ఇదీ క్రమం... ఇదే క్రమం!

అంతర్యామి

ఇదీ క్రమం... ఇదే క్రమం!

మనుషులెక్కడికి ప్రయాణమైపోతున్నారు? పుట్టడమే ఆలస్యం ప్రయాణం.నడిచి నడిచి నడిచి, ఎదిగి ఎదిగి ఎదిగి... పరుగుపందెమా?!  చీమలు, పాములు, నదులు, నదాలు, పర్వతాలు, వృక్షాలు... ప్రతి ఒక్కటి- కాళ్లున్నా, లేకపోయినా పరుగులు పెడుతూనే ఉంటాయి. నదులు నీళ్లతో, వృక్షాలు వేళ్లతో, పాములు పొట్టతో... ఈ పరుగుకు, ఈ ప్రయాణానికి గమ్యం ఉందా? అయితే ఏది గమ్యం?

ప్రయాణం అంటే  స్తబ్ధత లేకపోవడం... కదలిక, చైతన్యం. ఉన్నచోటి నుంచి కదిలి వెళ్ళిపోవడం. అవును. అదే జీవితం. అయితే... ఈ కదలికకు ప్రయోజనం ఉందా, ఎదుగుదల ఉందా... ఉంటే అదేమిటి? ఈ లోకంలో ప్రతిస్పందనకు ఒక అర్థం ఉండాలి. ఒక పరమార్థం ఉండాలి. ప్రతిదీ, ఏదైనా యథాలాపంగా జరిగినట్లున్నా- అది యథాలాపం కాదు. ఒక నియమబద్ధ, ఒక నిర్ణీత సంఘటన. ఏదోదానికి ప్రేరణ. ప్రతి అనుబంధమూ ఒక ప్రాయోజిత కూర్పు.

ఒక  ఊసరవెల్లి పరిసర వర్ణాలకు అనుగుణంగా తన ఒంటి రంగును మార్చుకుంటుందంటే అది యథాలాపమా! నీటిలో జీవించే చేప ముక్కుతో కాకుండా మొప్పలతో శ్వాసిస్తుందంటే అది వెనక ప్రణాళికేమీ లేని ఒక జీవక్రియ అంటే నమ్మశక్యమా?  అవును. ఈ పరుగుకు, ఈ ప్రయాణానికి ఒక అర్థం ఉంది. ఒక పరమార్థం ఉంది, ఉండాలి. అదే జన్మ సాఫల్యం. నిజమే...

ఇది ఒక మూఢనమ్మకంగా కనిపిస్తుంది. చేవ చచ్చిన పాత చింతకాయ పచ్చడిలా అరుచిగా, నాగరికత ఛాయలే లేని ఒక అనాగరిక భావనగా అనిపిస్తుంది. అనాదిగా, యుగయుగాలుగా వినిపిస్తున్న ఈ అరిగిపోయిన పాత రికార్డు బోధ, బాధ- ఆధునికులకు అర్థంకాని,  ఏమాత్రం ప్రవేశంలేని శాస్త్రీయ సంగీతంలా పరమ చిరాగ్గా ఉంటుంది. నిజానికి నిశితంగా పరిశీలిస్తే, లోతుగా ఆలోచిస్తే ఇంతకంటే ఆధునికమైన, ఆకర్షణీయమైన వ్యవహారం మరొకటి లేదు. ఎందుకంటే శ్వాసించడం ఎన్నటికీ పాతబడదు. నిద్రించడం ఎప్పటికీ విసుగురాదు. అంతకంటే అవసరమైన, అంతకంటే ప్రయోజనకారి అయిన వ్యవహారం ఈ జన్మ సార్థక్య శోధన, సాధన. అది తీయని వేదన. ఈ వ్యవస్థ పుట్టిన చోటే ఆగిపోకూడదు మరి.

కదలాలి. నడవాలి. పయనించాలి! మనిషే కాదు. జన్మ తీసుకున్న అన్నీ... అందరూ... సర్వ జీవజాలం! అయినా ఏమిటీ చక్రభ్రమణం! శూన్యంలో నుంచి ఊడిపడటం. మళ్ళీ శూన్యంలో కలిసిపోవడం! ఏం జరుగుతోంది? ఏం జరగాలని? దీనికి సమాధానం వేదాలు చెప్పాయి. వేదవిదులు చెప్పారు. వేదాలు శ్రుతులు. చదవలేం. వినాలి. అంతే. ఇంకా సర్వ భారతీయ వాంగ్మయం చెప్పింది. ఆచార్యులు చెప్పారు. ఆకాశం చెప్పింది. ప్రకృతి చెప్పింది. పంచభూతాలు చెప్పాయి. సాలెపురుగు చెప్పింది... గూడు అల్లుకుని మళ్ళీ ఆ గూడును తనలోకే లాక్కునే పద్ధతిని. వర్షం చెప్పింది... ఎక్కడినుంచి వస్తుంది మళ్ళీ ఎక్కడికి పోతుందనే సత్యాన్ని.  మంచు చెబుతుంది. మంచు-నీరు- మళ్ళీ మంచు- మళ్ళీ నీరు మళ్ళీ మంచు... ఇదీ క్రమం. ఇదే క్రమం. తెలపనిదెవరు, తెలియనిదెవరికి? జవాబు- ఒక్క మనిషే!

- చక్కిలం విజయలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న