బోనాలు-భాగ్యాలు

అంతర్యామి

బోనాలు-భాగ్యాలు

విశ్వానికి నాయకుడు పరమేశ్వరుడు. ఆ ఈశ్వరుడికి సైతం చైతన్యాన్ని అనుగ్రహించే శక్తి జగన్మాత. సకల జగత్కారిణి, సర్వ శుభదాయిని, సమస్త శక్తులకు మూలకారిణి- జగదంబ. శివసంకల్ప శక్తిగా ఆ దివ్యరూపిణి పలు రూపాల్లో వ్యక్తమవుతుంది. ఈ రూపాలన్నింటికీ ఆధారం- ప్రకృతి. ప్రశస్తమైన ప్రకృతి అఖిల శక్తులకు ఆలంబన. భగవత్‌ శక్తి సంకేత రూపమే- జగదంబ. వేదాలు, ఆగమాలు, పురాణాలు దేవీతత్త్వాన్ని విస్తృతంగా ప్రస్తావించాయి. శిష్ట సంప్రదాయం ఆ జగదీశ్వరిని స్తోత్రాలతో స్తుతిస్తే, జానపదులు అమ్మ అనే ఆత్మీయమైన పిలుపుతో ఆమెను తమ సొంతం చేసుకున్నారు. ప్రాకృతిక శక్తులన్నింటినీ అమ్మ అంశాలుగా సంభావిస్తూ, జానపదులు తమ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ఆషాఢంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణలో ఈ సంస్కృతి బోనాల వేడుకగా స్థిరపడింది.

భోజనానికి రూపాంతరమే- బోనం. విభిన్న కళలతో వెల్లివిరిసే శక్తి సమాహారమే- గ్రామదేవతలు. ఎల్లమ్మ, చిత్తారమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారెమ్మవంటి గ్రామ దేవతల్ని ఆషాఢంలో వివిధ ప్రక్రియలతో పూజిస్తారు. ‘దక్షిణాయనంలో నూటొక్క గ్రామదేవతలను, వారి సోదరుడు పోతురాజును ఆషాఢ అతిథులుగా ఆరాధించే సంప్రదాయం తెలంగాణలో అనాదిగా కొనసాగుతోంది’ అని పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు. అమ్మతల్లిని జానపదులు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఆషాఢంలో ఆడబిడ్డగా తమ ఇంటికి ఆహ్వానించి, చీరసారెల్ని శక్తిమాతకు సమర్పణ చేస్తారు. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పచ్చదనంతో పరిసరాలన్నీ పరిమళించాలని, ఆరోగ్య సౌభాగ్యాలు వర్ధిల్లాలని అమ్మకు ‘సాకబెట్టు’ పేరిట పసుపు, సుగంధద్రవ్యాలు, వేపాకులు కలిపిన జలంతో అభిషేకం చేస్తారు. విషూచి(కరోనా), కలరా వంటి సాంక్రమిక వ్యాధులు ప్రబలకుండా, ఆ ఔషధీయుక్త జలాన్ని తమ ఇంటి పరిసరాల్లోనూ చల్లుకుంటారు.

గోల్కొండ జగదంబిక ఆలయంలో మొదలైన చెలిమి బోనాలు, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళికి నిర్వహించే తుది బోనాల సంబరంలో సాగనంపు ప్రధాన అంశం. పుట్టింటికి ఆడబిడ్డలా వచ్చిన శక్తిమాతకు పసుపుకుంకుమలు, పూలుపండ్లు కానుకగా ఇచ్చి భక్తులు ఆమెను స్వస్థానానికి సాగనంపుతారు.

సాగనంపు పూర్తయ్యాక బోనాల సందడి చివరి అంకంలో శక్తిమాతల్ని వివిధ కూరగాయలు, ఫలాలు, పుష్పాలతో అలంకరిస్తారు. ఈ ఆకృతుల్ని శాకంబరి స్వరూపాలుగా భక్తులు దర్శించుకుంటారు. ‘బ్రహ్మాండ ఛాండోదరి’గా జగన్మాతను దేవీభాగవతం కీర్తించింది. సకల జగత్తును తన ఉదరమనే అమృతభాండంలో శ్రీమాత నిక్షిప్తం చేసుకుందంటారు. అందుకు సంకేతంగా మట్టికుండల్లో అన్నపదార్థాల్ని అమ్మకు సమర్పించే వేడుక బోనాలు. బోనపు కుండ మన శరీరానికి ప్రతీక. ఆ కుండలోని అన్నం మన జీవశక్తికి సంకేతం. ఆ కుండపై వెలిగే దీపం మన ఆత్మజ్యోతి. మన ఆత్మజ్యోతిని, పరంజ్యోతితో మమేకం చేయాలనేది బోనాల ఉత్సవంలో ఆంతర్యం.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న