అమృతజలం

అంతర్యామి

అమృతజలం

ప్రాణికోటికి జీవనాధారం జలం. జలానికి నిఘంటువులలో ఎన్నో పేర్లున్నాయి. ఈ పేర్లన్నీ నీటిలోని గుణాలను తెలుపుతాయి. అమరకోశంలో జలానికి ఇరవై ఏడు పేర్లున్నాయి. ‘ఆపః’ అంటే వ్యాపించి ఉండేది. ‘వాః’ అంటే మిట్టపల్లాలను కప్పివేసేది. ‘వారి’ అంటే కప్పివేసేది. ‘సలిలం’ అంటే పోయేది. ‘కమలం’ అంటే దప్పిక ఉన్నవారు కోరుకునేది. ‘జలం’ అంటే జడీభవించేది. ‘పయః’ అంటే ప్రవహించేది, తాగేది. ‘కీలాలం’ అంటే అగ్నిజ్వాలలను ఆర్పేది. ‘అమృతం’ అంటే మరణాన్ని నిరోధించేది. ‘జీవనం’ అంటే బతికించేది. ‘భువనం’ అంటే అన్నింటినీ పుట్టించేది. ‘వనం’ అంటే అందరూ అడిగేది. ‘కబంధం’ అంటే శరీరాన్ని నిలిపేది. ‘ఉదకం’ అంటే ద్రవరూపంలో ఉండేది. ‘పాథః’ అంటే పానం చేసేది. ‘పుష్కరం’ అంటే పోషించేది. ‘సర్వతోముఖం’ అంటే అన్ని దిక్కులా ప్రవహించేది. ‘అంభః’ అంటే గమించే స్వభావం కలది. ‘అర్ణః’ అంటే పారే స్వభావం కలిగినది. ‘తోయః’ అంటే రక్షించేది. ‘పానీయం’ అంటే తాగేది. ‘నీరం’ అంటే లోతులలోకి ప్రవహించేది. ‘క్షీరం’ అంటే ప్రవాహం కలది. ‘అంబు’ అంటే ప్రవాహ సమయంలో ధ్వనులు చేసేది. ‘శంబరం’ అంటే ఆవరించి ఉండేది. ‘మేఘపుష్పం’ అంటే మేఘాలకు పుష్పాలవంటిది. ‘ఘనరసం’ అంటే మేఘాలలోని సారంగా కురిసేది. ఇలా ఇరవై ఏడు పేర్లతో నీటిని పిలవడం కనిపిస్తుంది.

నీరు కల్మషాలను కడిగివేస్తుంది. ఏ ప్రాణినైనా, వస్తువునైనా నిర్మలినంగా ఉంచుతుంది. స్వచ్ఛంగా ప్రకాశించే విధంగా మారుస్తుంది. అందుకే లోకంలోని ప్రాణులన్నీ నీటిని ఇష్టపడతాయి. వేదాలలో సైతం నీటి విశిష్టతను తెలిపే మంత్రాలెన్నో ఉన్నాయి. దేవతలకు చేసే పూజలు, శుభకార్యాల్లో స్వచ్ఛమైన నీటి అవసరం ఎంతో ఉంటుంది. నీరు లేకుండా ఏ అర్చనలు, పుణ్యకర్మలూ జరగవు. జలప్రాశనం (నీటితో ఆచమించడం), జలమార్జనం (నీటితో అందరినీ, అన్ని ప్రదేశాలనూ శుద్ధి చేయడం), జలార్పణం (నీటిని వదలడం), అర్ఘ్యం (నీటితో చేతులు కడుక్కోవడం), పాద్యం (నీటితో శుభ్రంగా కాళ్లు కడుక్కోవడం), ఆచమనీయం (మానసిక పవిత్రతకై నీటిని స్వీకరించడం) వంటివి చూసినప్పుడు మానవుడి దైనందిన జీవితంలో నీటికి ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తుంది. దేవతలను అభిషేకించే సమయంలో పవిత్ర నదీజలాలను ఉపయోగించడం సర్వవిదితమే. సంధ్యావందనాది ధార్మిక క్రియల్లో సూర్యుడికి అర్పించే ‘అర్ఘ్యప్రదానం’ నీరే పూజాద్రవ్యమని స్పష్టం చేస్తోంది. భగవంతుడు తనకు భక్తితో సమర్పించే నీటిని స్వీకరిస్తానని భగవద్గీతలో చెప్పాడంటే జలం విలువ ఎంతటిదో గ్రహించవచ్చు.

ప్రపంచ సృష్టి నీటిలోనుంచే జరిగిందని మనుస్మృతి చెబుతోంది. బ్రహ్మదేవుడు మొదట నీటిని సృష్టించి, అందులో ఈ ప్రపంచాన్ని ఒక అండంగా (గుడ్డుగా) ఉత్పత్తి చేశాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. విష్ణువుకు నారాయణుడనే పేరు ‘నీరు’ వల్లనే వచ్చింది. నారం అంటే నీరు అని అర్థం. నీటికి మూలస్థానమైనవాడు కనుక విష్ణువును ‘నారాయణుడు’ అని పిలుస్తారు. గంగానది విష్ణుపాదం నుంచి జన్మించి, నేలపైకి వచ్చిందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.

నేడు ప్రపంచంలో లభించే నీటిని మనిషి ఎక్కడికక్కడ కల్మషాలతో నింపేస్తూ, విషపూరితంగా మార్చివేస్తున్నాడు. స్వచ్ఛమైన నీరు ప్రాణాలను నిలుపుతుంది. కల్మషజలం వ్యాధులకు, రోగాలకు, అనారోగ్యాలకు కారణమై ప్రాణాలు తీస్తుంది. జలం భగవంతుడు ప్రసాదించిన అమూల్య పదార్థం. దాన్ని స్వచ్ఛంగా ఉంచడం ద్వారా, సకలప్రాణులను చల్లగా ఉంచడం మనిషి కర్తవ్యం!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న