హనుమాన్‌ చాలీసా

అంతర్యామి

హనుమాన్‌ చాలీసా

నుమపరంగా వెలసిన అపార స్తోత్ర వాంగ్మయంలో ‘హనుమాన్‌ చాలీసా’ మకుటాయమానమైంది. దీని కర్త సంత్‌ తులసీదాస్‌. గోస్వామిగా ప్రసిద్ధుడైన తులసీదాస్‌ క్రీస్తు శకం 1532లో శ్రావణ శుద్ధ సప్తమినాడు ఉత్తర్‌ప్రదేశ్‌లో నేటి బాంధా జిల్లా రాజపుర గ్రామంలో ఆత్మారామ్‌ దూబే, హులసీదేవి దంపతులకు జన్మించాడు. అసలు పేరు రామ్‌ బోలా. అతడు పుట్టిన నక్షత్రం మంచిది కాదని, శిశువు రూపం వికృతంగా ఉందని తల్లిదండ్రులు అతణ్ని ఒక పరిచారికకు అప్పగించారని; తల్లిదండ్రులు, దాది మరణించాక ఆ బాలుడు అనాథ అయ్యాడని అంటారు. అనాథ బాలుణ్ని నరహరిదాస్‌ అనే యోగి చేరదీసి తులసీదాస్‌గా నామకరణం చేసి విద్యాబుద్ధులు నేర్పించాడని చెబుతారు. గురువు ఉపదేశించిన తారకమంత్ర ప్రభావంతో తులసీదాసుకు శ్రీరామనామ స్మరణ నిత్యకృత్యమైంది. అచిర కాలంలోనే రామభక్తుడైన భాగవతోత్తముడిగా వినుతికెక్కాడు. రామచరితమానస్‌, హనుమాన్‌ చాలీసా, వినయపత్రిక, సంకట మోచనాష్టకం, జానకీమంగళ, పార్వతీమంగళ, వైరాగ్య సందీపని మొదలైన ఇరవైకి పైగా రచనలు చేశాడు.

‘హనుమాన్‌ చాలీసా’ దేశవ్యాప్తంగా హిందువులకు పారాయణ యోగ్యమైంది. తులసీదాస్‌ ఈ స్తోత్రాన్ని అవధి భాషలో రచించాడు. అవధి ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ, అయోధ్య ప్రాంతాల్లో ఒకప్పుడు జనవ్యవహారంలోని భాష అయినా ఇప్పుడు హిందీ మాండలికంగా భావిస్తున్నారు. హనుమాన్‌ చాలీసాలో నలభై చౌపాయీలు, మూడు దోహాలు ఉన్నాయి. చౌపాయీ, దోహాలు ఛందో విభాగాలు. రెండు ప్రారంభదోహాలు, ఒక అంత్యదోహా మధ్య నలభై చౌపాయీలు రచించాడు తులసీదాస్‌.

హనుమాన్‌ చాలీసా ఆవిర్భావానికి సంబంధించి జనశ్రుతిలో పలు గాథలున్నాయి. భర్త మరణించాడని విలపిస్తున్న ఒక యువతిని చూసి దయార్ద్ర హృదయంతో తులసీదాస్‌ మృతదేహం వద్దకు వచ్చి రామనామం జపించగానే మరణించిన వ్యక్తి బతికాడట. ఈ వార్త నలుదిశలా వ్యాపించి అసంఖ్యాకంగా ప్రజలు గోస్వామి వద్దకు వచ్చి శ్రీరామనామ దీక్ష తీసుకున్నారు. తులసీదాస్‌కు పెరుగుతున్న జనాదరణను ఆ ప్రాంతంలోని మత గురువులు సహించలేక అతడిపై అక్బర్‌ పాదుషాకు చాడీలు చెప్పారు. తులసీదాస్‌ను కొలువుకు పిలిపించిన పాదుషా మహిమలు ప్రదర్శించమన్నాడు. తాను నిమిత్తమాత్రుణ్నని అంతా దైవ నిర్ణయమని తులసీదాస్‌ బదులిచ్చాడు. అతణ్ని అహంకారిగా, వంచకుడిగా భావించి నిర్బంధించవలసిందిగా భటుల్ని ఆజ్ఞాపించాడు అక్బర్‌. రామభక్తుడైన తులసీదాస్‌కు సహాయంగా వానరసేన కొలువులో ప్రవేశించి సైనికుల్ని భయభ్రాంతుల్ని చేసింది. ఆ సమయంలో తులసీదాస్‌కు హనుమ దర్శనం ఇచ్చాడని, అప్పుడు తులసీదాస్‌ చేసిన స్తోత్రరాజమే హనుమాన్‌ చాలీసా అని భక్తుల విశ్వాసం.

రామచరిత మానస్‌ సుందరకాండలోని ‘అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం...’ చాలీసాకు మకుట శ్లోకంవంటిది. జ్ఞాన గుణాలకు సాగరంలాంటి వాడైన హనుమంతుడికి జయం, ముల్లోకాలను ఉజ్జ్వలింపజేసే కపిరాజుకు జయం అంటూ తులసీదాస్‌ స్తోత్రం ప్రారంభించాడు. తులసీదాస్‌ హనుమను సద్గురువుగా కీర్తించాడు. జానకీమాత వరం వల్ల అష్టసిద్ధుల్ని నవనిధుల్ని ప్రసాదించగలడని హనుమను ప్రశంసించాడు.

హనుమజ్జననానికి సంబంధించి చైత్రశుద్ధ పూర్ణిమ, వైశాఖ బహుళదశమి అనే రెండు తిథులు భిన్న సంప్రదాయాల్లో వ్యవహారంలో ఉన్నాయి. ఈ రెంటి మధ్య వ్యవధి నలభై రోజులు. ఆ రోజుల్లో చాలీసా పారాయణం శ్రేష్ఠమని నమ్ముతారు.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న