మొహర్రం మాసం

అంతర్యామి

మొహర్రం మాసం

నీటి బుడగలాంటి జీవితానికి ఆద్యంతాలు గ్రహించి నేెలపై అణకువతో నడిచేవారు ఆ కరుణామయుడికి నిజమైన దాసులు.

మరణానంతర జీవితాన్ని నిరాకరిస్తూ మనోవాంఛనే దైవంగా భావించే వ్యక్తులు మార్గ భ్రష్టులు. అటువంటి దైవ తిరస్కారులలో ఈజిప్టును క్రీస్తు పూర్వం (1400-1200) పరిపాలించిన ఫిరౌన్‌ రాజు ఒకడు. పరమ భయంకర నియంతగా పేరొంది బనీ ఇస్రాయిల్‌ ప్రజలపై దౌర్జన్యాలు చేస్తూ అతి దారుణంగా మారణహోమాలకు పాల్పడేవాడు. దర్బారులోని వ్యక్తి బనీ ఇస్రాయిల్‌ జాతిలో ఒక బాలుడు పుడతాడని, ఫిరౌన్‌ పతనానికి కారకుడవుతాడని చెప్పిన భవిష్యవాణి విని అతడు రెచ్చిపోయాడు. గర్భిణులపై నిఘా ఉంచి వారికి పుట్టిన మగ సంతానాన్ని హతమార్చేవాడు. యుకాబిద్‌ అనే బనీ ఇస్రాయిల్‌ మహిళకు పుట్టిన అందమైన పిల్లవాడు మూసా(అ.స.). మూడునెలలు రహస్యంగా బిడ్డను పెంచి పిదప భయంతో దైవంపై భారం వేసి ఒక బుట్టలో ఉంచి నైలు నదిలో విడిచిపెట్టింది. కారణజన్ముడైన ఆ శిశువు ఫిరౌన్‌ అంతఃపురానికి చేరాడు. అల్లాహ్‌ భక్తురాలైన ఫిరౌన్‌ భార్య ఆసియా వివేక విజ్ఞానాలందించి ఆ బిడ్డను దైవ విధేయుడిగా పెంచింది. కొంతకాలం ఈజిప్టుకు దూరంగా మద్‌ యన్‌ ప్రాంతంలో నివసించి ప్రజలు అనుభవిస్తున్న కష్టనష్టాలకు మూసా(అ.స.) చలించిపోయాడు.

ధర్మ రక్షణార్థం మూసా (అ.స.)ను ప్రవక్తగా నియమిస్తూ అల్లాహ్‌ సంభాషించాడు. సోదరుడు హారూన్‌తో కలిసి దైవసందేశాన్ని ప్రజలకు వినిపించి వారిని బానిసబతుకుల నుంచి విముక్తులను చేసేందుకు ప్రయత్నించాడు. మూసా(అ.స.) సందేశాలు తెలుసుకొన్న ఫిరౌన్‌ మండిపడి ప్రజలను మరింతగా ఆగ్రహంతో వేధించి అమాయకులను ఊచకోత కోయిస్తూ బీభత్సాన్ని సృష్టించాడు. వారు చివరకు మూసా(అ.స.)ను కాపాడమని వేడుకొన్నారు. వారిని రక్షించి ఈజిప్టును వదిలి వలస పోయేందుకు సన్నద్ధమైన మూసా(అ.స.)ను ఫిరౌన్‌ సైన్యంతో వెంబడించాడు. సముద్రాన్ని నీ చేతి కర్రతో కొట్టు అన్న దైవవాణి విని మూసా(అ.స.) అలా చేశారు. మరుక్షణం సముద్రం రెండుగా చీలి దారి ఇచ్చిందని, దివ్య ఖురాన్‌ గ్రంథంలోని అష్‌ షురా ఇరవై ఆరో సూరా వివరించింది. మూసా(అ.స.) అనుచరులు, ఆయనను నమ్మిన ప్రజలు ఆ దారిలో ముందుకు వెళ్ళిన తరవాత సముద్రం కలిసిపోయింది. ఫిరౌన్‌ రాజు, అతడి సైనికులు ఆ ఉప్పు నీటిలో కలిసిపోయారు.

అల్లాహ్‌ కృపతో ప్రవక్త మూసా(అ.స.) ఫిరౌన్‌ను అంతమొందించి విజయం సాధించిన రోజు పవిత్ర మొహర్రం మాసంలోని పదోరోజు. దైవాదేశాలు వినిపించి ప్రజలను సంస్కరించి ఉత్తమ సమాజాన్ని నెలకొల్పిన ప్రవక్త మూసా(అ.స.) జీవన సాఫల్యం పొందారు. పవిత్ర మొహర్రం ఇస్లామిక్‌ క్యాలండర్‌లో మొదటి మాసం. పదోరోజును ఆషురా ఉపవాస దినంగా విశ్వాసులు పాటిస్తారు.

చివరి ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) మనవడు హజ్రత్‌ ఇమాం హుస్సేన్‌(ర.అ.) ప్రజల కోసం ప్రాణత్యాగం చేసినది ఇదే రోజు. కర్బలా మైదానంలో శత్రువు యాజిద్‌ సైనికులతో యుద్ధం చేస్తూ నమాజు సమయంలో గుర్రం నుంచి కిందకు దిగి హజ్రత్‌ ఇమాం హుసేన్‌ షహీదులయ్యారు. వారి ఆత్మశాంతి కోసం ప్రజలు మసీదులలో ప్రార్థనలు చేస్తారు. ఎంతో చారిత్రక ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన మొహర్రం మాసం అల్లాహ్‌ వైపు మరలమని మానవాళికి ఉద్బోధిస్తుంది.

- షేక్‌ బషీరున్నీసా బేగం


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న