అమ్మ మనసు

అంతర్యామి

అమ్మ మనసు

దిశంకరులు అనితరసాధ్యంగా రచించిన మాతృ పంచకంలో తల్లి గొప్పదనం గురించి చెప్పిన ప్రతి మాటలో ఆర్ద్రత, అమృతమయమైన భావ సంపద పరవశుల్ని చేస్తాయి. తైత్తిరీయోపనిషత్తు ‘మాతృదేవోభవ’ అంటూ తల్లిని దేవతగా చెబుతుంది. పరమాత్మకు జనన మరణాలు లేవంటారు. జననం లేనప్పుడు జనని కూడా ఉండదు. అందుకే ఆయన తల్లి ప్రేమను పొందడానికి తన పరమ భక్తులకు బిడ్డగా జన్మిస్తాడని చెబుతారు. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలు అటువంటివే.

మన పురాణాల్లో తల్లికి సంతోషం కలిగించిన కథనాలు చాలా ఉన్నాయి. మహా బలశాలి అయిన గరుత్మంతుడు తల్లి దాస్యవిముక్తికి ఇంద్రుడితో యుద్ధం చేసి, అమృతాన్ని తెచ్చి సవతి తల్లికి ఇస్తాడు. శ్రీకృష్ణుడు తల్లి దేవకి పోగొట్టుకున్న సంతానాన్ని తెచ్చి చూపిన కథ ఉంది. రావణుడు తల్లికోసం ఆత్మలింగాన్ని తెచ్చిన కథ కూడా చెప్పదగినదే. ఆదిశంకరులు తల్లికిచ్చిన మాటకోసం, ఆమె అవసాన దశలో వచ్చి, దివ్యదర్శనాలు ఇప్పించిన కథ అందరికీ తెలిసిందే. శ్రీరమణులు తల్లి కర్మదోషాలను క్యాన్సర్‌ రూపంలో తాను స్వీకరించి ఆమెకు ముక్తి ప్రసాదించినట్లు చెబుతారు.

తల్లి బిడ్డల కోసం అనేక నోములు, వ్రతాలు, దానాలు చేస్తుంది. ఉపవాస దీక్షలు చేస్తుంది. వేయి కళ్లతో బిడ్డల్ని అనుక్షణం గమనిస్తూ, వారు ప్రయోజకులు కావడానికి సర్వశక్తులూ వినియోగిస్తుంది. పిల్లలు గొప్పవారైతే మనసునిండా సంతోషం నింపుకొని ఉప్పొంగిపోతుంది. తల్లి బిడ్డల ప్రేమ మినహా ఇంకేమీ కోరదు. ఆమె అల్ప సంతోషి. పిల్లలు ప్రేమగా ఏ చిన్న వస్తువు ఇచ్చినా పరవశంతో పొంగిపోతుంది. జనని, జన్మభూమి- స్వర్గంతో సమానమని వాల్మీకి శ్రీరాముడి పాత్ర ద్వారా పలికిస్తాడు. జననికి జనని జన్మభూమి. తల్లికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో మాతృ భూమికీ అంతే ఇవ్వాలి. మన గుర్తింపు మాతృ భూమికి సంబంధించి ఉంటుంది. కుల మతాలతో కాదు.

ప్రతి వ్యక్తికీ స్వయం కృషే ఆస్తి. విద్య, ఉద్యోగం, భవితవ్యం- అన్నీ స్వయంకృషి మీదనే ఆధారపడి ఉంటాయి.

ధర్మరాజు యక్షుడికి చెప్పినట్లు ‘ప్రతి మనిషీ తన కళ్లముందు ఎందరో చనిపోతున్నా తనకు మాత్రం మరణం లేదనుకుంటాడు. ఇదే భ్రమతో జీవిస్తూ ఎంతో విలువైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటాడు. కొందరు కాలాన్ని ధనంగా మార్చుకుంటారు. మరికొందరు జ్ఞానంగా మార్చుకుంటారు. కానీ, ఎవరూ కాలాన్ని కైవసం చేసుకోలేరు. ఆయువును పెంచుకోలేరు. కాలమే తల్లిలా మనల్ని ఈ ప్రపంచంలోకి ప్రవేశపెడుతుంది. మనల్ని జీవితకాలం కనిపెట్టుకుని ఉంటుంది. కంటికగుపించే ప్రకృతి ద్వారా అనేక మౌన సందేశాలు ఇస్తుంది.

మౌనాన్ని అర్థం చేసుకోగల శక్తి అందరికీ ఉండదు. మౌనమే ఆధ్యాత్మిక భాష అని మునులు చెబుతారు. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. మనసును శూన్యం చేసుకోవడం. ఆలోచనలకు అవకాశం ఇవ్వకపోవడం.

పరమాత్మ దివ్యధామాన్ని వెతుక్కుంటూ అడవులకు ఆలయాలకు వెళ్ళనవసరం లేదు. చూపును లోపలికి మళ్ళించి ఆర్తిగా అన్వేషిస్తే అంతర్యామి అగుపిస్తాడు. ఆయన సన్నిధే అమ్మ ఒడి.

- కె.విజయలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న