవిద్య కారణం. వెలుగు ఆ జ్ఞానం నుంచే ప్రకాశిస్తుంది. సుదర్శన చక్రంలా తిరుగుతున్న విశ్వం, విశ్వాంతరాళాల గరిమనాభి గురించిన జ్ఞానం బ్రహ్మవిద్యలో అంతర్భాగం.

జీవ భ్రాంతి బ్రహ్మవిద్యకు అడ్డంకి. సర్వ జీవులూ పరమాత్మ స్వరూపమే అంటోంది గురుగ్రంథ సాహిబ్‌. ఇలాంటి జీవితం గడపడానికి కనీసం ప్రయత్నం చేయాలి. మనసును నిష్కల్మషం చేసుకొని సర్వాత్మ భావాన్ని గ్రహిస్తే బ్రహ్మవిద్య అభ్యసించేందుకు కనీస అర్హత లభిస్తుంది. మనకు కనపడేదంతా ఎక్కడ వ్యక్తమై ఉంటుందో అదే పరమాత్మ! పరమాత్మకు స్వరూపం లేదని కైవల్యోపనిషత్తు చెబుతోంది. కనుక ఆ రూపం గురించి నిర్వచించలేం. ఆ జ్యోతిలోని వెలుగును ఎరుక పరచుకొని అనుభవించాల్సిందే. పరమాత్మ బోధస్వరూపమని జిజ్ఞాసువులు అంటారు.

కళకు, మనసుకు నేరుగా సంబంధం ఉంటుందని శుద్ధాద్వైతి వల్లభాచార్యులు చెప్పేవారు. వ్యాసుడి బ్రహ్మసూత్రాలకు శ్రీ శంకర భగవత్పాదులు అద్భుతమైన భాష్యం రాశారు. చెడు చూస్తే ఆ దృశ్యం మనసును ప్రభావితం చేస్తుందని అది వెల్లడిస్తుంది. ఒకవేళ చెడు చూడాల్సి వచ్చినా దాని ఫలితార్థం మనసుపై పడకుండా చూసుకోవాలి. రామాయణంలోని సుందరకాండలో సీతను వెతుకుతూ, రావణుడి పడకగది వైపు దృష్టి సారించిన హనుమ, ఎన్నో చెడు దృశ్యాలను చూశాడు. తనను తాను సరిదిద్దుకుంటూ, ఆ దృశ్యాల ప్రభావం తన మనసును ఏ మాత్రం కల్మషం చేయలేదంటూ తనకు తాను పశ్చాత్తాపం చెంది సంబాళించుకున్నాడు. ఇలా మనసును నిష్కల్మషం చేసుకొన్నప్పుడు ఆత్మ సంస్కారవంతమై ఉజ్జ్వలమవుతుంది. ఆత్మ దివ్యత్వం కోసం ఈ ప్రపంచంలో కనిపిస్తున్నదంతా నిర్మలమైనదని, ఆహ్లాదం కలిగిస్తున్నదిగా అనుభూతి చెందితే- బ్రహ్మ జ్ఞానానికి ఆ అనుభూతి చక్కని మార్గమవుతుంది.

బ్రహ్మవిద్య పర్వతం లాంటిది. అది అచంచలమైన జ్ఞానం. గాలి వేగంగా వీస్తుంటే... ఆ గాలి వేగానికి కొండపై చెట్లు కదులుతాయేమో గాని, కొండ కదలదు. తానెవరో, తన వాస్తవ స్వరూపమేమిటో తెలుసుకొన్నవాడు సంతోషం, దుఃఖం, భయం... అనే వాటినుంచి పూర్తిగా విముక్తుడవుతాడు. అలాంటి వారినే జీవన్ముక్తులంటారు. జీవన్ముక్తుడికి ప్రాపంచిక వ్యవహారాలపై ఆసక్తి ఉండదు. ఆసక్తి ఉంటేనే కదా బంధం. బ్రహ్మజ్ఞాని కాలక్రమంలో దేహం విడిచిపెట్టాక చిదాత్మ స్వరూపుడవుతాడని వేదాంత దర్శనాలు చెబుతున్నాయి. బ్రహ్మవిద్య నేర్వని వాడిని దీనుడని ఆ దర్శనాలు సూచిస్తున్నాయి. దీనుడిగా బతికే కన్నా  బ్రహ్మవిద్య నేర్చుకునేందుకు ప్రయత్నించాలని సనత్సుజాతీయం చెబుతోంది.

- అప్పరుసు రమాకాంతరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న