నాగపంచమి

అంతర్యామి

నాగపంచమి

ప్రాణులన్నింటినీ మనం భగవత్స్వరూపంగా భావిస్తాం. అయినప్పటికీ జీవకోటి అన్నింటిలోనూ ప్రత్యేకంగా ఆలయ నిర్మాణాన్ని పొంది ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే గౌరవాన్ని దక్కించుకున్నది ఒక్క సర్పజాతి మాత్రమే. నాగుల్ని పూజించడమంటే ప్రకృతిని ఆరాధించడం. కీడు తలపెట్టే ప్రాణిలో సైతం పరమాత్మను చూడాలన్న సందేశమివ్వడం. వ్యవసాయాధారితమైన మనదేశంలో పంటల అభివృద్ధిని ఆటంకపరచే అనేక ప్రాణుల నుంచి పంటను, ప్రాణాలను కాపాడమనే వేడుకోలు నాగపంచమి వేడుకలు.
శ్రీమహాలక్ష్మికి ఇష్టప్రదమైనది శ్రావణమాసం. తాను ధాన్యలక్ష్మిగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన వర్షాలతో ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది. శ్రావణమాసం శుక్లపక్ష పంచమిని నాగ పంచమి పర్వదినంగా జరుపుకోవాలని ఆ పూజా విశేషాల్ని  స్కాంద పురాణంలోని ప్రభాస ఖండం తెలియజెబుతోంది.
నాగపంచమి పర్వదినంనాడు ఇంటి ద్వారానికి ఇరువైపులా నాగదేవత రూపాన్ని గోమయంతో చిత్రించడంతోపాటు నాగదేవతా ఉపాసకులు స్వర్ణ, రజత, కాష్ట (కర్ర), మృత్తిక(మట్టి)ల్లో ఒకదానితో అయిదు పడగల నాగరాజు బొమ్మను తయారు చేస్తారు. ఈ పూజలో ఆనవాయితీగా సర్పజాతికి ఇష్టమైన సంపెంగ, గన్నేరు పుష్పాలతోను పసుపు చంద నాదులతోను పూజించడం వల్ల నాగదేవత ప్రీతి చెందు తుందంటారు.
పూర్వం క్షీరసాగర మథనం నుంచి ఉచ్చైశ్రవం అనే గుర్రం జన్మించింది. అది పాల లాంటి తెల్లని రంగుతో ఉంది. కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకనాడు సముద్రం ఒడ్డున విహరిస్తూ వారిద్దరూ ఈ గుర్రాన్ని చూశారు. గుర్రం తోక నల్లగా ఉందని కద్రువ వాదించింది. ఉదయం నాటికి గుర్రం తోక నల్లదిగా నిరూపిస్తే జీవితాంతం ఆమెకు దాస్యం చేయగలనని కద్రువతో వినత పలికింది. కద్రువ తన సంతానమైన నాగులన్నింటినీ పిలిచి గుర్రం తోకను చుట్టుకొని నల్లగా కనిపించేలా చేయమన్నది. తక్షకుడు, కర్కోటకుడు మొదలైన సర్పాలు మినహా ఎక్కువ నాగులు అందుకు అంగీకరించలేదు. తన మాట వినని సంతానం భవిష్యత్తులో జనమేజయుడు చేసే సర్పయాగంలో ఆహుతై పోగలరని, వాటి దేహం ఎల్లప్పుడూ వేడిగా మండుతుందని కద్రువ శపించింది. ఆ మాటలకు చింతిస్తున్న నాగుల ఎదుట బ్రహ్మ ప్రత్యక్షమై శ్రావణమాసం బహుళ పంచమి నాడు జనమేజయుడు సర్పయాగం ముగిస్తాడని ప్రాణాలకు ఆపద లేదని అభయమిచ్చాడు. నాటి నుంచి నాగజాతి సంతోషానికి కారణమైన శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
సర్పాలు భూమి కలుగుల్లోను, వృక్షాలను ఆశ్రయించి ఉన్నందు వల్ల నాగ పంచమి పర్వదినంనాడు భూమిని తవ్వడం, చెట్లను నరకడం అపరాధంగా చెబుతారు. పుట్టలోని నాగేంద్రుడికి పాలు సమర్పించిన పిమ్మట పుట్టమట్టి చెవులకు రాయడం తరచుగా చూస్తుంటాం. గోక్షీరంతో తడిసిన పుట్టమన్నులో ఔషధ గుణాలు వృద్ధిచెంది శ్రవణ సంబంధమైన వ్యాధులకు మందుగా పనిచేస్తాయనేది పెద్దల అనుభవం.

- గోలి రామచంద్రరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న