గెలిపించే విశ్వాసం

అంతర్యామి

గెలిపించే విశ్వాసం

మానవ జీవితం కొనసాగడానికి పునాది విశ్వాసం. జీవితాన్ని సన్మార్గంలో నడిపించే ఆధ్యాత్మికతకు మూలం విశ్వాసం. అది ధైర్యాన్నిచ్చే ఇంధనంగా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక జీవనానికి పురోగతి కల్పిస్తుంది. మనిషి నిత్యం భగవంతుడిపై విశ్వాసం కలిగి ఉండటంలోనే, ఔన్నత్యం తెలుస్తుంది. అటువంటి వ్యక్తులు ఏ కార్యం తలపెట్టినా సంపూర్ణ విశ్వాసంతో పూర్తిచేసి, విజేతలు అవుతారు.

విశ్వాసం బుద్ధిని ఎప్పటికప్పుడు శుద్ధిచేసి, అనుమానాల్ని, భయాల్ని పారదోలుతుంది. ఈ రెంటికీ విరుగుడు ధైర్యం, విశ్వాసమే. విశ్వాసం కలిగినవారు ప్రతిఫలాపేక్షకు అతీతంగా ఉంటారు. తాబేలు, కుందేలు కథలో- కుందేలు బుద్ధిఅలసత్వం, అహంకారంతో ఆలోచించబట్టే సునాయాస విజయాన్ని అనూహ్యంగా చేజార్చుకుంది. తాబేలు విశ్వాసంతో ఫలాపేక్షరహితంగా ముందుకు సాగి, ఊహించని విజయాన్ని దక్కించుకుంది. కుందేలుతో పోటీకి తాబేలు ధైర్యంగా దిగడమే విశ్వాసరహస్యం.

విశ్వాసం బ్రహ్మాస్త్రం వంటిది. దాన్ని అండగా ఉంచుకోవాలే తప్ప, అయిన దానికి కానిదానికి ప్రయోగించకూడదు. పట్టుదల, నమ్మకం, చిత్తశుద్ధి, ఏకాగ్రత... ఈ అస్త్రాలన్నీ విఫలం అయినప్పుడు, చివరి ప్రయత్నంగా మాత్రమే దాన్ని ప్రయోగించాలి. తలపెట్టిన కార్యం నెరవేరాలంటే అంతరంగంలో సంపూర్ణ విశ్వాసం ఉండాలి. కంటికి కనిపించని అంతరంగం ఆకాశం కంటే విశాలమైనది. నిరంతర సాధనతో సంప్రాప్తించేదే శాశ్వత విశ్వాసం. అది భగవంతుడితో అనుసంధానం చేస్తుంది. ఆ మహోన్నత విశ్వాసాన్ని సాధించి, కొనసాగించేవారే మహత్కార్యాలు చేయగలుగుతారు.

విశ్వవ్యాపి అయిన భగవంతుడి సాన్నిధ్యం పొందడం అంత సులభం కాదు. ఈత నేర్చుకోవాలంటే నీటిలోకి దిగాల్సిందే. ఈత మీద విశ్వాసం ఉన్నవారు సముద్రంలోనైనా నిర్భయంగా దూకగలరు. అదేవిధంగా ఆధ్యాత్మిక సంద్రాన్ని ఈదడానికి నిరంతర సాధన, అచంచల విశ్వాసాలే ముఖ్య సాధనాలు.

విశ్వాసం ఒక్కసారే ప్రవేశిస్తుంది. అది భయాన్నీ, దాని వారసులైన అనుమానం, అభద్రత, అపజయ భావన, ఫలాపేక్ష, తాత్కాలిక ప్రయోజనాల వంటి అవరోధాల్ని పారదోలి ధైర్యాన్ని, నమ్మకాన్ని కలగజేస్తుంది.

శాశ్వత విశ్వాసానికి విఘాతం ఉండదు. ఉంటే అది విశ్వాసం కాదు. రావణాసురుడు, భస్మాసురుడు, గజాసురుడు వంటి దానవులు అచంచల విశ్వాసంతో ఏళ్ల తరబడి కఠోర తపస్సు చేసి భగవంతుణ్ని మెప్పించారు. కానీ ఏం లాభం? భగవంతుడు ప్రత్యక్షమై, వరాలు కోరుకొమ్మనగానే వికృత వరాలు కోరి కిరాతకులుగా చరిత్రలో మిగిలిపోయారు.

‘నిరంతర విశ్వాసం గల వ్యక్తుల గాథలే ప్రపంచ చరిత్ర. విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. లోపల దాగి ఉన్న అనంత శక్తిని అభివ్యక్తం చేయడానికి విశ్వాసంతో ప్రయత్నం చేసినవారే చరిత్రకారులు అవుతారు’ అన్నారు స్వామి వివేకానంద.

పదివేల సార్లు అపజయం ఎదురైనా చలించక, విశ్వాసం అందించిన నమ్మకంతో నిరంతర ప్రయత్నం చేసి, చివరికి తాను తలపెట్టిన విద్యుత్‌ బల్బును కనుగొన్న థామస్‌ ఆల్వా ఎడిసన్‌- ప్రపంచానికే వెలుగు ప్రసాదించి చరిత్ర సృష్టించారు.
నిరంతర సాధన, ప్రయత్నం, ధైర్యం, నమ్మకం... ఇవే శాశ్వత విశ్వాసానికి మూలాలు.

- ఎం.వెంకటేశ్వర రావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న