కలత-వ్యాకులత

అంతర్యామి

కలత-వ్యాకులత

లత ఒక మానసిక అసంతృప్తి. ఐహిక విషయాల వల్ల అది కలుగుతుంది. వయసు, పరిస్థితులు, మానసిక స్థితి, ఆశామోహాలు ఆ జాబితాలోకి వస్తాయి. కోరికలు నెరవేరగానే కలత సమసిపోతుంది. లేదా సర్దుకుపోవడమో, రాజీపడటమో, మరిచిపోవడమో జరుగుతుంది. కొద్దికాలానికే వాటి స్థానంలో మరో కలత మొదలు కావచ్చు. ఇది లౌకికమైన కలత.

ఆధ్యాత్మిక పరంగానూ కొన్ని కలతలు కలుగుతాయి.భగవంతుణ్ని ప్రార్థించేవారు తొలి దశలో తమ కోరికలు నెరవేరాలని, ఆయన అనుగ్రహం తమమీద ఉండాలని  కోరుకుంటారు. అది నెరవేరకపోతే బాధపడతారు. వారి దృష్టిలో దేవుడు, భక్తి, వరాలు తదితరాల గురించి ఆలోచించేదంతా ఆధ్యాత్మికత కాదు. కేవలం ఆశ  మాత్రమే. అందుకే తాము చేసే పూజలు, నోములు, వ్రతాలకు ఇదేనా ఫలితమని బాధపడతారు. ఏ మాత్రమైనా మంచి జరిగితే ఆ కలత సమసి పోతుంది.

వ్యాకులత విషయానికి వస్తే అది కలతకన్నా భిన్నమైనది. అంతరంగాన్ని  కలచివేయడం  దీని స్వభావం. కలత కంటే వ్యాకులత అనేక రెట్లు ఎక్కువ ప్రభావశాలి. ఐహిక విషయాల్లో వ్యాకులత కలిగితే, అది సమసిపోవడానికి పెద్ద ప్రయత్నమే జరగాలి. ఆధ్యాత్మిక పరంగా కలిగే వ్యాకులత అలాంటిది కాదు. అది సమసిపోయేవరకు ప్రయత్నం ఆగదు. ఎవరికైతే ప్రాపంచిక సుఖాలు ఏ మాత్రం రుచించక ధనం, పేరుప్రతిష్ఠలు, సంసార బంధనాలు వంటివి తృణప్రాయంగా కనిపిస్తాయో, అటువంటి వారు వాటిని అలవోకగా విడిచి, భగవంతుడి కోసం అన్వేషిస్తారు. ఆత్రపడతారు. విలపిస్తారు. అదే ఆధ్యాత్మిక వ్యాకులత. ‘వ్యాకులతే ఆధ్యాత్మికతకు మూలం’ అంటారు వేదాంతులు. 

ఈ ప్రపంచంలో ఎవరికి వారు తమ పాత్రను ఎంత చక్కగా నిర్వహించినా, వారు కోరుకునే నిజమైన శాంతిసౌఖ్యాలు ఎప్పటికీ లభించవు. అప్పుడు మరో మార్గానికి మళ్ళుతారు. మోహనాశం, భక్తి, పారవశ్యం, భగవచ్ఛింతన లాంటివి ఆ కోవలోకి వస్తాయి. ఆధ్యాత్మిక వ్యాకులత తొలిదశలో భక్తులు పూర్తి జ్ఞానం కలిగి ఉన్నవారైనప్పటికీ మోహానికి గురవుతూ ఉంటారు. వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే- భగవంతుడు ఎల్లప్పుడూ తన ఒక్కడికే చెందిన వాడై ఉండాలనే మంకుతనంతో ఉంటారు.

మీరాబాయి కృష్ణుడి రాకకోసం, రామకృష్ణ పరమహంస కాళీమాత సాక్షాత్కారం కోసం, గొడగూచి భగవంతుడు వచ్చి ప్రసాదం స్వీకరించడం కోసం, శబరి రాముడి దర్శనం కోసం, సాలీడు-ఏనుగు తమ పూజ తిరస్కరణకు గురవుతున్నదని, కన్నప్ప శివుడి కళ్లకు ఏ ముప్పు వాటిల్లిందో తెలియక... ఇలా ఎందరో, ఎన్నోరకాల- భగవంతుడి కోసం, ఆయన అనుగ్రహం కోసం తొలిదశలో వ్యాకులపడ్డారు. వారి వ్యాకులత దానంతట అదే తీరిపోయింది. వారు భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటమే కాదు, దాన్ని తగిన రీతిలో ప్రదర్శించారు!

ప్రాపంచిక బంధాల పట్ల వ్యామోహం తొలగిపోయి, అల్ప విషయాల వల్ల తమ శక్తియుక్తులు వృథా చేయకుండా, ఏమరుపాటు సోమరితనం లాంటివి లేకుండా భగవల్లీలల పట్ల ఆపేక్ష, తపన దహించి వేస్తూ ఉంటే- వ్యాకులత సమసిపోతుంది. లేదంటే వారి సాధనలోనో, ఆలోచనల్లోనో లోపం ఉన్నట్టే.

స్వీయ సాధనతో భగవంతుడి లీలలు తెలుసుకొని జ్ఞాన సంపన్నులు కావాలి. అలాంటి జ్ఞాన సంపన్నులకు జీవుడు వేరు, దేవుడు వేరు అని కాకుండా  ఏ వస్తువునైనా చూసేటప్పుడు, ఏ శబ్దాన్నైనా వినేటప్పుడు, దేన్నైనా తాకినప్పుడు... ఏ రకమైన మోహానికీ గురికాడు. అలాగే భగవంతుడి విషయంలోనూ ప్రవర్తిస్తారు. అప్పుడు  కలిగేది వ్యాకులత కాదు... మిగిలేది విశ్వవ్యాపకత!

- అయ్యగారి శ్రీనివాసరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న