సత్సాంగత్యం

అంతర్యామి

సత్సాంగత్యం

త్పురుషుల సహవాసమే సత్సాంగత్యం. అదే మనిషికి శాంతిని చేకూరుస్తుంది. సత్సాంగత్యం ఏకాంతవాసం కన్నా అధిక ఫలదాయకమని పెద్దల మాట. ఈ ప్రపంచంలోని వస్తువుల్లో చందనం అతి శీతలమైందని చెబుతారు. చంద్రుడి శీతల కిరణాలు చందనం కంటే చల్లగా ఉంటాయి. ఈ రెండింటి కంటే సత్పురుషుల సాంగత్యం అతి శీతలమైనదని నీతిశాస్త్రం చెబుతోంది.

జన్మతో సంక్రమించిన దుష్ట వాసనలను సత్పురుషుల సాంగత్యం అణచివేస్తుంది. మనిషిలోని మంచి సంస్కారాలను ప్రేరేపించి మనిషిని పునీతం చేస్తుంది. మహామనిషిగా మారుస్తుంది. సత్పురుషుల బోధనల వల్లే రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయ్యాడు. అజరామరమైన రామాయణ కావ్యాన్ని లోకానికి అందించాడు. సత్సాంగత్యం వల్లే దాసీ పుత్రుడు దేవర్షి నారదుడయ్యాడు. అలాగే, శుకమహర్షి ఉపదేశం వల్లే పరీక్షిత్తు ఏడు రోజుల్లో ముక్తిని పొందాడు.

తనకు తానుగా ఎగరలేని ధూళి- గాలి సాంగత్యం వల్ల ఎలా పైకి ఎగురుతుందో అలాగే, సత్సంగం సామాన్యుల్నీ ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. బలి, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జటాయువు, కుబ్జ, ధర్మవ్యాధుడు మొదలైనవారు సత్సంగం వల్లనే తరించారని భాగవతం చెబుతోంది.

సత్పురుషులు కులమతాతీత వ్యక్తులుగా వ్యవహరిస్తారు. అందరినీ నిస్వార్థంగా ప్రేమిస్తారు. ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేయడానికి ఇష్టపడతారు. మట్టిలో మాణిక్యాలు దాగినట్లు సామాన్యుల మధ్య అసామాన్యులుగా మెలగు తారు. అహింస, ఓర్పు, రుజు వర్తనం, పెద్దల సేవ, శుచిత్వం, అహంకార రాహిత్యం, భగవద్భక్తి.... ఈ సద్గుణాలన్నీ సత్పురుషులకు ఆభరణాలు. ఎంత కష్టమైనా సరే, సజ్జనుల సహవాసాన్ని వదులు కోకూడదు.

సత్సాంగత్యం వల్లే మనిషి మాయామోహం నుంచి విముక్తు డవుతాడు. ఇతరులతో సచ్ఛీలతతో, సంస్కారంతో వ్యవహరిస్తాడు. సత్సాంగత్యం భగవత్‌సాక్షాత్కారం కంటే ప్రియమైనదని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వెల్లడించాడు.

మనిషి చెడు  స్నేహాల వల్ల, దుష్ట వాతావరణం వల్ల ఎక్కువగా ప్రభావితుడవుతాడు. మనసు చెడు పట్ల ఆకర్షితమవుతుంది. అప్పుడు  మనిషి బుద్ధి, వివేకం ద్వారా వ్యామోహలకు, ప్రలోభాలకు దూరంగా ఉండాలి. దుస్సాంగత్యానికి  దూరమైనప్పుడే మనిషి ఆత్మశుద్ధుడవుతాడు. దుస్సాంగత్యం పాపాలను పెంచుతుంది. న్యాయాన్ని నశింపజేస్తుంది. దుర్జన సాంగత్యంలోని అలవాట్లు, ప్రబోధాలు విచక్షణాశక్తిని కోల్పోయేటట్లు చేస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు దుష్టులకు దూరంగా ఉండాలి.

ఒక వ్యక్తి ఔన్నత్యానికిగాని, అధోగతికి గాని కారణం సాంగత్య ప్రభావమే. అందుకే ప్రతి మనిషీ సత్సంగాలను ఏర్పాటు చేసుకుని సజ్జనుల స్నేహాన్ని కోరుకోవాలి. వారి సన్నిధిలోనే జ్ఞానాన్ని ఆర్జించాలి. మానసిక వికాసాన్ని పెంచే సద్గ్రంథ పఠనం కూడా సజ్జన సాంగత్యం వంటిదే. అటువంటి గ్రంథాలను ప్రతి మనిషీ అధ్యయనం చేయాలి. సత్పురుషుల సాంగత్యం ద్వారా మనిషి విషయ వాసనలకు చిక్కకుండా విచక్షణా జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మోహాన్ని త్యజించి మనసును నిర్మలంగా, నిశ్చలంగా ఉంచుకుంటాడు. ‘సజ్జనులతో పొత్తు పెట్టుకో, కాస్త జ్ఞానం కలవారి తర్క పద్ధతులతో సత్యాన్వేషణ చేసుకో’ అని ఆదిశంకరులు తన అనుంగు శిష్యులకు సందేశమిచ్చారు. ఆధ్యాత్మిక సాధకులకు అటువంటి సందేశాలు సదా అనుసరణీయం.

- విశ్వనాథ రమ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న